S Jaishankar: భారత్‌కు శాశ్వత స్థానం దక్కాలంటే.. ఆ పని చేయాల్సి ఉంటుంది
ABN , Publish Date - Apr 02 , 2024 | 10:06 PM
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కచ్చితంగా వస్తుందని, భారత్‌కు ఈ సభ్యత్వం లభించాలనే భావన ప్రపంచవ్యాప్తంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. అయితే.. అందుకోసం మరింత కష్టపడాల్సి ఉంటుందని అన్నారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (United Nations Security Council) భారత్‌కు శాశ్వత సభ్యత్వం కచ్చితంగా వస్తుందని, భారత్‌కు ఈ సభ్యత్వం లభించాలనే భావన ప్రపంచవ్యాప్తంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) పేర్కొన్నారు. అయితే.. అందుకోసం మరింత కష్టపడాల్సి ఉంటుందని అన్నారు. గుజరాత్‌లోని (Gujarat) రాజ్‌కోట్‌లో జరిగిన మేధావుల సదస్సుల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి 80 సంవత్సరాల క్రితం ఏర్పడిందని.. చైనా, ఫ్రాన్స్, రష్యన్ ఫెడరేషన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ దేశాలు భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉండాలని స్వయంగా నిర్ణయించుకున్నామని చెప్పారు. ఆ సమయంలో ప్రపంచంలో మొత్తం 50 స్వతంత్ర దేశాలు ఉండేవని, కాలక్రమంలో అవి 193కి పెరిగాయని వెల్లడించారు.
AP Debt: ఏపీ నెత్తిన మరో బండ.. ఆర్బీఐ నుంచి వేల కోట్ల అప్పు
కానీ.. నియంత్రణ మొత్తం ఆ ఐదు దేశాలే ఉంచుకున్నాయని, ఇప్పుడు మార్పు కోసం ఆ దేశాల సమ్మతిని అడగడం ఆశ్చర్యకరంగా ఉందని జైశంకర్ చెప్పారు. దీనిని కొందరు నిజాయితీగా అంగీకరించి ముందుకొస్తే, మరికొందరు మాత్రం వెనకడుగు వేస్తున్నారని.. ఇది ఎన్నో ఏళ్లుగా సాగుతోందని అన్నారు. ఇప్పుడు మాత్రం ఇది మారాలని, భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించాలనే భావన ప్రపంచవ్యాప్తంగా ఉందని, ప్రతి ఏటా ఈ భావన పెరుగుతూ వస్తోందని చెప్పుకొచ్చారు. భారత్ కచ్ఛితంగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందుతుందని, కానీ కష్టపడకుండా ఏదీ సాధించలేమని సూచించారు. ఇందుకోసం కష్టపడి పని చేయాల్సి ఉంటుందని, ఈసారి మరింత కష్టపడాలని పేర్కొన్నారు. భారతదేశం, జపాన్, జర్మనీ, ఈజిప్ట్ కలిసి ఐక్యరాజ్యసమితి ముందు ఒక ప్రతిపాదనను ముందుంచాయని.. ఇందులో పురోగతి ఉంటుందని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
MLC Kavitha: కవితకు ఆ పుస్తకం ఎందుకు? ఆ పుస్తకాన్నే ఎందుకు అడిగారు?
అయితే.. దీనిపై మనం ఒత్తిడి పెంచాలని జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం యూఎన్ బలహీనపడిందనే భావన ప్రపంచంలో ఉందన్నారు. ఉక్రెయిన్ యుద్ధంపై (Ukraine War) యూఎన్‌లో ప్రతిష్టంభన ఏర్పడిందని.. గాజా విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదని అన్నారు. ఈ ఫీలింగ్ పెరిగేకొద్దీ భారత్‌కు శాశ్వత సభ్యత్వం వచ్చే అవకాశాలు పెరుగతాయని తాను భావిస్తున్నానని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి వృద్ధికి ఆటంకం కలిగించినప్పటికీ.. భారత్ 7 శాతం వృద్ధి సాధించడం పట్ల ప్రపంచం ఆశ్చర్యం వ్యక్తం చేసిందన్నారు. అత్యంత వేగంగా పెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ది చెందుతున్న భారత్.. ప్రపంచ వృద్ధికి ఇంజిన్‌గా మారగలదని ప్రపంచం విశ్వసిస్తోందని చెప్పుకొచ్చారు.