Share News

Kanpur : రూ.10వేలిస్తేనే కాపాడతాం..

ABN , Publish Date - Sep 03 , 2024 | 02:31 AM

గజ ఈతగాళ్ల దురాశ, నిర్లక్ష్యం వల్ల ఓ అధికారి గంగానదిలో గల్లంతైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.

Kanpur : రూ.10వేలిస్తేనే కాపాడతాం..

  • ఈతగాళ్ల డిమాండ్‌.. యూపీలో అధికారి గల్లంతు

కాన్పూర్‌, సెప్టెంబరు 2: గజ ఈతగాళ్ల దురాశ, నిర్లక్ష్యం వల్ల ఓ అధికారి గంగానదిలో గల్లంతైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. వారాణసీ ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఆదిత్యవర్ధన్‌ సింగ్‌(45) స్నేహితులతో కలిసి శనివారం మధ్యాహ్నం ఉన్నావ్‌ బిల్హౌర్‌లోని నానమౌ ఘాట్‌ వద్దకు పుణ్యస్నానానికి వెళ్లాడు. నది గట్టు నుంచి లోపలికి వెళ్లడం, నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో కొట్టుకుపోయాడు. ఆయనను కాపాడాలని స్నేహితులు అక్కడ ఉన్న ఈతగాళ్లను వేడుకున్నారు. కానీ, వారు రూ.10వేలు కావాలని డిమాండ్‌ చేశారు. నగదు లేకుంటే ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపు చేయాలని పట్టుబట్టారు. కానీ, డబ్బును బదిలీ చేసేలోపే ఆదిత్య ప్రవాహంలో గల్లంతయ్యాడు. ఆదిత్య కోసం ఆదివారం గాలింపు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదని బిల్హౌర్‌ ఏసీపీ అజయ్‌ కుమార్‌ త్రివేది పేర్కొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 02:31 AM