Share News

Kolkata: డబ్బుపై కాంక్ష లేదమ్మా.. నా పేరు పక్కన డిగ్రీలుండాలి

ABN , Publish Date - Sep 07 , 2024 | 05:47 AM

తమ కూతురు దారుణ హత్యాచార ఘటన మిగిల్చిన విషాదం నుంచి జూనియర్‌ వైద్యురాలి తల్లిదండ్రులు ఇంకా తేరుకోవడం లేదు.

Kolkata: డబ్బుపై కాంక్ష లేదమ్మా.. నా పేరు పక్కన డిగ్రీలుండాలి

  • నా బిడ్డ నాతో ఎప్పుడూ ఇవే చెప్పేది

  • జూనియర్‌ వైద్యురాలి తల్లి ఆవేదన

కోల్‌కతా, సెప్టెంబరు 6: తమ కూతురు దారుణ హత్యాచార ఘటన మిగిల్చిన విషాదం నుంచి జూనియర్‌ వైద్యురాలి తల్లిదండ్రులు ఇంకా తేరుకోవడం లేదు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హతురాలి తల్లి విడుదల చేసిన ఓ బహిరంగ లేఖ మానవతావాదులను కన్నీరు పెట్టిస్తోంది. తమ కుమార్తెకు డాక్టర్‌ కావాలనే కోరిక బలంగా ఉండేదని చెబుతూ.. ‘అమ్మా.. నాకు డబ్బు మీద మోజు లేదు.. నా పేరు పక్కన వైద్యురాలిగా డిగ్రీలు ఉండాలి.. నేను ఎప్పుడూ రోగులకు వైద్యసేవలు చేస్తూ ఉండాలి’ అని తనతో అనేదని ఆ తల్లి లేఖలో పేర్కొంది. ఆమె కన్న ఈ కలలన్నింటినీ చిదిమేశారని ఆవేదన వ్యక్తింది.


చిన్నప్పటి నుంచి తమ కూతురు డాక్టర్‌ కావాలని కలలు కన్నదని.. ఆ దిశగా ఆమెను ఉపాధ్యాయులు వెన్నుతట్టి ప్రోత్సహించడంతోనే తన స్వప్నం నేరవేరిందని.. ఇందుకు ఆ టీచర్లందరికీ ధన్యావాదాలు తెలుపుకొంటున్నానని పేర్కొంది. ఆర్జీకర్‌ ఆస్పత్రిలోని ఘటనాస్థలిలో ఆధారాలను చేరిపేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆమె ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా ఆర్జీకర్‌ ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ నివాసాలపై ఈడీ శుక్రవారం దాడులు చేసింది. ఘోష్‌ సహచరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. ఘోష్‌కు అత్యంత సన్నిహితుడు, తనకు తాను ఘోష్‌కు పీఏగా చెప్పుకొనే ఆస్పత్రి డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ప్రసూన్‌ ఛటోపాధ్యాయ ఈడీ అదుపులోకి తీసుకుంది.

Updated Date - Sep 07 , 2024 | 05:47 AM