Share News

AAP: జైలు నుంచి విడుదలయ్యాక సిసోడియా ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 09 , 2024 | 07:32 PM

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా(Manish Sisodia) శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆయన 17 నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

AAP: జైలు నుంచి విడుదలయ్యాక సిసోడియా ఆసక్తికర వ్యాఖ్యలు
Manish Sisodia

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా(Manish Sisodia) శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆయన 17 నెలలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన్ని పోలీసులు ఇవాళ రిలీజ్ చేశారు. సిసోడియా బయటకి రాగానే ఆప్ మంత్రి అతిషి, ఎంపీ సంజయ్ సింగ్ సహా కార్యకర్తలు స్వాగతం పలికారు. సత్యం గెలిచిందంటూ ఆప్ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ.. తాను బాబాసాహెబ్ అంబేడ్కర్‌కి రుణపడి ఉంటానన్నారు. మహనీయుడికి తన రుణం ఎలా చెల్లించాలో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. జైలు నుంచి బయటకు రాగానే ఆయన నేరుగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి బయలుదేరారు. కాగా ఇదే కేసులో కేజ్రీవాల్‌ని ఈడీ, సీబీఐ అరెస్ట్ చేశాయి. ఈడీ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు కాగా.. సీబీఐ కేసులో ఇంకా శిక్ష అనుభవిస్తున్నారు.


షరతులతో కూడిన బెయిల్..

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన మనీశ్ సిసోడియా బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. రూ.10 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. బెయిల్ సందర్భంగా ఆయనకు కొన్ని షరతులు విధించింది. సిసోదియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు ఆదేశించింది.


ఉద్వేగానికి గురైన అతిషి

సిసోదియాకు బెయిల్ వచ్చిందని తెలిసిన వెంటనే ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి (Delhi Minister Atishi) తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు తెచ్చుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఓ స్కూల్‌లో విద్యాశాఖ మంత్రి అతిషి ప్రసంగిస్తున్నారు. ఇంతలో విషయం తెలిసి బాధ పడ్డారు. మాటలు ఆపేసి.. తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. పక్కనున్న వారు మంచినీరు ఇవ్వగా కొన్ని తాగారు. తర్వాత కూడా చాలా బాధ పడుతూ మాట్లాడారు.

Updated Date - Aug 09 , 2024 | 08:00 PM