మహారాష్ట్రలో ముగిసిన ప్రచారం.. రేపే పోలింగ్
ABN , Publish Date - Nov 19 , 2024 | 02:25 AM
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది.
మహారాష్ట్రలో 2 కూటములకూ సవాలే
ముగిసిన ప్రచారం.. రేపు పోలింగ్
ఝార్ఖండ్‌లో చివరిదశ ఓటింగ్
నిజామాబాద్, న్యూఢిల్లీ, నవంబరు18(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ఆదిలాబాద్: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. బుధవారం జరిగే పోలింగ్‌పైనే దేశం దృష్టి కేంద్రీకృతమైంది. శివసేన(ఉద్దవ్ థాకరే వర్గం), ఎన్‌సీపీ(శరద్ పవార్), కాంగ్రె్‌సతో కలిసి మహావికాస్ అఘాడీ పేరుతో పోటీ చేస్తుండగా, శివసేన(షిండే), ఎన్‌సీపీ(అజిత్‌పవార్), బీజేపీ కలిసి మహాయుతి పేరుతో పోటీ చేస్తున్నాయి. మహారాష్ట్రలోని 288 సీట్లలో బీజేపీ అత్యధికంగా 152 స్థానాలకు పోటీ చే స్తోంది. బీజేపీకి చెందిన మరో 19 మంది నేతలు ఎన్‌సీపీ, శివసేన టికెట్లపై పోటీ చేస్తున్నారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ- 59, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన- 81 సీట్లకు పోటీ చేస్తున్నాయి. మహా వికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ అత్యధికంగా 102, ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన- 96, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ- 86 చోట్ల పోటీ చేస్తున్నాయి. బీజేపీతో కాంగ్రెస్- 76 చోట్ల నేరుగా తలపడుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కుల, మత రాజకీయాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. హిందువులంతా కలిసికట్టుగా ఓటు వేయాలని, ఓట్లు చీలకూడదని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. ఏక్ హైతో సేఫ్ హై, బటేంగేతో కటేంగే పేరిట మోదీ, అమిత్ షా, యోగి ఇచ్చిన నినాదాలు ఈ ఎన్నికల్లో ప్రచారాంశాలయ్యాయి. అదానీ ఒక్కడికే అన్నీ దక్కాలని మోదీ భావిస్తున్నారని, అందుకే ఏక్ హైతో సేఫ్‌హై అని నినాదం చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికల ముందు మహిళల కోసం మహాయుతి కూటమి ప్రభుత్వం ప్రకటించిన లాడ్లీ బెహనా యోజన గేమ్ ఛేంజర్‌గా మారనున్నదని బీజేపీ అంచనా వేస్తోంది.
జార్ఖండ్‌లో చివరిదశ పోలింగ్
జార్ఖండ్‌లో చివరిదశలో భాగంగా 38 స్థానాలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. హేమంత్ సొరేన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే నేతలు ధీమాగా ఉన్నారు.
తెలంగాణ సరిహద్దులో ఇదీ పరిస్థితి
తెలంగాణ సరిహద్దులో మహారాష్ట్రలోని నాందేడ్, యావత్‌మాల్, చంద్రాపూర్, గచ్చిరోలి జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలో మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో తెలుగు వచ్చిన వారు ఎక్కువగా ఉండటంతో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఎంవీఏ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. మహాయుతి తరపున ఏపి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. యవత్‌మాల్, చంద్రాపూర్, నాందెడ్ జిల్లాల పరిధిలోని కేళాపూర్, రాజురా, డిగ్రస్, కిన్వట్, వణి, చంద్రాపూర్, బల్లార్ష 7 నియోజక వర్గాలలో బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లుంది. తెలంగాణ మాజీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ మాణిక్‌రావ్‌ఠాక్రె పోటీ చేస్తున్న డిగ్రస్ నియోజకవర్గంలో కాంగ్రె్‌సకు బీజేపీ నుంచి తీవ్రమైన పోటీ కనిపిస్తుంది.
ఒక్కటిగా ఉంటే.. బాగుండేది అదానీయే!
ముంబై, నవంబరు 18: ‘అందరూ ఒక్కటిగా ఉంటేనే భద్రత (ఏక్ హై తో సేఫ్ హై)’ అని మోదీ ఇచ్చిన నినాదాన్ని రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. అందరూ ఒక్కటిగా ఉంటే బాగుండేది అదానీయేనన్నారు. వారిద్దరూ కలిసి ఉంటేనే.. ఇద్దరూ క్షేమంగా ఉంటారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగింపు చివరి రోజైన సోమవారం రాహుల్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ఖజానా పెట్టెను తీసుకొచ్చారు. దానిని తెరిచి అందులో మోదీ, అదానీ కలిసి ఉన్న పోస్టర్‌ను తీసి చూపించారు. ముంబైలోని ధారవి పునర్నిర్మాణ ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై బీజేపీ మండిపడింది. అదానీతో రాజస్థాన్, తెలంగాణల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందాల మాటేమిటని నిలదీసింది. ‘తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కారు రూ.12,400 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. రాజస్థాన్‌లో గత అశోక్ గహ్లోత్ ప్రభుత్వం రూ.46 వేల కోట్ల సోలార్ ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టింది. మరి అదానీకి ఎవరితో లింకులున్నట్లు’ అని ప్రశ్నించింది.