Owaisi: నివాసంపై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు
ABN , Publish Date - Jun 29 , 2024 | 02:42 PM
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ దాడి ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్‌లోని పోలీస్‌స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
న్యూఢిల్లీ, జూన్ 29: ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ దాడి ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్‌లోని పోలీస్‌స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అధికార నివాసంపై ఆగంతకులు గురువారం రాత్రి దాడి చేశారు. ఈ ఘటనపై శుక్రవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఒవైసీ ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు స్పీకర్ ఓం బిర్లా సమన్లు జారీ చేసిన విషయం విధితమే. మరోవైపు తన నివాసంపై దాడి జరిగిన అనంతరం ఎక్స్ వేదికగా ఒవైసీ స్పందించారు.
తన నివాసంపై దుండగులు దాడి చేసి.. నేమ్ ప్లేట్‌పై నల్ల ఇంక్ చల్లారన్నారు. న్యూఢిల్లీలోని తన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్ని సార్లు దాడి జరిగిందో లెక్కలేదని తెలిపారు. ఈ విషయంలో తామేమి చేయలేమని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు చేతులెత్తేశారని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఇది మీ పర్యవేక్షణలో జరుగుతుందని.. ఎంపీల భద్రతకు గ్యారంటీ ఉందా? లేదా? అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ప్రశ్నించారు. వీరిద్దరి పేర్లను ట్యాగ్ చేసి ఒవైసీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తన నివాసంపై దాడిని సావర్కర్ తరహా పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. ఇంకు చల్లినా, రాళ్ల దాడి చేసిన తాను భయపడే ప్రసక్తే లేదని ఓవైసీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సమీపంలో ఒవైసీ నివాసం ఉంటుంది.
Latest Telugu News And National News