Share News

Modi meets Jinping: కీలక పరిణామం.. చైనా అధ్యక్షుడి జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ

ABN , Publish Date - Oct 23 , 2024 | 09:58 PM

బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ పింగ్ ద్వైపాక్షిక భేటీ అయ్యారు. 2019 తర్వాత ఇరుదేశాధినేతల మధ్య ఇదే తొలి ద్వైపాక్షిక సమావేశం కావడం గమనార్హం. ఇద్దరూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

Modi meets Jinping: కీలక పరిణామం.. చైనా అధ్యక్షుడి జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ
Narendra Modi Xi Jinping

కజాన్, రష్యా: భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ పింగ్ ద్వైపాక్షిక భేటీ అయ్యారు. 2019 తర్వాత ఇరుదేశాధినేతల మధ్య ఇదే తొలి అధికారిక ద్వైపాక్షిక సమావేశం కావడం గమనార్హం. అత్యంత కీలకమైన ఈ భేటీలో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాన మోదీ, జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.


మోదీ ఏమన్నారంటే..

భారత్-చైనా సంబంధాల ప్రాముఖ్యత కేవలం ఇరు దేశాల పౌరులకు మాత్రమే ప్రయోజనకరం కాదని, మొత్తం ప్రపంచ శాంతి, స్థిరత్వం, పురోగతికి కూడా చాలా ముఖ్యమని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశాను. సరిహద్దు వెంబడి గత 4 సంవత్సరాలుగా ఉన్న సమస్యలపై కుదిరిన ఏకాభిప్రాయం కుదరడాన్ని స్వాగతిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఇరు దేశాల సరిహద్దులో శాంతి, స్థిరత్వం ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఇరుదేశాలు పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం ప్రాతిపదికన ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలని అభిలాషించారు. సమస్యలన్నింటిపై మాట్లాడే అవకాశం తమకు ఇవాళ లభించిందని, ఏది దాచుకోకుండా ఈ చర్చలు నిర్వహిస్తామని అన్నారు. ఈ చర్చలు నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతాయని తాను విశ్వసిస్తున్నటు మోదీ చెప్పారు. జిన్‌పింగ్‌ను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఐదేళ్ల తర్వాత తమ మధ్య సమావేశం జరిగిందని ప్రస్తావించారు.


జిన్ పింగ్ ఏమన్నారంటే..

‘‘మిస్టర్.. ప్రధాని మోదీ కజాన్‌లో మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐదేళ్ల తర్వాత అధికారికంగా ద్వైపాక్షిక సమావేశం కావడం ఇదే తొలిసారి. మన సమావేశంపై మన రెండు దేశాలకు చెందిన వారే కాకుండా అంతర్జాతీయ సమాజం మొత్తం ఇటువైపు దృష్టిపెట్టింది. చైనా, భారత్ రెండూ పురాతన నాగరికతలు కలిగివున్న దేశాలు. అభివృద్ధి చెందుతున్న ప్రధాన దేశాలు. ఆధునికీకరణ ప్రయత్నాలలో మనం కీలక దశలో ఉన్నాం. చక్కటి ద్వైపాక్షిక సంబంధాలు రెండు దేశాలూ సరైన దిశలో కొనసాగడానికి, ప్రజల ప్రాథమిక ప్రయోజనాలకు మంచిగా ఉపయోగపడతాయి. ఇరుపక్షాలు మరింత మెరుగ్గా సంప్రదింపులు, సహకారాన్ని కలిగి ఉంటే విభేదాలను పక్కనపెట్టగలం. అభివృద్ధి ఆకాంక్షల సాధనలో ఒకరికొకరు సాయపడడం చాలా ముఖ్యం’’ అని జీ జిన్‌పింగ్ అన్నారు.

కాగా లఢఖ్‌లో ఎల్ఏసీ వెంబడి సైనిక బలగాల ఉపసంహరణపై గత ఐదేళ్లుగా అనేక అవాంతరాల మధ్య జరిగిన చర్చల్లో ఇటీవలే ఏకాభిప్రాయం కుదరడం, తాజాగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భేటీ కావడంతో ఇరు దేశాల సంబంధాలలో పురోగతిని సూచిస్తున్నాయి.

Updated Date - Oct 23 , 2024 | 10:12 PM