Share News

AAP: వయసు మళ్లిన నేతలున్న రాజకీయ వ్యవస్థ ఇది.. రాఘవ్ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 01 , 2024 | 05:50 PM

ప్రపంచంలో యువకులు అత్యధికంగా ఉన్నది భారత్‌లోనే. మరి వయస్సు పైబడిన వారు ఎక్కువగా ఉన్నది ఏ రంగంలో అంటే టక్కున గుర్తొచ్చేది రాజకీయాలే. ఇదే అంశాన్ని లేవనెత్తారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha) .

AAP: వయసు మళ్లిన నేతలున్న రాజకీయ వ్యవస్థ ఇది.. రాఘవ్ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు

ఢిల్లీ: ప్రపంచంలో యువకులు అత్యధికంగా ఉన్నది భారత్‌లోనే. మరి వయస్సు పైబడిన వారు ఎక్కువగా ఉన్నది ఏ రంగంలో అంటే టక్కున గుర్తొచ్చేది రాజకీయాలే. ఇదే అంశాన్ని లేవనెత్తారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha). గురువారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థుల కనీస వయసు ప్రస్తుతం 25 ఏళ్లుగా ఉంది.


‘‘మన దేశంలో యువత ఎక్కువ సంఖ్యలో ఉంది. కానీ 35 ఏళ్ల కంటే తక్కువ వయసున్న జనాభా 65 శాతంగా ఉంది. 25 ఏళ్ల లోపువారు 50 శాతం ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నికైన లోక్‌సభలో 40 ఏళ్లలోపు వారు 26 శాతం మంది ఉన్నారు. ప్రస్తుత లోక్‌సభలో 12 శాతం మాత్రమే ఉన్నారు. వయసు మళ్లిన నేతలతో ఉన్న యువ దేశం మనది. యువ నాయకులతో ఉన్న దేశంగా మారాలి. అందుకోసం కేంద్రానికి ఓ సూచన చేస్తున్నా. ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలి. అప్పుడే ప్రజాసమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయి’’ అని చద్దా పేర్కొన్నారు.


సరదా సంభాషణ..

రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌కు(Jagdeep Dhankhar) రాఘవ్ చద్దాకు మధ్య సభలో ఆసక్తికర సంభాషణ జరిగింది. యువ వయసులో రాఘవ్ చద్దా(35) సమస్యలపై సభలో ప్రస్తావించడాన్ని జగదీప్ ధన్‌ఖర్ కొనియాడారు. దీనిపై సరదాగా స్పందించిన జగదీప్.. ఇంత చిన్న వయసులో లోక్‌సభలో అడుగుపెట్టాలనుకుంటున్నారా అని సరదాగా ప్రశ్నించారు. తనకు ముందునుంచే రాజకీయాలంటే ఆసక్తి ఎక్కువని.. యువత ఈ రంగాన్ని చెడు వృత్తిగా భావించి దూరంగా ఉంటోందని రాఘవ్ అన్నారు. యువత ధోరణిలో మార్పు వచ్చి చట్టసభల్లో వారి సంఖ్య పెరిగినప్పుడే దేశం మరింత జోరుగా అభివృద్ధిబాటలో పయనిస్తుందని చద్దా అభిప్రాయపడ్డారు.

Updated Date - Aug 01 , 2024 | 05:52 PM