Share News

Harishankar Jain: భోజశాల కింద 94 విరిగిన విగ్రహాలు!

ABN , Publish Date - Jul 16 , 2024 | 03:36 AM

మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజశాల-కమల్‌ మౌలా మసీదు సముదాయం కింద 94కి పైగా విరిగిన విగ్రహాలు దొరికినట్లు భారతీయ పురావస్తు విభాగం (ఏఎస్ఐ ) తన శాస్త్రీయ సర్వేలో తేల్చిందని న్యాయవాది హరిశంకర్‌ జైన్‌ తెలిపారు.

Harishankar Jain: భోజశాల కింద 94 విరిగిన విగ్రహాలు!

  • హిందూ పిటిషనర్ల న్యాయవాది వెల్లడి

  • మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు శాస్త్రీయ సర్వే నివేదిక సమర్పించిన ఏఎస్ఐ

ఇండోర్‌, జూలై 15: మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజశాల-కమల్‌ మౌలా మసీదు సముదాయం కింద 94కిపైగా విరిగిన విగ్రహాలు దొరికినట్లు భారతీయ పురావస్తు విభాగం తన శాస్త్రీయ సర్వేలో తేల్చిందని న్యాయవాది హరిశంకర్‌ జైన్‌ తెలిపారు. అక్కడ హిందూ ఆలయం ఉందనడానికి ఇదే నిదర్శనమని..

అక్కడ హిందూ పూజలు మాత్రమే నిర్వహించాలని సోమవారమిక్కడ తెలిపారు. వివాదాస్పద కట్టడంపై శాస్త్రీయ సర్వే నిర్వహించి తమకు నివేదిక సమర్పించాలని మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇండోర్‌ బెంచ్‌ ఈ నెల 4న ఇచ్చిన ఆదేశాల మేరకు ఏఎ్‌సఐ సర్వే పూర్తిచేసింది. దాని తరఫు న్యాయవాది హిమాంశు జోషీ సోమవారం 2,000 పేజీల తన రిపోర్టును కోర్టుకు అందజేశారు.

22న దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతుందని తెలిపారు. ధార్‌ జిల్లాలో 11వ శతాబ్దికి చెందిన ఈ భోజశాలను వాగ్దేవి (సరస్వతీదేవి) ఆలయంగా హిందువులు విశ్వసిస్తారు. ఇది కమల్‌ మౌలా మసీదు అని ముస్లింలు వాదిస్తున్నారు. 2003 ఏప్రిల్‌ 7న(ఏఎస్ఐ ) భోజశాలలో ప్రతి మంగళవారం హిందువులు పూజ చేసుకోవడానికి, ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్‌ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

దీనిని వ్యతిరేకించిన ‘హిందూ ఫ్రంట్‌ ఫర్‌ జస్టిస్‌’ సంస్థ శాస్త్రీయ సర్వే నిర్వహించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది .కాగా, శాస్త్రీయ సర్వే జరపాలన్న హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మౌలానా కమాలుద్దీన్‌ వెల్ఫేర్‌ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది.

Updated Date - Jul 16 , 2024 | 03:36 AM