Lok Sabha: లోక్‌సభ స్పీకర్‌గా తొలి ప్రసంగంలోనే ఓం బిర్లా నోట ఎమర్జెన్సీ మాట..
ABN , Publish Date - Jun 26 , 2024 | 02:51 PM
పద్దెనిమిదవ లోక్‌సభ స్పీకర్‌గా బుధవారంనాడు ఎన్నికైన ఓం బిర్లా తొలి ప్రసంగంలోనే 1975లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితిని సభలో ప్రస్తావించడం కలకలం రేపింది. ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.
న్యూఢిల్లీ: పద్దెనిమిదవ లోక్‌సభ స్పీకర్‌గా బుధవారంనాడు ఎన్నికైన ఓం బిర్లా (Om birla) తొలి ప్రసంగంలోనే 1975లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి (Emergency)ని సభలో ప్రస్తావించడం కలకలం రేపింది. ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. నాటి అత్యవసర పరిస్థితి చరిత్రలోనే బ్లాక్ ఛాప్టర్‌గా నిలిచిపోతుందని స్పీకర్ అన్నారు. 1975లో విధించిన ఎమర్జెన్సీ నిర్ణయాన్ని లోక్‌సభ ఖండిస్తోందని చెప్పారు.
PM Modi : ‘ఎమర్జెన్సీ’ మైండ్‌సెట్ ఇంకా పోలేదు
''1975 నాటి ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తోంది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడిన వారందరినీ సభ అభినందిస్తోంది. భారతదేశ చరిత్రలో 1975 జూన్ 25వ తేదీ బ్లాక్‌డేగా నిలిచిపోతుంది. ఆరోజు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థఇతి విధించి, బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంపై దాడి చేశారు'' అని ఓం బిర్లా లోక్‌సభలో చేసిన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య విలువలను తుంగలోకి తొక్కి, భావ ప్రకటనా స్వేచ్ఛ గొంతు నులిమారని అన్నారు. ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లిలాంటిదనే విషయం యావత్ ప్రపంచానికి తెలుసునని, ప్రజాస్వామ్య విలువలు, దానిపై చర్చకు ఇండియా ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుందన్నారు. వాటి పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రాణాలు కోల్పోయిన వారి స్మృత్యర్థం రెండు నిమిషాల మౌనాన్ని ఆయన పాటించారు. ఇందుకు ప్రతిగా కొత్త లోక్‌సభలో ఎమర్జెన్సీ ప్రస్తావనపై విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేస్తూ, నినాదాలు చేశారు. లోక్‌సభ కొత్త స్పీకర్‌గా ఓం బిర్లా బుధవారంనాడు మూజువాణి ఓటుతో ఎన్నికయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..