Share News

Weather update: మే నెలలో భానుడి భగభగలు.. అత్యంత ఉష్ణమయ నెలగా రికార్డు

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:21 PM

భానుడి భగభగలతో మే నెలలో భూగోళం మండిపోయింది. భారత్‌పై ఉష్ణోగ్రతల(High Temperatures) ప్రభావం భారీగా ఉంది. దీంతో అత్యంత ఉష్ణమయ నెలగా మే నిలిచింది. వరుసగా 12 నెలల పాటు ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదై రికార్డు సృష్టించింది.

Weather update: మే నెలలో భానుడి భగభగలు.. అత్యంత ఉష్ణమయ నెలగా రికార్డు

ఢిల్లీ: భానుడి భగభగలతో మే నెలలో భూగోళం మండిపోయింది. భారత్‌పై ఉష్ణోగ్రతల(High Temperatures) ప్రభావం భారీగా పడింది. దీంతో అత్యంత ఉష్ణమయ నెలగా మే నిలిచింది. వరుసగా 12 నెలల పాటు ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదై రికార్డు సృష్టించింది. చారిత్రకంగా ఆయా నెలలకు సంబంధించిన సరాసరి ఉష్ణోగ్రతల్లో రికార్డులు బద్దలయ్యాయి. గత ఏడాది జూన్ నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ ఏడాది మేలో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలను ప్రకృతి వైపరీత్యాలు వణికించాయి. కొన్ని చోట్ల తీవ్ర ఉష్ణ గాలులు ప్రభావం ఉంటే మరి కొన్ని చోట్ల వర్షాలు, వరదలు, తుపానులు ముంచెత్తాయి.


ఎల్నినోతోపాటు ప్రకృతికి మనుషులు చేసే చేటు వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నట్లు ఐరోపా వాతావరణ సంస్థ కోపర్ని కన్ క్లైమేట్ వేంజ్ సర్వీసెస్ తెలిపింది. ఈ ఏడాది మేలో సరాసరి ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు (1850-1900) నాటితో పోలిస్తే 1.52 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉన్నట్లు వెల్లడించింది.

అయితే ఇది చాలా కాలం పాటు కొనసాగితేనే పారిస్ ఒప్పందంలో పేర్కొన్న 15 డిగ్రీల సెల్సియస్ పరిమితిని మించిపోయినట్లు భావిస్తారు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మే మధ్య 12 నెలలు సరాసరి భూ ఉష్ణోగ్రతలు సైతం రికార్డు స్థాయిలో పెరిగాయి.


పెరగనున్న భూతాపం..

పారిశ్రామికీకరణకు ముందు పోలిస్తే వచ్చే ఐదేళ్లలో ఏదో ఒక ఏడాది భూతాపంలో పెరుగుదల1.5 డిగ్రీల సెల్సియస్ దాటిపోవడానికి 80 శాతం మేర అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (WHO) వెల్లడించింది. 1901 నుంచి 2012 మధ్యనాటి సరాసరితో పోలిస్తే ఇది 11.75 డిగ్రీల సెల్సియస్ అధికం. పారిశ్రామికీకరణకు ముందునాటి కంటే ఇది 1.68 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువ. ఈ ఐదేళ్లలో ఒక్క 2022లో నమోదైన ఉష్ణోగ్రతల రికార్డు బద్దలు కావడానికి 8 శాతం అవకాశం ఉందని స్పష్టం చేసింది.


తీవ్రమైన వడగాల్పుల మధ్య దేశంలో మార్చి నుంచి మే వరకు దాదాపు 25 వేల వడదెబ్బ కేసులు, 56 మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.అయితే ఈ డేటా ప్రకారం ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ ‌ నుంచి ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. ప్రపంచవ్యాప్తంగా 174 సంవత్సరాల రికార్డుకు పరిశీలిస్తే 2023 రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరం. రానున్న రోజుల్లో భూతాపం మరింతగా పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రకృతిని కాపాడితే దాని ప్రభావం నుంచి కొంత మేరైనా బయటపడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 12:25 PM