Share News

Lal Bahadur Shastri: గాంధీ జయంతి రోజే మరో మహానీయుడి జయంతి.. ఆయన గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

ABN , Publish Date - Oct 02 , 2024 | 06:51 PM

యుద్ధ సమయంలో సైనికులు, రైతుల పాత్రను గుర్తుచేస్తూ జై జవాన్-జై కిసాన్ నినాదాన్ని ఇచ్చారు. 1904లో ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్‌సరాయ్‌లో జన్మించిన శాస్త్రి, సామాన్య ప్రజలతో బాగా కలిసిపోయిన నాయకుడిగా పేర్గాంచారు. ఆయన నిరాడంబరమైన జీవితం నేటి తరానికి..

Lal Bahadur Shastri: గాంధీ జయంతి రోజే మరో మహానీయుడి జయంతి.. ఆయన గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
Lal Bahadur Shastri

అక్టోబర్ 2 అంటే గుర్తొచ్చేది గాంధీ జయంతి. అదే రోజు మరో మహానీయుడి జయంతి కూడా. దేశానికి మూడో ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అక్టోబర్2న జరుపుకుంటారు. దృఢమైన నాయకత్వానికి ఆయన చిరునామా. క్లిష్ట సమయాల్లో దేశానికి మార్గనిర్దేశం చేసిన నాయకుడు. 1965 ఇండో-పాక్ యుద్ధ సమయంలో జై జవాన్- జై కిసాన్ నినాదంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నేత. ఆ నినాదాన్ని తలుచుకుంటే వెంటనే గుర్తొచ్చే నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి. యుద్ధ సమయంలో సైనికులు, రైతుల పాత్రను గుర్తుచేస్తూ జై జవాన్-జై కిసాన్ నినాదాన్ని ఇచ్చారు. 1904లో ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్‌సరాయ్‌లో జన్మించిన శాస్త్రి, సామాన్య ప్రజలతో బాగా కలిసిపోయిన నాయకుడిగా పేర్గాంచారు. ఆయన నిరాడంబరమైన జీవితం నేటి తరానికి ఆదర్శం. స్వాతంత్ర్య పోరాటం పట్ల లాల్ బహదూర్ శాస్త్రి నిబద్ధత ఆయనకు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత ప్రధానమంత్రిగా దేశ ప్రజలు అత్యంత ఎక్కువుగా అభిమానించే నాయకులలో ఆయన ఒకరిగా నిలిచారు.


ఇండో-పాక్ యుద్ధ సమయంలో..

1964 జూన్ 9 నుంచి 1966 జనవరి 11 వరకు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా పనిచేశారు. 1965లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఆయన ప్రధానిగా అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించారు. జై జవాన్- జై కిసాన్ నినాదంతో ఆయన ఇచ్చిన పిలుపు భారతదేశ భద్రత, జీవనోపాధికి భరోసా ఇవ్వడంలో కీలకంగా పనిచేసింది. సైనికులు, రైతుల అనివార్య పాత్రను ఆయన గుర్తించారు. ఈ నినాదం నేటికీ ప్రజల మనసుల్లో పాతుకుపోయింది. సవాళ్ల సమయాల్లో దేశానికి ఆ నినాదం స్ఫూర్తినిచ్చింది. పదవిలో తక్కువ కాలం ఉన్నప్పటికీ, ప్రధానిగా ఆయన దేశ వ్యవసాయ రంగం, ఆర్మీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.


లాల్ బహదూర్ శాస్త్రి గురించి..

లాల్ బహదూర్ శాస్త్రి నిజాయితీ, దేశభక్తి, నిస్వార్థత కలిగిన నాయకుడు. ప్రజాసేవకుడు అనే పదానికి అర్థం చెప్పిన నాయకుడు. సంక్షోభ సమయాల్లో జాతిని ఐక్యం చేసిన నేత. భారతదేశానికి శాస్త్రి చేసిన సేవలను స్మరించుకోవడానికి దేశవ్యాప్తంగా ఆయన జయంతి రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో శాస్త్రి సేవలను గుర్తుచేసుకుంటూ.. ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పుష్పాంజలి ఘటిస్తారు. స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిషువాళ్లకు వ్యతిరేకంగా పోరాడినందుకు లాల్ బహదూర్ శాస్త్రి అనేక సార్లు జైలుకు వెళ్లారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 02 , 2024 | 06:51 PM