IndiGo Airlines: ఆకాశంలో కుదుపులు.. 30 నిమిషాల నరకం.. చివరికి?
ABN , Publish Date - Jun 21 , 2024 | 11:25 AM
ఒక విమానం గాల్లో ఉన్నప్పుడు.. కుదుపులు అనేవి సర్వసాధారణంగానే సంభవిస్తుంటాయి. ఆకాశంలో వాతావరణం అనుకూలంగా లేనప్పుడో, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడో..
ఒక విమానం గాల్లో ఉన్నప్పుడు.. కుదుపులు (Turbulence) అనేవి సర్వసాధారణంగానే సంభవిస్తుంటాయి. ఆకాశంలో వాతావరణం అనుకూలంగా లేనప్పుడో, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడో.. విమానం కుదుపులకు గురవుతుంటుంది. అయితే.. కొన్నిసార్లు మాత్రం ఈ అలజడి భయానకంగా ఉంటుంది. భూకంపం వచ్చినప్పుడు ఎలాగైతే భవంతులు కుప్పకూలిపోతాయో.. ఆ స్థాయిలోనే విమానంలో అల్లకల్లోలం నెలకొంటుంది. దాంతో.. విమానంలో కూర్చున్న ప్రయాణికుల పరిస్థితి దారుణంగా తయారవుతుంది. సరిగ్గా ఇలాంటి దృశ్యమే ఇండిగో విమానంలో (IndiGo Airlines) కనిపించింది. గాల్లో ఉన్నప్పుడు భారీ కుదుపులకు విమానం గురవ్వడంతో.. ప్రయాణికులు ఏడ్వడం మొదలుపెట్టారు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6E-7406 అనే విమానం జోధ్‌పూర్ నుంచి జైపూర్‌కు బయలుదేరింది. దీని ప్రయాణం సాఫీగానే సాగింది కానీ.. ల్యాండింగ్ సమయంలోనే అసలు సమస్య వచ్చిపడింది. ప్రతికూల వాతావరణం కారణంగా.. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయడానికి వీలు పడలేదు. దీంతో.. ఏమీ చేయలేక సుమారు 30 నిమిషాల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ సమయంలోనే గందరగోళ పరిస్థితి నెలకొంది. విమానం భారీ కుదుపులకు గురయ్యింది. ఆ దెబ్బకు విమానంలోని ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒకానొక దశలో తమ ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో.. చాలామంది ఏడ్చేశారు. ఈ కుదుపుల కారణంగా ఆక్సిజన్ బ్యాగులు కూడా తెరుచుకున్నాయి. చివరికి.. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని జైపూర్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో.. ప్యాసింజర్లు ఊపిరి పీల్చుకున్నారు.
నిజానికి.. షెడ్యూల్ ప్రకారం ఈ విమానం ఉదయమే బయలుదేరాల్సింది. కానీ.. ప్రతికూల వాతావరణం కారణంగా ఐదు గంటల పాటు ఆలస్యం అయ్యింది. ఫైనల్‌గా మధ్యాహ్నం పరిస్థితులు కాస్త అనుకూలించడంతో.. 12:02 గంటలకు టేకాఫ్ అయ్యింది. అనంతరం 1:42 గంటలకు జైపూర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. అయితే.. ల్యాండింగ్ సమయంలో సమస్యలు ఏర్పడటం వల్ల 30 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఇదొక భయానక అనుభూతి అని, విమానంలో ఉన్నప్పుడు తామెంతా ఆందోళనకు గురయ్యామని ప్రయాణికులు తమ అనుభవాన్ని పంచుకున్నారు.
Read Latest National News and Telugu News