Share News

Wayanad Landslide: మాటల్లో చెప్పలేని విషాదమిది.. వయనాడ్ ఘటనపై రాహుల్, ప్రియాంక భావోద్వేగం

ABN , Publish Date - Aug 01 , 2024 | 07:23 PM

కొండచరియలు విరిగిపడి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన వయనాడ్(Wayanad) దుర్ఘటన ప్రాంతాలను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) గురువారం సందర్శించారు.

Wayanad Landslide: మాటల్లో చెప్పలేని విషాదమిది.. వయనాడ్ ఘటనపై రాహుల్, ప్రియాంక భావోద్వేగం

వయనాడ్: కొండచరియలు విరిగిపడి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన వయనాడ్(Wayanad) దుర్ఘటన ప్రాంతాలను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) గురువారం సందర్శించారు. బాధిత కుటుంబాలను, స్ధానికులను పరామర్శించిన అనంతరం కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌, ప్రియాంక మీడియాతో మాట్లాడారు.

బాధిత కుటుంబాలతో రోజంతా గడిపామని, ఇది మాటలకు అందని మహా విషాదమని అన్నారు. ప్రజల బాధలను చూసి చలించిపోయామని ఈ ప్రాంత పరిస్థితి చూస్తుంటే మాటలు రావట్లేదని భావోద్వేగానికి గురయ్యారు.


బాధిత కుటుంబాలకు భరోసానిచ్చేందుకే తాము వచ్చామని.. ఈ ఘటన మరువక ముందే హిమాచల్‌ప్రదేశ్‌లో మరో విపత్తు జరిగిందని అన్నారు. ఆప్తులను కోల్పోయి అనాథలైన పిల్లలను ఆదుకునే అంశంపై శుక్రవారం పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని ప్రియాంక తెలిపారు. ఇరువురు నేతలు మెప్పాడిలో క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌లో బాధితుల‌ను క‌లిశారు. వారి వెంట ఏఐసీసీ ప్రధాన కార్యద‌ర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు.


జాతీయ విపత్తు...

288 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన వయనాడ్ ఘటనను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇంత మంది బాధితులు తమ ఆత్మీయులను కోల్పోవడం ఎవరూ తీర్చలేని బాధ. కాగా, కొండచరియలు విరిగిపడిన ముండక్కై ప్రాంతంలో సహాయక చర్యలు పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.

సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు నలుగురు మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆయన నియమించారు. బాధిత కుటుంబాలకు మంత్రులు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. చూరల్‌మలలో ఒక్కచోటే 288 మందికి పైగా మరణించగా.. 200 మంది గాయపడ్డారు. జులై 30 తెల్లవారుజామున వయనాడ్‌లోని ముండక్కై, చురల్‌మలలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి విధ్వంసం సృష్టించాయి.


ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మృతదేహాలపై పడ్డ బండరాళ్లను అడ్డుతొలగించడానికి యంత్రాలసాయంతో సహాయక చర్యలు చేపట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి మళ్లీ గెలుపొందారు. అయితే ఆయన గత ఎన్నికల్లో యూపీలోని రాయబరేలి నుంచీ పోటీ చేశారు. రెండింట్లో ఒక సీటును వదులుకోవాల్సి రావడంతో రాహుల్.. వయనాడ్‌ సీటుకి రాజీనామా చేశారు. ఈ ఎంపీ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేయాలని భావిస్తున్నారు.

Updated Date - Aug 01 , 2024 | 07:25 PM