Sandeep Thapar: సందీప్ థాపర్‌పై కత్తులతో దాడి చేయడానికి కారణం ఇదేనా? ఆ ముగ్గురు ఎవరు?
ABN , Publish Date - Jul 06 , 2024 | 05:32 PM
పంజాబ్‌లోని లుధియానాలో శివసేన లీడర్ సందీప్ థాపర్‌పై జరిగిన కత్తి దాడి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఖలిస్తాన్ వ్యతిరేకి అయిన ఆయనపై నిహాంగ్ సిక్కులు...
పంజాబ్‌లోని (Punjab) లుధియానాలో శివసేన లీడర్ సందీప్ థాపర్‌పై (Sandeep Thapar) జరిగిన కత్తి దాడి రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. దీనికి జవాబుదారీతీనం తీసుకోలేదని, వెంటనే చర్యలు చేపట్టాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను ప్రతిపక్ష నేతలు కోరుతున్నారు. రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు చేస్తున్నారు. ఇండియా కూటమిలోని మిత్రపక్ష పార్టీ కాంగ్రెస్ సైతం ఈ దాడికి ఖండిస్తూ.. భగవంత్ మాన్‌ను టార్గెట్ చేసింది.
అసలేం జరిగిందంటే..
సందీప్ థాపర్‌కు ఖలిస్టాన్ వ్యతిరేకిగా పేరుంది. ఖలిస్టాన్ వేర్పాటువాదులపై ఆయనపై గళమెత్తుతుంటారు. బహుశా.. అందుకు ప్రతీకారంగానే నిహాంగ్ సిక్కులు (Nihang Sikhs) ఆయనపై కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. సంవేదన ట్రస్టులో నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో.. ముగ్గురు దుండుగులు చుట్టుముట్టి, ఆయనపై ఈ దాడి చేశారు. పలుమార్లు కత్తులతో దాడి చేయడంతో థాపర్ తీవ్ర గాయాలపాలయ్యారు. ఆయనను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
వీడియోలోని దృశ్యాలను బట్టి చూస్తే.. థాపర్ తన సెక్యూరిటీ పర్సనల్‌తో కలిసి స్కూటర్‌పై వెళ్తుండగా, దుండగులు ఆయన్ను అడ్డుకొని చుట్టుముట్టారు. ఎందుకు అడ్డగించారని వాదించేలోపు వాళ్లు తమతో పాటు తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తనని విడిచిపెట్టమని థాపర్ ఎంత ప్రాధేయపడినా.. దుండుగులు ఏమాత్రం కనికరం చూపకుండా దారుణంగా కొట్టారు. థాపర్ కుప్పకూలి నేలపై పడిపోయినా విడిచిపెట్టలేదు. థాపర్ గన్‌మ్యాన్ ఆ దుండగులను చూసి సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు. అటు.. దాడి చేసిన వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోగా, స్థానికులు థాపర్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
కాగా.. ఈ ఘటనపై లుధియానా పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇప్పటికే సరబ్జిత్ సింగ్, హర్జోత్ సింగ్ అనే ఇద్దరు అనుమానితులను చేయగా.. మూడో వ్యక్తి తెహల్ సింగ్ పరారీలో ఉన్నాడు. మరోవైపు.. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో పంజాబ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనిపై వెంటనే స్పందించాలని సీఎం భగవంత్ మాన్‌ని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర శాంతిభద్రతలపై దృష్టి సారించాలని ప్రతిపక్ష నేతలు సీఎంపై విరుచుకుపడుతున్నారు. అధికారులు సైతం తమ పని చేయకుండా, ఆప్ నాయకులను సంతోషపెట్టడంలో బిజీగా ఉన్నారంటూ ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు మాట్లాడుతూ.. ప్రజల మధ్య ఓ వ్యక్తిపై ఇలాంటి క్రూరమైన దాడి జరగడం ఖండించదగినది అని అన్నారు. ఈ ఘటన నివాసితుల్లో భయాందోళనలు సృష్టించిందని పేర్కొన్నారు. ఆపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. పంజాబ్‌లో పాలన తప్పిపోయిందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలను అపహాస్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు పర్తాప్ బజ్వా కూడా ఈ సంఘటనను ఖండించారు.
Read Latest National News and Telugu News