Wayanad Landslides: వయనాడ్‌కి బాసటగా ఎయిర్‌టెల్, జియో
ABN , Publish Date - Aug 01 , 2024 | 06:50 PM
దశాబ్ద కాలంలో భారత్‌లో జరిగిన అతిపెద్ద విషాదాల్లో కేరళలోని వయనాడ్(Wayanad Landslides) దుర్ఘటన చరిత్రలో నిలిచిపోతుంది. జులై 30 తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడిన ఘటనలో వయనాడ్ జిల్లాలోని ముండక్కై, చూరల్‌మల్‌లోని వందల సంఖ్యల్లో ఇళ్లు మట్టిదిబ్బల్లో కూరుకుపోయాయి.
వయనాడ్: దశాబ్ద కాలంలో భారత్‌లో జరిగిన అతిపెద్ద విషాదాల్లో కేరళలోని వయనాడ్(Wayanad Landslides) దుర్ఘటన చరిత్రలో నిలిచిపోతుంది. జులై 30 తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడిన ఘటనలో వయనాడ్ జిల్లాలోని ముండక్కై, చూరల్‌మల్‌లోని వందల సంఖ్యల్లో ఇళ్లు మట్టిదిబ్బల్లో కూరుకుపోయాయి. ఈ విషాద ఘటనలో 250 మంది మరణించగా, 240కిపైగా గల్లంతయ్యారు.
200ల మందికిపైగా గాయపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా బుధవారం నాటికి వెయ్యి మందిని రక్షించారు. గురువారం సైతం బండరాళ్లు తొలగించారు. అయితే ఎడతెరిపి కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
కుటుంబాలకు కుటుంబాలే తుడిచిపెట్టుకుపోయిన ఈ విషాద ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలకు సాయం చేసేందుకు పలువురు ప్రముఖులు ఇప్పటికే ముందుకు వచ్చారు. వారిలో తమిళనాడు సీఎం స్టాలిన్, అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ, వివిధ కంపెనీలకు చెందిన అధినేతలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. తాజాగా జియో, ఎయిర్‌టెల్‌లు సైతం బాధితులకు బాసటగా నిలిచేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ రెండు టెలికాం కంపెనీలు ప్రభావిత ప్రాంతాల వినియోగదారుల కోసం ఉపశమన చర్యలు ప్రకటించాయి.
నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచిన జియో..
వయనాడ్‌లోని ఆ రెండు గ్రామాల్లో సహాయకచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నందునా అందుకు అనుగుణంగా నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచాలని జియో నిర్ణయించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారుల వినతి మేరకు ఆ ప్రాంతంలో ప్రత్యేక టవర్‌ను ఇన్‌స్టాల్ చేసింది. బాధితులను త్వరగా కాపాడి.. సురక్షిత ప్రాంతాలకు పంపించడానికి కీలకమైన మొబైల్ నెట్‌వర్క్ వేగం పెంచడానికి నిర్ణయం తీసుకున్నట్లు జియో తెలిపింది. అయితే కస్టమర్‌ల కోసం జియో ఎలాంటి డేటా, కాలింగ్ లేదా సర్వీస్ చెల్లుబాటు ప్రయోజనాలను ప్రకటించలేదని వివరించింది.
మూడు రోజులపాటు 1జీబీ డేటా ఫ్రీ..
వయనాడ్‌లో ప్రీపెయిడ్ మొబైల్ సేవల గడువు ముగిసిన వినియోగదారులకు నిరంతర కనెక్టివిటీని అందించడానికి మూడు రోజుల పాటు రోజుకు 1 GB ఉచిత మొబైల్ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను ఎయిర్‌టెల్ అందిస్తోంది. ప్రస్తుతం అక్కడ దుర్భర పరిస్థితులు ఉన్నందున రీఛార్జ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నందునా వారికి సహాయం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనికితోడు పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లకు బిల్లు చెల్లింపు గడువును 30 రోజులు పొడిగించింది.
మానవతా సాయం కోసం.. భారత సైన్యం కోజికోడ్‌లో మేజర్ జనరల్ వీటీ మాథ్యూ, కర్ణాటక జనరల్ ఆఫీసర్ కమాండింగ్, కేరళ సబ్ ఏరియా, బ్రిగేడియర్ అర్జున్ సెగన్ నేతృత్వంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఆరు కిలోమీటర్ల మేర ప్రస్తుతం సైనికులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.