Share News

Scientists : పురుషాంగ కణజాలంలో మైక్రోప్లాస్టిక్స్‌

ABN , Publish Date - Jun 21 , 2024 | 04:08 AM

ప్లాస్టిక్‌ భూతం సర్వవ్యాప్తమైపోయింది. చివరికి మన శరీరంలోకీ వ్యాపించింది. సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులు (మైక్రో ప్లాస్టిక్స్‌) మనిషి దేహంలోని అన్ని అవయవాలను ఆక్రమించేస్తున్నాయి.

Scientists : పురుషాంగ కణజాలంలో మైక్రోప్లాస్టిక్స్‌

  • అంగస్తంభన సమస్య తలెత్తే ప్రమాదం

  • ఆహారం, నీరు, గాలి ద్వారా

  • శరీరంలోకి ప్లాస్టిక్‌ రేణువులు

  • ఇప్పటికే గుండె, వీర్యం, వృషణాల్లో గుర్తింపు

  • ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని హితవు

వాషింగ్టన్‌, జూన్‌ 20: ప్లాస్టిక్‌ భూతం సర్వవ్యాప్తమైపోయింది. చివరికి మన శరీరంలోకీ వ్యాపించింది. సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులు (మైక్రో ప్లాస్టిక్స్‌) మనిషి దేహంలోని అన్ని అవయవాలను ఆక్రమించేస్తున్నాయి. తాజాగా, పురుషాంగం కణజాలంలోనూ వీటి ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల అంగస్తంభన సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అమెరికాలోని మియామీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ రంజిత్‌ రామసామి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన జరిపింది. దీంట్లో భాగంగా, అంగస్తంభన సమస్య పరిష్కారం కోసం శస్త్రచికిత్స చేయించుకున్న ఆరుగురు వ్యక్తుల పురుషాంగ కణజాలం నమూనాలను సేకరించారు. వాటిపై కెమికల్‌ ఇమేజింగ్‌ నిర్వహించి ఫలితాలను విశ్లేషించారు. ఆ వివరాలను రంజిత్‌ రామసామి వెల్లడించారు. ‘ఐదుగురి నమూనాల్లో ఏడు రకాల మైక్రోప్లాస్టిక్స్‌ కనిపించాయి. ముఖ్యంగా పాలీఎథిలీన్‌ టెరెప్తలేట్‌ (పీఈటీ), పాలీప్రొపిలీన్‌ గణనీయంగా ఉన్నాయి. ప్లాస్టిక్‌ బాటిళ్లు, డబ్బాల్లో పీఈటీ ఉంటుంది. పాలీప్రొపిలీన్‌ వాటి మూతలలో ఉంటుంది. ఈ మైక్రోప్లాస్టిక్స్‌ 2 మైక్రోమీటర్ల సైజులో (ఒక మిల్లీమీటరులో 2 వేల వంతు) కూడా ఉన్నాయి.


ఆహారం, నీరు ద్వారా ప్లాస్టిక్‌ ప్రవేశం

ఆహారం, నీరు, గాలి, స్పర్శ ద్వారా ఐదు మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజు ఉన్న ప్లాస్టిక్‌ రేణువులు మన దేహంలోకి చేరుతున్నాయి. మనిషి గుండెలో మైక్రోప్లాస్టిక్స్‌ ఉన్నట్లు గతంలో ఒక పరిశోధన వెల్లడించింది. పురుషులలోనైతే వృషణాలు, వీర్యం లోనూ వీటి జాడ ఉందని మరో అధ్యయనం తెలిపింది. మియామీ వర్సిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన.. అంగం కణజాలంలోనూ మైక్రోప్లాస్టిక్స్‌ చేరిపోయాయని తెలియజేస్తోంది. అంగం స్తంభించినప్పుడు రక్తనాళాల్లో ప్రవాహం పెరిగిపోయి మైక్రోప్లాస్టిక్స్‌ అంగం కణజాలంలోకి చేరుతుండోచ్చని రంజిత్‌ రామసామి పేర్కొన్నారు. ఇది దీర్ఘకాలంలో అంగస్తంభన సమస్యకు కారణమవుతుందా అన్నదానిపై మరింత పరిశోధన చేపట్టాల్సి ఉందన్నారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించుకోవాలని, ముఖ్యంగా ఆహారం, నీరు వంటి వాటిని ప్లాస్టిక్‌ డబ్బాలు, బాటిళ్లలో తీసుకోవటం మానేయాలని ఆయన సూచించారు.

Updated Date - Jun 21 , 2024 | 04:08 AM