Share News

స్కూటీని ఢీకొట్టి.. మహిళను ఈడ్చుకెళ్లి!

ABN , Publish Date - Jul 08 , 2024 | 05:15 AM

పుణే కారు ప్రమాద ఘటన మరవకముందే.. ముంబైలో అలాంటి ఘోరమే మరొకటి చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారు జామున వర్లీ ప్రాంతంలో ఓ బీఎండబ్ల్యూ కారు స్కూటీని వెనక నుంచి అతి వేగంతో ఢీ కొట్టింది. దీంతో స్కూటీ నడుపుతున్న వ్యక్తి పక్కకు ఎగిరిపడగా.. అతడి భార్యను కొద్ది దూరం కారు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

స్కూటీని ఢీకొట్టి.. మహిళను ఈడ్చుకెళ్లి!

ముంబైలో హిట్‌ అండ్‌ రన్‌ కేసు

మద్యం మత్తులో కారు నడిపిన శివసేన ముఖ్యనేత కుమారుడు

మహిళ మృతి.. పరారీలో నిందితుడు

ముంబై, జూలై 7: పుణే కారు ప్రమాద ఘటన మరవకముందే.. ముంబైలో అలాంటి ఘోరమే మరొకటి చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారు జామున వర్లీ ప్రాంతంలో ఓ బీఎండబ్ల్యూ కారు స్కూటీని వెనక నుంచి అతి వేగంతో ఢీ కొట్టింది. దీంతో స్కూటీ నడుపుతున్న వ్యక్తి పక్కకు ఎగిరిపడగా.. అతడి భార్యను కొద్ది దూరం కారు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు అప్రమత్తమై ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దంపతులను ప్రదీప్‌ నఖవా, కావేరి నఖవా (45)గా పోలీసులు గుర్తించారు. అధికార పార్టీ శివసేన (షిండే)కు చెందిన ముఖ్య నేత రాజేశ్‌ షా కుమారుడు మిహిర్‌ షా (24)నే ఆ కారు నడిపాడని ధ్రువీకరించారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి మిహిర్‌ పరారీలో ఉన్నాడని.. అతడిని పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీనియర్‌ పోలీసు అధికారి కృష్ణకాంత్‌ తెలిపారు. పోలీసు వర్గాల సమాచారం మేరకు.. గత రాత్రి జుహూలోని ఓ బార్‌లో మిహిర్‌ అతిగా మద్యం సేవించాడు. ఇంటికెళ్లే సమయంలో తానే కారు నడుపుతానని డ్రైవర్‌ నుంచి తీసుకుని అతి వేగంతో నడుపుతూ వర్లీలో స్కూటీని ఢీకొట్టాడు.. భయంతో కారుతో సహా అక్కడి నుంచి ఉడాయించాడని సమాచారం. అనంతరం అతడు నేరుగా ఓ స్నేహితురాలి ఇంటికెళ్లాడని తెలియడంతో పోలీసులు ఆమెను కూడా విచారించారు. ప్రమాద సమయంలో కారులోనే ఉన్న డ్రైవర్‌ రాజ్‌శ్రీ బిజావత్‌తో పాటు కారు రాజేశ్‌ షాపై పేరుపై ఉండటంతో ఆయన్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

వాళ్లను ఎవరేం చేయలేరు..

ప్రమాదంలో స్వల్పగాయాలతో బయటపడ్డ ప్రదీప్‌ నఖవా వర్లీ పోలీస్‌ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘మేం చేపలు అమ్ముకొని బతికేవాళ్లం. ఎప్పటిలాగే తెల్లవారు జామున చేపల కొనేందుకు బయలుదేరగా.. 5.30 గంటల సమయంలో ఓ కారు వెనక నుంచి ఢీ కొట్టింది. మాకు ఇద్దరు పిల్లలు.. నా బండిని ఢీకొట్టిన వారు పెద్దవాళ్లు.. వారిని ఎవరేం చేయలేరు’ అని ఆవేదన చెందారు. బాఽధితున్ని శివసేన(యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే పరామర్శించారు. నిందితున్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా, ముంబై ప్రమాద ఘటనపై సీఎం ఏక్‌నాథ్‌ షిండే విచారం వ్యక్తం చేశారు. ‘ఇది దురదృష్టకరం.. పోలీసులతో మాట్లాడాను. నిందితులెవరైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరినీ విడిచిపెట్టం.. చట్టం ముందు అందరూ సమానమే’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - Jul 08 , 2024 | 05:15 AM