Srinagar : అమరథ్ యాత్రకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Jun 23 , 2024 | 04:50 AM
వారం రోజుల్లో ప్రారంభం కానున్న అమరనాథ్ యాత్రకు సర్వం సిద్ధమయింది. పటిష్ఠమైన రక్షణ చర్యలు చేపట్టామని, యాత్రికుల కోసం మెరుగైన సౌకర్యాలను కల్పించామని జమ్మూకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.
యాత్రికులకు మరింత మెరుగైన సౌకర్యాలు
యాత్ర పొడవునా పటిష్ఠమైన రక్షణ చర్యలు
ప్రథమ పూజలో పాల్గొన్న గవర్నర్ మనోజ్ సిన్హా
శ్రీనగర్/జమ్ము, జూన్ 22: వారం రోజుల్లో ప్రారంభం కానున్న అమరనాథ్ యాత్రకు సర్వం సిద్ధమయింది. పటిష్ఠమైన రక్షణ చర్యలు చేపట్టామని, యాత్రికుల కోసం మెరుగైన సౌకర్యాలను కల్పించామని జమ్మూకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. అమరనాథ్ యాత్ర ప్రారంభానికి సూచికగా శనివారం నిర్వహించిన ‘ప్రథమ పూజ’లో రాజ్‌భవన్ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న సిన్హా మీడియాతో మాట్లాడారు. ‘ఈనెల 29న యాత్ర ప్రారంభం అయిన తరవాత దేశవ్యాప్తంగా భక్తులకు దర్శనం లభిస్తుంది. దేవస్థానం బోర్డు, జేకే పాలనాయంత్రాంగం యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. గత రెండేళ్లుగా సౌకర్యాలు చాలా మెరుగయ్యాయి. ఆలయ గుహకు వెళ్లే రహదారులకు మరమ్మతులు నిర్వహించాం. సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌ఓ) కొన్నిచోట్ల రోడ్లను వెడల్పు చేసింది.
ఈసారి యాత్ర ప్రశాంతంగా జరుగుతుందని భావిస్తున్నా. యాత్రికులకు ఎప్పటిలాగే సహాయ సహకారాలను అందించాలని యాత్ర కొనసాగే మార్గంలోని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. యాత్ర ప్రశాంతంగా సాగితే అది ప్రపంచవ్యాప్తంగా జమ్మూకశ్మీర్ ఖ్యాతిని ఇనుమడింప చేస్తుంది’ అని గవర్నర్ సిన్హా పేర్కొన్నారు. అనంతరం వివిధ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రారంభించారు. మరోవైపు జమ్మూకశ్మీర్ ఏడీజీపీ ఆనంద్ జైన్, 270 కి.మీ. శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారి వెంబడి రక్షణ చర్యలను పలువురు పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
అనంతరం ఆయన పలు కీలకమైన ప్రాంతాల్లో కమ్యూనిటీ కిచెన్‌లను, చెకింగ్ పాయింట్లను తనిఖీ చేశారు. జాతి వ్యతిరేక శక్తులు యాత్ర భగ్నానికి ప్రయత్నం చేసే అవకాశాలను పేర్కొంటూ నిరంతరాయంగా పటిష్ఠ రక్షణ చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
అనుమానాస్పద కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని చెప్పారు. యాత్రికుల పట్ల స్నేహపూర్వక వ్యవహార శైలిని కలిగి ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడానికైనా సిద్ధంగా ఉండాలని ఏడీజీపీ జైన్ సూచించారు.