అర్హులైన భారతీయులకు యూఏఈ వీసా-ఆన్-అరైవల్
ABN , Publish Date - Oct 19 , 2024 | 04:15 AM
భారతీయ ప్రయాణికుల కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వీసా-ఆన్-అరైవల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 18: భారతీయ ప్రయాణికుల కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వీసా-ఆన్-అరైవల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. పర్యాటకులు, వ్యాపారవేత్తలు, ప్రవాసులను ఆకర్షించడంతో పాటు యూఏఈకి ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అర్హులైన భారత పౌరులకు 14 రోజుల వ్యవధితో కూడిన వీసా-ఆన్-అరైవల్ సదుపాయాన్ని యూఏఈ కల్పిస్తోందని అక్కడి భారత రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది. ప్రయాణికులు కనీసం 6నెలల పాటు చెల్లుబాటయ్యే పాస్‌పోర్టును కలిగి ఉండటంతో పాటు అమెరికా జారీ చేసిన గ్రీన్‌కార్డు/ వీసా, యూరోపియన్ యూనియన్, యూకే దేశాలు మంజూరు చేసిన చెల్లుబాటయ్యే శాశ్వత నివాస పత్రం/ వీసా ఉన్నవారు అర్హులని వివరించింది. వీరికి తొలుత 14 రోజుల గడువున్న వీసా మంజూరు చేస్తారు. తర్వాత తగిన రుసుము చెల్లించి దీన్ని 60 రోజులు పొడిగించుకొనే అవకాశం ఉంది.