మహిళా సర్పంచ్‌ను తొలగించడం చిన్న విషయం కాదు: సుప్రీం కోర్టు
ABN , Publish Date - Oct 07 , 2024 | 04:11 AM
ప్రజలు ఎన్నుకున్న ఓ మహిళా సర్పంచ్‌ను తొలగించడం సాధారణ విషయం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది.
న్యూఢిల్లీ, అక్టోబరు 6: ప్రజలు ఎన్నుకున్న ఓ మహిళా సర్పంచ్‌ను తొలగించడం సాధారణ విషయం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆమెపై అనర్హతను కొట్టివేస్తూ, సదరు మహిళ సర్పంచ్‌గా కొనసాగేలా ఆదేశాలిచ్చింది. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలోని విచ్ఖేడా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా మనీశ్ రవీంద్ర పంపాటిల్ అనే మహిళ సేవలందిస్తున్నారు. ఆమె తన అత్తతో కలిసి ప్రభుత్వ భూమిలో కట్టిన ఇంట్లో నివాసం ఉంటోందని కొందరు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దాంతో ఆమెను సర్పంచ్‌గా తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు.
తనపై వచ్చిన ఆరోపణలను పంపాటిల్ ఖండించారు. తాను తన భర్త పిల్లలతో కలిసి అద్దె ఇంటో ఉంటున్నాని వెల్లడించారు. దీనిపై ఆ మహిళా సర్పంచ్ రిట్ పిటిషన్ వేయగా బాంబే హైకోర్టు కొట్టివేసింది. దాంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఓ మహిళ సర్పంచ్‌గా ఎన్నికవ్వడాన్ని ఆ గ్రామస్థులు కొంతమంది జీర్ణించుకోలేకపోయారని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.