Share News

Waqf Act: వక్ఫ్ బోర్డు అంటే ఏంటి? చట్టం సవరణపై వివాదమెందుకు?

ABN , Publish Date - Aug 05 , 2024 | 07:11 PM

వక్ఫ్‌ చట్టంలో పలు సవరణలకు కేంద్రం సిద్ధమైంది. కనిపించిన ప్రతి భూమీ, ఆస్తీ తమదేనంటూ నియంత్రణలోకి తీసుకుంటున్న వక్ఫ్‌ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేయనుంది. మరింత పారదర్శకత కోసం సదరు భూములు/ఆస్తుల విషయంలో కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయనుంది.

Waqf Act: వక్ఫ్ బోర్డు అంటే ఏంటి? చట్టం సవరణపై వివాదమెందుకు?

ఇంటర్నెట్ డెస్క్: వక్ఫ్‌ చట్టంలో పలు సవరణలకు కేంద్రం సిద్ధమైంది. కనిపించిన ప్రతి భూమీ, ఆస్తీ తమదేనంటూ నియంత్రణలోకి తీసుకుంటున్న వక్ఫ్‌ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేయనుంది. మరింత పారదర్శకత కోసం సదరు భూములు/ఆస్తుల విషయంలో కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయనుంది. అలాగే వక్ఫ్‌ బోర్డుల్లో మహిళలకూ తప్పనిసరి చోటు కల్పిస్తూ వక్ఫ్‌ చట్టంలోని 9,14 సెక్షన్లను సవరించాలని ప్రతిపాదించింది. దాదాపు 40 సవరణలతో కూడిన సవరణ బిల్లును మోదీ కేబినెట్‌ ఇటీవల ఆమోదించింది. అయితే ఇప్పుడీ వక్ఫ్ బోర్డు చుట్టూ రాజకీయ అలజడి నెలకొంది. వక్ఫ్‌ బోర్డుల చట్ట ప్రతిపత్తి, అధికారాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకున్నా సహించేది లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు హెచ్చరించింది. వక్ఫ్‌ చట్టాన్ని సవరించి ప్రతిపాదనను తిరస్కరించవలసిందిగా ఎన్‌డీఏ పక్షాలకు బోర్డు విజ్ఞప్తి చేసింది.

వక్ఫ్‌ సంపదను దోచుకునేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్‌ చట్టాన్ని సవరించడానికి ప్రయత్నిస్తోందని మజ్లిస్‌ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. వక్ఫ్‌బోర్డు స్వయం ప్రతిపత్తికి, మత స్వేచ్ఛకువిఘాతం కలిగించేలా వక్ఫ్‌ చట్టంలో సవరణలకు కేంద్రం ప్రతిపాదనలు తీసుకువచ్చిందని ఆయన విమర్శించారు. చట్టంలో సవరణలు చేయవద్దని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తుండగా.. వక్ఫ్‌ బోర్డుల్లో తమకు చోటివ్వడం లేదని, చట్టంలో మార్పులు తీసుకురావాలని ముస్లిం మేధావులు, మహిళలు, షియాలు, బొహ్రా ముస్లింలు చాలాకాలంగా కోరుతున్నారు. అసలు వక్ఫ్ బోర్డు అంటే ఏంటి. వక్ఫ్ బోర్డు చరిత్ర, రాజకీయ అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.


తొలి వక్ఫ్ బోర్డు చట్టం..

మొదటి వక్ఫ్ చట్టానికి 1954లో ఆమోదముద్ర లభించింది.1995లో మొదటి సవరణ చేసి 2013లో రెండోసారి సవరణ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కోర్టులు కూడా వక్ఫ్ బోర్డు విషయంలో జోక్యం చేసుకోలేవు. ముస్లిం వర్గాల డిమాండ్ నేపథ్యంలో అప్పటి యూపీఏ సర్కార్ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది. అయితే సామాన్యుల నుంచి వక్ఫ్ బోర్డు విధానాలపై ఫిర్యాదులు రావడంతో సవరణలకు తాజాగా కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇకపై వక్ఫ్‌ బోర్డులు తమ ఆస్తుల వాస్తవ విలువను నిర్ధారించేందుకు జిల్లా కలెక్టర్‌ల వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవడాన్ని సవరణ బిల్లు తప్పనిసరి చేస్తుంది. దేశంలో 30 వక్ఫ్ బోర్డులు కోట్ల విలువైన ఆస్తులను చూసుకుంటున్నాయని, అన్ని వక్ఫ్ ఆస్తుల ద్వారా సంవత్సరానికి రూ. 200 కోట్ల ఆదాయం సమకూరుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బోర్డుల్లో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

వక్ఫ్ బోర్డు అంటే..

వక్ఫ్ చట్టం - 1995 ప్రకారం ప్రతి రాష్ట్రం/యూటీలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ కోసం వక్ఫ్ బోర్డు అనే సంస్థను స్థాపించారు. వక్ఫ్ బోర్డు ముస్లింల మతపరమైన, సామాజిక, ఆర్థిక సంబంధాలను కలిగి ఉంటుంది. అవి మసీదులతోపాటు, దర్గా, శ్మశానవాటికలు, సామాజిక సంక్షేమం కోసం ఉద్దేశించిన పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, ముసాఫిర్ఖానాలకు నిర్వహిస్తాయి. వాటి స్థలాల రక్షణలో ముందుంటాయి. భారత్‌లో 30 వక్ఫ్ బోర్డులు ఉండగా.. వాటి ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.

వక్ఫ్ అంటే?

యూపీ సున్నీ వక్ఫ్ బోర్డ్ వెబ్‌సైట్ ప్రకారం.. "వక్ఫ్" అనేది ఇస్లామిక్ ప్రయోజనాలకు ఉద్దేశించిన ధర్మబద్ధమైన, మతపరమైన లేదా ధార్మికమైన పదం.


వివాదం ఎందుకు?

ముస్లిం ఓటర్లపై వక్ఫ్ బోర్డు సభ్యుల ప్రభావం ఉంటుంది. ఈ సభ్యులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాజకీయ పార్టీలతో సంబంధం కలిగి ఉంటారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, మజ్లిస్, TMC, లౌకిక వాదాన్ని అనుసరించే ఇతర ప్రాంతీయ పార్టీలు ముస్లిం వక్ఫ్ బోర్డు సభ్యులపట్ల సానుకూల ధోరణి ప్రదర్శిస్తాయి. వారి ఓట్లు చేజారనీయకుండా రాజకీయ పార్టీలు ఇలా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ముస్లిం మహిళల పట్ల వివక్షను అంతమొందించేందుకు కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చినప్పుడు కూడా అదే తరహా విమర్శలు వచ్చాయి.

షరియత్ చట్టం..

వక్ఫ్ చట్టం, వక్ఫ్ ఆస్తులు... భారత రాజ్యాంగం, షరియత్ అప్లికేషన్ చట్టం - 1937 ద్వారా రక్షించబడుతున్నాయి. కాబట్టి ఆస్తుల స్వభావాన్ని, స్థితిని మార్చే ఏ సవరణను ప్రభుత్వం చేయలేదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(AIMPLB) తేల్చి చెప్పింది. కేంద్రం సవరణలతోప్రవేశపెట్టబోతున్న వక్ఫ్ చట్టం చుట్టూ రాజకీయాలు మరింత వేడెక్కబోతున్నాయి.

For Latest News and National News click here

Updated Date - Aug 05 , 2024 | 07:12 PM