Share News

Wayanad landslide: కొనసాగుతున్న సహాయక చర్యలు.. రెస్క్యూ సిబ్బంది ధైర్యసాహసాలకు నెటిజన్లు ఫిదా

ABN , Publish Date - Aug 03 , 2024 | 03:53 PM

కేరళలోని వయనాడ్‌లో(Wayanad landslide) కొండచరియలు విరిగిపడిన తరువాత, సాయుధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ప్రభుత్వ యంత్రాంగంతో కూడిన ప్రధాన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది.

Wayanad landslide: కొనసాగుతున్న సహాయక చర్యలు..  రెస్క్యూ సిబ్బంది ధైర్యసాహసాలకు నెటిజన్లు ఫిదా

వయనాడ్‌: కేరళలోని వయనాడ్‌లో(Wayanad landslide) కొండచరియలు విరిగిపడిన తరువాత, సాయుధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ప్రభుత్వ యంత్రాంగంతో కూడిన ప్రధాన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర అటవీశాఖ అట్టమల అడవుల్లో నలుగురు చిన్నారులతో సహా ఆరుగురు గిరిజనులను రక్షించింది. కాగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

పలు గ్రామాల్లో వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురదలో కూరుకుపోయారు. విపత్తు నిర్వహణ బృందాలు, సైనికుల సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ క్రమంలో కల్ఫేట అటవీ అధికారి హాషిస్‌కి చెందిన రెస్క్యూ బృందానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


అటవీ ప్రాంతంలో పెద్ద లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఓ కుటుంబం చిక్కుకొని ఉండడాన్ని రెస్క్యూ బృందం గమనించింది. వారిని కాపడటానికి నాలుగున్నర గంటల పాటు శ్రమించి తాళ్ల సహాయంతో కొండపైకి చేరుకున్నారు. అక్కడ పనియా తెగకు చెందిన ఓ గిరిజన కుటుంబం గుహలో చిక్కుకొని ఉన్నట్లు గుర్తించారు. గత కొంత కాలంగా ఆహారం తీసుకోకపోవడంతో నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు నీరసించారని అధికారులు చెప్పారు. తమ వద్ద ఉన్న ఆహారాన్ని వారికి తినిపించామని.. నాలుగు రోజులుగా ఎటూ కదల్లేని స్థితిలో అలాగే ఉండిపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులతో వెళ్లడానికి ససేమిరా..

బాధితులను తమతో రావాలని అధికారులు కోరారు. దానికి వారు అంగీకరించలేదు. ఎంతగానో బతిమాలితే వారి తల్లిదండ్రులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. పిల్లలిద్దరినీ తమ శరీరాలకు కట్టుకుని తాళ్లతో ఆ కుటుంబం మొత్తాన్ని కొండపై నుంచి సురక్షితంగా కిందకి తీసుకువచ్చి.. సురక్షిత ప్రాంతాలకు తరలించారు.wayanad-rescue.jpg


సీఎం ప్రశంసలు..

ప్రాణాలకు తెగించి రెస్క్యూ బృందం ఓ గిరిజన కుటుంబాన్ని కాపాడటంపై కేరళ సీఎం పినరయి విజయన్ హర్షం వ్యక్తం చేశారు. అంత రిస్క్ చేసిన బృంద సభ్యులను కొనియాడారు. ‘‘వయనాడ్‌లో పరిస్థితులను యథాతథ స్థితికి తేవడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. రెస్క్యూ బృందం గంటలకొలది శ్రమించి, ప్రాణాలకు తెగించి ఓ మారుమూల గిరిజన కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను కాపాడింది. ఈ విషాద సమయంలో సహాయక బృందాలు అందిస్తున్న తోడ్పాటు వారిలోని గొప్పతనాన్ని తెలియజేస్తోంది. వారంతా మనకు స్ఫూర్తి నింపారు. ఇలాగే ఐక్యంగా ఉంటూ వచ్చిన కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుందాం. బాధితులకు అండగా నిలుస్తాం’’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Updated Date - Aug 03 , 2024 | 04:36 PM