Share News

London: యూకే ప్రధానిగా కియర్‌ స్టార్మర్‌

ABN , Publish Date - Jul 06 , 2024 | 02:57 AM

ఇంగ్లిష్‌ గడ్డపై రాజకీయం మారింది..! మార్పు కావాలి నివాదం పనిచేసింది..! అంచనాలను నిజం చేస్తూ.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది.

London: యూకే  ప్రధానిగా కియర్‌ స్టార్మర్‌

  • ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయం.. మొత్తం 650 స్థానాల్లో 412 గెలుపు

  • కన్జర్వేటివ్‌లకు ఘోర ఓటమి.. 121 సీట్లకు పరిమితం.. సునాక్‌ రాజీనామా

  • ఓటమికి నాదే బాధ్యత.. క్షమించాలంటూ ప్రకటన

  • కింగ్‌ చార్లె్‌సను కలిసిన స్టార్మర్‌.. ప్రధానిగా నియామకం

  • పద్నాలుగేళ్ల కన్జర్వేటివ్‌ పార్టీ పాలనకు తెర

  • దెబ్బకొట్టిన అసమ్మతి, అస్థిరత, ప్రభుత్వ వ్యతిరేకత

  • రిచ్‌మండ్‌-నార్త్‌ ఆల్ట్రన్‌ నుంచి సునాక్‌ మళ్లీ గెలుపు

  • తెలుగువారు ఉదయ్‌ నాగరాజు, చంద్ర కన్నెగంటిల ఓటమి

లండన్‌, జూలై 5: ఇంగ్లిష్‌ గడ్డపై రాజకీయం మారింది..! మార్పు కావాలి నివాదం పనిచేసింది..! అంచనాలను నిజం చేస్తూ.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది. పద్నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అధికారాన్ని చేజిక్కించుకుంది. సవాళ్లను అధిగమిస్తూ సాగిన ఆ పార్టీ నేత కియర్‌ స్టార్మర్‌ (61) ప్రధానిగా నియమితులయ్యారు.

భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ సారథ్యంలోని కన్జర్వేటివ్‌ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇంగ్లండ్‌, వేల్స్‌, స్కాట్లాండ్‌, ఉత్తర ఐర్లాండ్‌తో కూడిన బ్రిటన్‌ పార్లమెంటులో దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌. ఇందులో మొత్తం 650 ఎంపీ సీట్లున్నాయి. యూకే కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటల (భారత్‌లో 11.30కు)కు మొదలైన పోలింగ్‌ 10 గంటల వరకు సాగింది. 4.60 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ వెంటనే లెక్కింపు చేపట్టారు.


శుక్రవారం ఫలితాలు వెలువడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్క్‌ 326 సీట్లు. లేబర్‌ పార్టీ 412 స్థానాల్లో గెలుపొందింది. కన్జర్వేటివ్‌ పార్టీ 121 సీట్లతో సరిపెట్టుకుంది. అనంతరం సునాక్‌ బకింగ్‌హామ్‌ ప్యాలె్‌సకు వెళ్లి రాజు చార్లె్‌స-3ని కలిసి ప్రధాని పదవికి రాజీనామా సమర్పించారు. కాగా, 23,059 ఓట్ల ఆధిక్యంతో రిచ్‌మండ్‌-నార్త్‌ ఆల్ట్రన్‌ నుంచి సునాక్‌, 18,884 ఓట్ల తేడాతో లండన్‌లోని హోల్‌బోర్న్‌-సెయింట్‌ పాన్‌క్రా్‌స సీటు నుంచి స్టార్మర్‌ ఎంపీగా గెలిచారు. ప్యాలె్‌సకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన ఆయనను. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చార్లెస్‌ కోరారు. తదనంతరం స్టార్మర్‌.. యూకే 58వ ప్రధానిగా బకింగ్‌హామ్‌ ప్యాలె్‌సలో రాజు సమక్షంలో ప్రమాణం చేశారు. స్టార్మర్‌కు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. సంబంధాలు బలోపేతం అయ్యేలా సకహరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఐదేళ్లలో ముగ్గురు ప్రధానులు (బోరిస్‌ జాన్సన్‌, లిజ్‌ ట్రస్‌, రిషి సునాక్‌), సొంత పార్టీ నాయకులే విమర్శలకు దిగడంతో కన్జర్వేటివ్‌ ప్రభుత్వం ప్రజల్లో చులకనైంది. ఎన్నడూ లేనంతగా ఓటమి పాలైంది. కొవిడ్‌ సమయంలో జాన్సన్‌ మందు పార్టీలు, లిజ్‌ ట్రస్‌ ‘మినీ బడ్జెట్‌’ ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. అప్పటినుంచే ప్రభుత్వ పతనం మొదలైంది. ఇక 2019లో 371 సీట్లు నెగ్గిన ఆ పార్టీ ఇప్పుడు అందులో మూడో వంతుకు పరిమితమైంది. 23.7 శాతం ఓట్లే సాధించింది. లేబర్‌ పార్టీ.. ఇప్పుడు 33.7 శాతం ఓట్లు తెచ్చుకుంది. లిబరల్‌ డెమోక్రాట్లు 60 పైగా సీట్లు నెగ్గి ఉనికిని చాటారు. నిగెల్‌ ఫరేజ్‌ స్థాపించిన రిఫార్మ్‌ యూకే పార్టీ 15 శాతం ఓట్లతో 4 సీట్లు నెగ్గి, పలుచోట్ల కన్జర్వేటివ్‌లను దెబ్బకొట్టింది.


  • కూలీ కొడుకు ప్రధాని

కియర్‌ స్టార్మర్‌ నిరుపేద నేపథ్యం నుంచి వచ్చారు. 1962 సెప్టెంబరు 2న లండన్‌లో జన్మించారు. ఈయన తల్లి పరిశ్రమలో కూలీ. న్యాయవిద్య చదివిన స్టార్మర్‌ హక్కుల కేసులను వాదించేవారు. సంస్కరణలను ఇష్టపడే ఈయన రాజకీయాల్లోకి వచ్చింది 2015లోనే. ఆ ఏడాదితో పాటు 2019లో ఉత్తర లండన్‌ ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో 211 సీట్లు మాత్రమే నెగ్గిన లేబర్‌ పార్టీకి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, ‘మార్పు’ నినాదంతో పునరుత్తేజం చేశారు. సేవ, మౌలిక సదుపాయాలకు పెద్దపీట, తక్కువ ధరలకు ఇళ్ల నిర్మాణం, దేశానికే మొదటి ప్రాధాన్యం వంటి కీలక హామీలతో ప్రజల మనుసు గెలిచారు.

  • ఓటమికి నాదే బాధ్యత: రిషి

ఫలితాలు చూసి రిషి సునాక్‌ నిరాశకు గురైనా వెంటనే తేరుకున్నారు. భార్య అక్షతామూర్తితో కలిసి 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధానిగా శక్తివంచన లేకుండా పనిచేశా. ప్రజలు మార్పు కోరుకున్నారు. వారి అసంతృప్తి, ఆగ్రహం నన్ను తాకాయి. ఈ తీర్పును స్వాగతిస్తున్నా. పార్టీ ఓటమికి నాదే బాధ్యత. సహచర ఎంపీల్లో చాలామంది ఓటమి బాధించింది. కన్జర్వేటివ్‌ సారథ్యం నుంచి కూడా తప్పుకొంటున్నా’’ అని ప్రకటించారు. సునాక్‌ 2022 అక్టోబరులో యూకే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - Jul 06 , 2024 | 02:57 AM