Share News

Wayanad Landslides: వయనాడ్ విలయానికి కారణమదే.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 01 , 2024 | 03:27 PM

కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో కొండచరియలు(Wayanad Landslides) విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే 270కిపైగా మృతదేహాలను బయటకి తీయగా మరో 200లకు పైగా మృతదేహాలు బురదలో చిక్కుకుపోయాయి.

Wayanad Landslides: వయనాడ్ విలయానికి కారణమదే.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో కొండచరియలు(Wayanad Landslides) విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే 270కిపైగా మృతదేహాలను బయటకి తీయగా మరో 200లకు పైగా మృతదేహాలు బురదలో చిక్కుకుపోయాయి. కాగా.. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాగ్వాదం ఇంకా నడుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నేత వీ మురళీధరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే కేరళ మూల్యం చెల్లిస్తోందని విమర్శించారు.

జూలై 23 - 26 తేదీలలో వాతావరణ శాఖతోపాటు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్ బెటాలియన్లు పంపిందని, ప్రజలను తరలించడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వానికి సూచిందని అన్నారు. అయితే కేరళ ప్రభుత్వం ఈ హెచ్చరికలను పట్టించుకోలేదని.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఇదే విషయాన్ని రాజ్యసభలో వెల్లడించారని తెలిపారు.


గతంలోనే హెచ్చరించిన ఏజెన్సీలు..

వయనాడ్‌‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని గతంలో చాలా ఏజెన్సీలు అప్రమత్తం చేశాయని మురళీధరన్ తెలిపారు. జరగబోయే విషాదం గురించి కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ 2020లోనే హెచ్చరించిందని, 4 వేల కుటుంబాలను తరలించాలని సూచించిందని అన్నారు. ‘కొండచరియలు విరిగిపడిన ముండెక్కై గ్రామంలో 18 కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రదేశాలలో ఒకటిగా జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళికలో గుర్తించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ హెచ్చరికలు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ సాధారణ విధానం కారణంగా కేరళ ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.


సున్నితమైన ప్రాంతం..

కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతంగా అధికారులు గుర్తించారని మురళీ చెప్పారు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో 300కు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని.. వాటిని తొలగించడంలో కేరళ సర్కార్ విఫలమైందని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.


ఎక్కడ చూసినా శవాలదిబ్బలే..

బుధవారం ఉదయం సహాయక చర్యలు ప్రారంభమయ్యాక.. ఎక్కడ చూసినా మృతదేహాలు కనిపించాయని సైన్యం, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు తెలిపాయి. చలియార్‌ నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాల సంఖ్య 52గా ఉన్నట్లు వెల్లడించాయి. ముండక్కై, అట్టమల, చురుల్‌మలలో 72 వరకు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు, వేర్వేరు ప్రాంతాల్లో 1000 మందిని కాపాడి, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నాయి.

Updated Date - Aug 01 , 2024 | 03:27 PM