PM Narendra Modi: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 22 , 2024 | 05:30 PM
రష్యాలోని కజాన్ నగరంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్-రష్యా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
కజాన్: బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశం కోసం రష్యాలోని కజాన్ నగరం వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ వివాదానికి వీలైనంత త్వరగా, శాంతియుత పరిష్కారానికి మద్దతు ఇస్తానని మోదీ పునరుద్ఘాటించారు. శాంతి పునరుద్దరణకు సహకారం అందించేందుకు భారత్ సదా సంసిద్దంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
‘‘రష్యా - ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ అంశంపై నేను నిరంతరం మీతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాను. నేను గతంలో చెప్పినట్టుగా సమస్యలను శాంతియుత విధానంలో పరిష్కరించుకోవాలని మేము భావిస్తున్నాం. శాంతి, స్థిరత్వం స్థాపనకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. మా ప్రయత్నాలన్నీ మానవీయతకే ప్రాధాన్యత ఇస్తాయి. రాబోయే కాలంలో కూడా సాధ్యమైన అన్ని సహకారాలు అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది’’ అని అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ చెప్పారు. కాగా బ్రిక్స్ సదస్సుల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ప్రస్తుతం కజాన్ సిటీలో ఉన్నారు.
గత మూడు నెలల వ్యవధిలో తాను రెండవసారి రష్యాలో పర్యటించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మీ స్నేహానికి, సాదర స్వాగతానికి, ఆతిథ్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్రిక్స్ సదస్సు కోసం కజాన్ వంటి సుందరమైన నగరాన్ని సందర్శించే అవకాశం అవకాశం లభించడం పట్ల సంతోషంగా ఉంది. కజాన్ నగరంలో భారత కొత్త కాన్సులేట్ ప్రారంభం కావడంతో సంబంధాలు మరింత బలపేతం అవుతాయి’’ అని పుతిన్‌తో మోదీ అన్నారు.
ఇవి కూడా చదవండి
సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
పసిడి ప్రియులకు భారీ షాక్.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
For more National News and Business News and Telugu News