MPox: మంకీపాక్స్ డేంజర్‌బెల్స్.. మరో కేసు నమోదు
ABN , Publish Date - Sep 27 , 2024 | 07:12 PM
భారత్‌లో మంకీపాక్స్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేరళలో శుక్రవారం మరో కేసు వెలుగు చూసింది. దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య మూడుకు చేరింది.
మలప్పురం: భారత్‌లో మంకీపాక్స్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేరళలో శుక్రవారం మరో కేసు వెలుగు చూసింది. దీంతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య మూడుకు చేరింది. కేరళ రాష్ట్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. బాధితుడి నమూనాలను వైద్య పరీక్షల కోసం పంపించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చెప్పారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందన్నారు. నిపుణుల పర్యవేక్షణలో బాధితుడికి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. భారత్‌లో సెప్టెంబర్ 9న తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది.
విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలు పరీక్షించగా.. పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్-2 రకంగా నిర్ధారించారు. అనంతరం యూఏఈ నుంచి కేరళకు వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి సెప్టెంబర్ 18న మంకీపాక్స్ నిర్ధారణ అయింది. కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే వారిలో ఎవరికైనా మంకీపాక్స్ లక్షణాలు కనబడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరింది. ఇప్పటి వరకు 122 దేశాల్లో 99 వేలకుపైగా మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) ప్రకటించింది. ఆఫ్రికా దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడ ఆరోగ్య అత్యవసర స్థితి ప్రకటించారు.
మంకీపాక్స్ లక్షణాలు ఏంటి?
మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ సాధారణంగా 2-4 వారాల పాటు ఉంటుందని, సపోర్టివ్ మేనేజ్మెంట్తో రోగులు కోలుకుంటున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమావేశంలో వెల్లడైంది. అలైంగిక సంపర్కం, గాయపడిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం లేదా సోకిన వ్యక్తి దుస్తులు లేదా బెడ్షీట్లను ఉపయోగించడం ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది.
వాపు శోషరస కణుపులు
జ్వరం
చలిగా అనిపించడం
కండరాల నొప్పి
తలనొప్పి
అలసట
చికిత్స ఎలా ?
Mpox చాలా సందర్భాలలో దానంతటదే తగ్గుతుంది. కానీ కొందరిలో ఇది తీవ్రంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేదా సూచించిన మందులు లేవు. రోగికి అతని లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స చేస్తారు. వైద్యులు యాంటీవైరల్ మందులు ఇవ్వడం ద్వారా వ్యాధిని నియంత్రిస్తారు.
Flight Services: శ్రీ రాముడి భక్తులకు అదిరిపోయే వార్త
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి