Share News

Sharad Pawar: మోదీ వచ్చిన చోటల్లా మేం గెలిచాం... పవార్ విసుర్లు

ABN , Publish Date - Jun 15 , 2024 | 05:37 PM

మహారాష్ట్రలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష 'మహా వికాస్ అఘాడి'కి మద్దతు తెలిపిన ప్రజలందరికీ కూటమి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఎంవీఏ నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, పృధ్వీరాజ్ కపూర్ సంయుక్తంగా శనివారంనాడు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కడైతే రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించారో అక్కడ తాము గెలిచామని ఈ సందర్భంగా శరద్ పవార్ అన్నారు.

Sharad Pawar: మోదీ వచ్చిన చోటల్లా మేం గెలిచాం... పవార్ విసుర్లు

ముంబై: మహారాష్ట్రలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష 'మహా వికాస్ అఘాడి' (MVA)కి మద్దతు తెలిపిన ప్రజలందరికీ కూటమి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఎంవీఏ నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, పృధ్వీరాజ్ కపూర్ సంయుక్తంగా శనివారంనాడు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కడైతే రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించారో అక్కడ తాము గెలిచామని ఈ సందర్భంగా శరద్ పవార్ (Sharad Pawar) అన్నారు. ఎంవీఏకు అనుకూలంగా రాజకీయ వాతావరణాన్ని మోదీ సృష్టించారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.


లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనాతా పార్టీకి, ఎన్డీయేకు గట్టి దెబ్బ తగిలిన మూడు రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. 2022 జూన్‌లో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల్లో చీలికలు ఏర్పడి, చీలిక గ్రూపులు బీజేపీతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చిన అనంతరం మహారాష్ట్రలో జరిగిన తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం 9 సీట్లు గెలుచుకుంది. 2019లో బీజేపీ 23 సీట్లతో విజయకేతనం ఎగురవేసింది. ఎన్నికల కమిషన్ డాటా ప్రకారం, మోదీ ప్రచారం చేసిన మెజారిటీ సీట్లలో ఎన్డీయే ఈసారి విజయం సాధించడంలో విఫలమైంది. మహారాష్ట్రలోని 18కి పైగా లోక్‌సభ స్థానాల్లో మోదీ ప్రచారం చేశారు. వాటిలో 15 సీట్లలో ఎన్డీయే ఓటమి చవిచూసింది.

PM KISAN instalement: రూ.20 వేల కోట్లు విడుదల.. ఎప్పుడంటే..?


అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసే పోరాటం..

కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ 'మహా వికాస్ అఘాడి' కలిసే పనిచేస్తుందని శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాకరే శనివారంనాడు జరిగిన మీడియా సంయుక్త సమావేశంలో తెలిపారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో బాసటగా నిలిచిన సిటిజన్ గ్రూపులు, వివిధ యూట్యూబ్ ఛానెళ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనను వదిలి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత పృధ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ, తమ కూటమిలో ఎక్కువ-తక్కువలు లేవని, ప్రతి అసెంబ్లీ సీటును పరిగణనలోకి తీసుకుని సీట్ల షేరింగ్‌పై నిర్ణయాలు తీసుకుంటామని, ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిపామని చెప్పారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jun 15 , 2024 | 05:37 PM