TATA : అవమానించిన కంపెనీనే.. కొనేశారు
ABN , Publish Date - Oct 11 , 2024 | 07:04 AM
టాటా సంస్థల సారథిగా రతన్‌టాటా ఎన్నో క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొన్నారు.. ఆ సవాళ్లనే అవకాశాలుగా మలిచి కంపెనీ అభివృద్ధికి దారులు పరిచారు.
తొలిరోజుల్లో టాటా కార్ల విభాగానికి తీవ్ర నష్టాలు
అమ్మకానికి ఫోర్డ్‌తో సంప్రదింపులు, ఎదురైన అవమానం
డీల్ తిరస్కరణ.. తొమ్మిదేళ్లలో టాప్ రేంజ్‌కు టాటా కార్లు
ఫోర్డ్ జాగ్వార్, లాండ్‌రోవర్ల బ్రాండ్లను కొనుగోలు చేసిన టాటా
రతన్ టాటా స్టైలే వేరు
న్యూఢిల్లీ, అక్టోబరు 10: టాటా సంస్థల సారథిగా రతన్‌టాటా ఎన్నో క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొన్నారు.. ఆ సవాళ్లనే అవకాశాలుగా మలిచి కంపెనీ అభివృద్ధికి దారులు పరిచారు. టాటా ప్యాసింజర్ కార్ల డివిజన్ విజయయాత్ర దీనికొక ఉదాహరణ. మన దేశంలోని కార్ల మార్కెట్లో సంచలనం సృష్టించిన ‘టాటా ఇండికా’ వాస్తవానికి తొలిరోజుల్లో అమ్మకాలకు సంబంధించి చాలా వెనుకబడి ఉంది. నష్టాలు భరించలేక దాన్ని ఫోర్డ్ కంపెనీకి అమ్మేద్దామని టాటా యాజమాన్యం భావించింది. కానీ, ఫోర్డ్ కంపెనీ ప్రతినిధుల నుంచి ఎదురైన అవమానం.. వారి నిర్ణయాన్ని మార్చుకునేలా చేసింది. అంతేకాదు, తర్వాత రోజుల్లో ఏకంగా, ఫోర్డ్ కంపెనీకి చెందిన ప్రఖ్యాత కార్ల బ్రాండ్లు జాగ్వార్, లాండ్‌రోవర్లను టాటా కొనుగోలు చేసింది. అవమానించిన వాళ్లే కృతజ్ఞతలు తెలిపారు. ఇదంతా 1999-2008 మధ్య జరిగింది. టాటా గ్రూపులో సుదీర్ఘకాలం ఉన్నతస్థాయి ఉద్యోగిగా పని చేసిన ప్రవీణ్ కాడ్లే ఓ సందర్భంలో ఈ ఆసక్తికరమైన ఘట్టాన్ని వివరించారు.
తెలియనప్పుడు ఎందుకు ప్రారంభించారు?
ట్రాన్స్‌పోర్ట్ వాహనాల మార్కెట్లో ఎంతోకాలంగా టాప్ పొజిషన్‌లో ఉన్న టాటా.. ప్యాసింజర్ వాహనాల రంగంలోకి ప్రవేశించాలని భావించి ఇండికా కారును తీసుకొచ్చింది. అయితే, మార్కెట్లోకి వచ్చిన ఏడాది తర్వాత కూడా ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదు. దీంతో ప్యాసింజర్ కార్ల తయారీ లాభసాటిగా లేదని, ఆ విభాగాన్ని అమ్మేద్దామంటూ కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో, రతన్‌టాటాతోపాటు టాటా మోటర్స్ యాజమాన్యం ఫోర్డ్ కంపెనీతో సంప్రదింపులు ప్రారంభించింది. ఫోర్డ్ ప్రతినిధులు ముంబయిలో ఉన్న టాటా ప్రధాన కార్యాలయానికి వచ్చి కొనుగోలుకు ఆసక్తి వ్యక్తం చేశారు. తదుపరి సమావేశాల్లో భాగంగా.. రతన్‌టాటాతో కూడిన టాటా బృందం అమెరికాకు వెళ్లింది. అక్కడ టాటా ప్రతినిధులతో ఫోర్డ్ అధికారులు మాట్లాడుతూ, ‘ప్యాసింజర్ కార్ల విభాగం గురించి మీకు ఏమీ తెలియదు. అయినా ఎందుకు ప్రారంభించారు’ అంటూ ఎద్దేవా చేశారు. సదరు విభాగాన్ని కొనటం ద్వారా తాము టాటా సంస్థకు మేలు చేస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. సమావేశం అనంతరం టాటా బృందం తిరిగి భారత్‌కు బయల్దేరింది. విమానంలో రతన్‌టాటా ఎవరితోనూ మాట్లాడలేదు. ఈ ఘటన 1999లో జరిగింది. మరో 9 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ప్యాసింజర్ కార్ల అమ్మకాల్లో ఇండికా రికార్డులు నెలకొల్పింది. ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం కారణంగా 2008లో ఫోర్డ్ కంపెనీ తన బ్రాండ్లలో ముఖ్యమైన రెండింటిని.. జాగ్వార్, లాండ్‌రోవర్లను అమ్మటానికి నిర్ణయించింది. రంగంలోకి దిగిన టాటా ఆ రెండింటినీ 223 కోట్ల డాలర్లకు కైవసం చేసుకుంది. ఆ సందర్భంగా ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ టాటాకు కృతజ్ఞతలు తెలిపారు. ‘జేఎల్‌ఆర్‌ను కొనుగోలు చేయటం ద్వారా మీరు మాకు పెద్ద ఉపకారం చేశారు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ రెండు బ్రాండ్లు అంతర్జాతీయ మార్కెట్లో అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి. అంతేకాదు, దేశంలోని ప్యాసింజర్ కార్ల మార్కెట్లో టాటా దూసుకెళ్తోంది.