Share News

Mascow : ‘అదృశ్య’ దుస్తులు!

ABN , Publish Date - Aug 25 , 2024 | 03:02 AM

కుర్స్క్‌ ప్రాంతంలోకి చొచ్చుకురావడంలో ఉక్రెయిన్‌ బలగాలు విజయం సాధించడం వెనుక ‘అదృశ్య దుస్తుల’ పాత్ర ఉందని రష్యా ఆరోపించింది.

Mascow : ‘అదృశ్య’ దుస్తులు!

  • అవి ధరిస్తే ఇతరులకు కనిపించరు

  • కుర్స్క్‌లో ఉక్రెయిన్‌ సైన్యం విజయానికి కారణం అదే: రష్యా

  • పశ్చిమదేశాలు ఆ యూనిఫాంను ఉక్రెయిన్‌కు ఇచ్చాయని ఆరోపణ

  • అమెరికా మిలిటరీ కంపెనీలపై సందేహాలు

  • కాంతి పరావర్తనాన్ని అడ్డుకునే పదార్థాలతో అదృశ్య దుస్తుల తయారీ!

మాస్కో, ఆగస్టు 24: కుర్స్క్‌ ప్రాంతంలోకి చొచ్చుకురావడంలో ఉక్రెయిన్‌ బలగాలు విజయం సాధించడం వెనుక ‘అదృశ్య దుస్తుల’ పాత్ర ఉందని రష్యా ఆరోపించింది. పశ్చిమదేశాలు ఉక్రెయిన్‌ దళాలకు ఈ ప్రత్యేక యూనిఫామ్‌ను అందించాయని, వాటిని ధరించడం వల్ల ఉక్రెయిన్‌ సైనికులు పగలూ, రాత్రీ కూడా శత్రువులకు కనిపించలేదంటూ రూపొందించిన నివేదిక రష్యా మిలిటరీ పోర్టల్‌లో దర్శనమిస్తోంది.

ఆ ఘటన వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందని రష్యా ఆరోపిస్తోంది. అయితే, ఈ వాదనలను అంతర్జాతీయ మీడియా తోసిపుచ్చింది. కుర్స్క్‌ ప్రాంతంలోకి గణనీయంగా వచ్చిన మిలిటరీ సామగ్రి కదలికలు కనిపించకుండా చేయడం అసాధ్యమని రష్యా విమర్శకులు పేర్కొంటున్నారు.

కాగా, అమెరికా ప్రైవేటు మిలిటరీ కంపెనీల భాగస్వామ్యం వల్లే ఉక్రెయిన్‌ ఆ ఆకస్మిక విజయం సాధించిందని అంతకుముందు రష్యా విదేశాంగమంత్రిత్వశాఖ ఆరోపించింది. దాంతోపాటు అమెరికా జర్నలిస్టులు అక్రమంగా రష్యా భూభాగంలోకి వస్తున్నారని ఆరోపించింది.


  • అదృశ్య వస్త్రం అంటే..?

‘అదృశ్య సైనికులు’ అనేది రియల్‌ఎం సైన్స్‌ ఫిక్షన్‌ అయినప్పటికీ.. కనిపించకుండా చేసే అధునాతన పరిజ్ఞానం కోసం మిలిటరీ పరిశ్రమ కొంతకాలం నుంచి ప్రయత్నిస్తోంది. సైనిక పరికరాలు శత్రువులకు కనిపించకుండా చేయడమే దీని లక్ష్యం. వస్తువులపై పడకుండా కాంతిని వక్రీభవనం చెందించడం ద్వారా విజిబిలిటీని తగ్గించే పదార్థాల తయారీకి ప్రయత్నిస్తున్నారు.

అల్ర్టావైలెట్‌, ఇన్‌ఫ్రారెడ్‌, షార్ట్‌వేవ్‌ కాంతిని పరావర్తనం చెందించకపోవడం వల్ల వస్తువులను కనిపించకుండా చేస్తారు. ఉక్రెయిన్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ మంత్రి మైఖేలో ఫడొరోవ్‌ గతేడాది చివర్లోనే వస్తువులను కనిపించకుండా చేసే రియల్‌ వరల్డ్‌ అప్లికేషన్‌ అనే అధునాతన సాంకేతికతను ‘టెలిగ్రామ్‌’లో ప్రస్తావించారు.

రష్యా థర్మల్‌ ఇమేజింగ్‌ కంటపడకుండా ప్రత్యేకించి డ్రోన్ల కంటపడకుండా ఉక్రెయిన్‌ సైనికుల కోసం రూపొందించిన అదృశ్య వస్త్రాన్ని ఆయన అందులో ప్రదర్శించారు. రష్యా జనవరిలో ‘అదృశ్య సూట్‌’ను ఆవిష్కరించినట్టు వార్తా సంస్థ ‘టాస్‌’ పేర్కొంది.

Updated Date - Aug 25 , 2024 | 03:02 AM