Share News

Tehran : ఇరాన్‌ అధ్యక్షుడిగా పెజెష్కియాన్‌

ABN , Publish Date - Jul 07 , 2024 | 02:56 AM

ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ దేశమైన ఇరాన్‌లో సంస్కరణవాది డాక్టర్‌ మసౌద్‌ పెజెష్కియాన్‌ (69) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మే నెలలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఇరాన్‌లో ఎన్నికలు నిర్వహించారు.

 Tehran : ఇరాన్‌ అధ్యక్షుడిగా పెజెష్కియాన్‌

  • ఇస్లామిక్‌ రిపబ్లిక్‌లో సంస్కరణవాది విజయం

  • వృత్తిరీత్యా వైద్యుడు.. హిజాబ్‌ నిబంధనలను సరళీకరిస్తారని ప్రచారం!

టెహ్రాన్‌, జూలై 6: ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ దేశమైన ఇరాన్‌లో సంస్కరణవాది డాక్టర్‌ మసౌద్‌ పెజెష్కియాన్‌ (69) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మే నెలలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఇరాన్‌లో ఎన్నికలు నిర్వహించారు. శుక్రవారం పోలింగ్‌ జరగ్గా.. 3 కోట్ల మందిపైగా ఓటు వేశారు. శనివారం ఫలితాలను వెల్లడించారు. పెజెష్కియాన్‌కు 1.60 కోట్ల ఓట్లు, ఇబ్రహీం జలీలీకి 1.30 కోట్ల ఓట్లు వచ్చాయి. పెజెష్కియాన్‌ 28 లక్షల ఓట్ల తేడాతో జలీలీని ఓడించారు. ఇరాన్‌లో అధ్యక్ష ఎన్నికలకు తొలుత జూన్‌ 28న పోలింగ్‌ జరిగింది. అయితే, 6.1 కోట్ల మంది ఓటర్లలో 40 శాతం మంది మాత్రమే హక్కు వినియోగించుకున్నారు.

దేశం ఎదుర్కొంటున్న పరిస్థితుల పట్ల ఆగ్రహంతోనే ఇలా చేశారని తెలుస్తోంది. మొదటి రౌండ్‌లో పెజెష్కియాన్‌కు 42 శాతం, జలీలీకి 39 శాతం ఓట్లే వచ్చాయి. ఇరాన్‌ ఎన్నికల చట్టాల ప్రకారం పోలైన ఓట్లలో 50 శాతం పైగా వచ్చినవారే విజేతలు. లేదంటే.. టాప్‌-2లో ఉన్న ఇద్దరి మధ్య వారం తర్వాత మళ్లీ ఎన్నిక నిర్వహిస్తారు. దీనినే రన్‌ ఆఫ్‌ పోలింగ్‌ (రెండోసారి బ్యాలెట్‌) అంటారు.

ఈసారి పెజెష్కియాన్‌ మెజారిటీ సాధించారు. గుండె వైద్య నిపుణుడైన ఈయనకు సంస్కరణవాదిగా పేరుంది. అత్యంత వివాదాస్పద ‘హిజాబ్‌ ధారణ తప్పనిసరి’ నిబంధనను సరళం చేస్తానని, ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసేలా.. పశ్చిమ దేశాలతో సంబంధాలను మెరుగుపరుస్తానని తన ప్రచారంలో హామీ ఇచ్చారు. పెజెష్కియాన్‌.. 1954లో ఇరాన్‌లోని పశ్చిమ అజర్‌బైజాన్‌లో జన్మించారు. ఈయన తల్లి కుర్దు కాగా, తండ్రిది ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లోని అజర్‌ బైజాన్‌. 1980 నుంచి 8 ఏళ్లు ఇరాక్‌తో జరిగిన యుద్ధంలో వైద్యుడిగా సేవలందించారు. నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. వైద్య శాఖ మంత్రి, డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

Updated Date - Jul 07 , 2024 | 02:56 AM