Share News

EVMs : ఈవీఎంలు వాడొద్దు..

ABN , Publish Date - Jun 17 , 2024 | 06:05 AM

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఈవీఎంల భద్రతపై చర్చ సాగుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం అది తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ చేసిన ఆరోపణలతో ఈవీఎంల అంశం

EVMs : ఈవీఎంలు వాడొద్దు..
EVM

  • వాటిని హ్యాకింగ్‌ చేయడానికి అవకాశం ఉంది

  • టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌

  • ఇక్కడ ఈవీఎంలు పూర్తి సురక్షితమైనవి

  • కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌

న్యూఢిల్లీ, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఈవీఎంల భద్రతపై చర్చ సాగుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం అది తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ చేసిన ఆరోపణలతో ఈవీఎంల అంశం దేశవ్యాప్తంగా మరోసారి దుమారం రేగుతోంది. ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలను కొంతమేరకు హ్యాక్‌ చేసే అవకాశాలున్నాయని, అందుకే వాటిని వాడకుండా పక్కన పెట్టాలని ఎక్స్‌ వేదికగా మస్క్‌ పోస్టు చేశారు. ప్యూర్టోరికో ఎన్నికల్లో అవకతవకలపై అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడీ మేనల్లుడు రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీ జూనియర్‌ ఇటీవల చేసిన పోస్టుకు మస్క్‌ స్పందించారు. ‘ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను తొలగించాలి. మనుషులు లేదా ఏఐ ద్వారా వాటిని హ్యాకింగ్‌ చేసే ప్రమాదం ఉంది. ఇది చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నప్పటికీ దీని పర్యవసానాలు మాత్రం భారీగా ఉంటాయి’ అని మస్క్‌ ట్వీట్‌ చేశారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఘాటుగా స్పందించారు. ‘మస్క్‌ వ్యాఖ్యలు అన్నింటినీ సాధారణీకరిస్తున్నట్లుగా ఉన్నాయి. ఇంటర్నెట్‌ కనెక్టెడ్‌ యంత్రాలను నిర్మించడానికి సాధారణ కంప్యూటర్‌ ప్లాట్‌ఫాంలు ఉపయోగించే అమెరికా, ఇతర దేశాలకు అయన చెప్పిన అంశాలను అన్వయించుకోవచ్చేమో గానీ భారతీయ ఈవీఎంలు పూర్తిగా సురక్షితమైనవి. ఏ నెట్‌వర్క్‌ లేదా మీడియాతో కనెక్ట్‌ కాని విధంగా వాటిని డిజైన్‌ చేశారు. వీటికి బ్లూటూత్‌, ఇంటర్నెట్‌, వైఫైతో ఎలాంటి కనెక్టివిటీకి అవకాశమే లేదు. పేపర్‌ బ్యాలెట్లతో పోలిస్తే ఇవి విశ్వసనీయమైన ఓటింగ్‌ పద్ధతిగా కొనసాగుతున్నాయి’’ అని రాజీవ్‌ స్పష్టం చేశారు. దీనిపై మస్క్‌ స్పందిస్తూ.. ‘దేన్నయినా హ్యాక్‌ చేయవచ్చు’ అంటూ మరో ట్వీట్‌ చేశారు.


బ్లాక్‌ బాక్సులుగా ఈవీఎంలు: రాహుల్‌

ఈవీఎంల భద్రతపై మస్క్‌ చేసిన ట్వీట్‌ను విపక్ష పార్టీ నేతలు విస్తృతంగా షేర్‌ చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మౌనం వహించడంపై నిలదీస్తున్నారు. మస్క్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆదివారం స్పందించారు. భారత్‌లో ఈవీఎంలు బ్లాక్‌బాక్సులుగా మారాయని, వాటిని పరిశీలించేందుకు ఎవరినీ అనుమతించడం లేదని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, వ్యవస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఓ బూటకంగానే మిగిలిపోతుందని రాహుల్‌ పేర్కొన్నారు. మస్క్‌ పోస్టుతో పాటు ముంబై నార్త్‌ వెస్ట్‌ లోక్‌సభ స్థానంలో గెలిచిన రవీంద్ర వైకర్‌ బంధువులు ఈవీఎంలకు కనెక్ట్‌ చేసిన ఫోన్‌ను ఉపయోగిస్తున్నారంటూ వచ్చిన వార్తా కథనాన్ని ఆయన పంచుకున్నారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ సైతం మస్క్‌ పోస్టును షేర్‌ చేశారు. ‘సాంకేతికత అనేది సమస్యలను తొలగించడానికి ఉపయోగపడాలి. అంతేకానీ అదే సమస్యలకు కారణమైతే.. దాని వాడకాన్ని వెంటనే ఆపేయాలి’ అని ఆయన పేర్కొన్నారు.

For More National News and Telugu News..

Updated Date - Jun 17 , 2024 | 10:34 AM