Share News

Chef de Mission : శరణార్థుల టార్చ్‌బేరర్‌

ABN , Publish Date - Jun 27 , 2024 | 01:15 AM

‘మేము ఏ దేశానికీ ప్రతినిధులం కాదు. మాకు జాతులు, మతాలు లేవు. మాదంతా ఒకే కుటుంబం. అది క్రీడా కుటుంబం’’ అంటారు మసోమా అలీ జాదా. శరణార్థిగా ఎన్ని దేశాలు తిరిగినా...

Chef de Mission : శరణార్థుల టార్చ్‌బేరర్‌

‘మేము ఏ దేశానికీ ప్రతినిధులం కాదు. మాకు జాతులు, మతాలు లేవు. మాదంతా ఒకే కుటుంబం. అది క్రీడా కుటుంబం’’ అంటారు మసోమా అలీ జాదా. శరణార్థిగా ఎన్ని దేశాలు తిరిగినా... క్రీడాకారిణిగా పేరు తెచ్చుకోవాలనే ఆశయాన్ని ఆమె ఎన్నడూ విడువపోలేదు. తాలిబన్ల వేధింపులు భరించలేక... ఫ్రాన్స్‌ ఆశ్రయం కోరిన కుటుంబం ఆమెది. అక్కడ క్రీడల్లో తన ప్రతిభ చూపి, టోక్యో ఒలింపిక్స్‌లో శరణార్థుల తరఫున పోటీపడ్డారు. రాబోయే పారిస్‌ ఒలింపిక్స్‌లో తలపడుతున్న శరణార్థుల ఒలింపిక్స్‌ బృందానికి ‘ఛెఫ్‌ డి మిషన్‌’గా నాయకత్వం వహిస్తున్నారు.

‘‘నేను అప్ఘనిస్తాన్‌లో... యుద్ధసమయంలో పుట్టాను. మా దేశంలో పరిస్థితులు విషమించడంతో... నాకు ఊహ తెలియని వయసులోనే ఇరాన్‌కు వెళ్ళి తలదాచుకోవాల్సి వచ్చింది. కొన్నేళ్ళకు అప్ఘనిస్తాన్‌కు తిరిగి వచ్చేశాం. మళ్ళీ చదువు కొనసాగించాను. తొమ్మిదేళ్ళ వయసులో నాకు సైక్లింగ్‌పై ఆసక్తి కలిగింది. కానీ వీధుల్లోకి సైకిల్‌ తీసుకొని వస్తే... వేధింపులు ఎదురయ్యేవి. అయినా...

సైక్లింగ్‌లో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకోవాలనే నా కలను చంపుకోలేకపోయాను. నన్ను జనం ఎగతాళి చేసేవారు, రాళ్ళతో కొట్టేవారు. గాయాలతో ఆసుపత్రిపాలయ్యాను. అన్నిటినీ భరించాను. అప్ఘన్‌ ఉమెన్స్‌ నేషనల్‌ సైక్లింగ్‌ టీమ్‌లో సభ్యురాలిగా పలు పోటీల్లో పాల్గొన్నాను.

నా లక్ష్యానికి చేరువవుతున్న సమయం(2016)లో... తాలిబన్ల నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. నా కుటుంబాన్ని చంపేస్తామంటూ హెచ్చరికలు చేశారు. దాడులు చేశారు. ఇక భరించలేక... నా తల్లితండ్రులు, ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఫ్రాన్స్‌ను ఆశ్రయం కోరాం. కొన్నాళ్ళకు హ్యుమానిటేరియన్‌ వీసాను ఆ దేశం మంజూరు చేసింది. అక్కడ అడుగు పెట్టిన తరువాత... నా దేశం, నా జాతి కారణంగా ఎన్నో వివక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది.


ఆ నిరీక్షణ సుదీర్ఘమైన హింస...

శరణార్థుల్లో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి. వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన దేశం మీద ఆధారపడి... ఈ సమస్యలు ఒక వ్యక్తికీ, మరో వ్యక్తికీ మధ్య భిన్నంగా ఉంటాయి. సాధారణంగా పేపర్‌ వర్క్‌ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ ఇబ్బందులు, సవాళ్ళు ఎదురవుతాయి. మేము కొత్త దేశానికి వచ్చాక... అక్కడి అధికారులు జారీ చేసే పత్రాల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. దానికి చాలా కాలం పడుతుంది. అవి వచ్చేదాకా... మేము ఏదీ చేయడానికి వీలుండదు. అక్కడి భాష నేర్చుకోలేం. విద్య మాకు అందుబాటులో ఉండదు.. ఆ నిరీక్షణ సుదీర్ఘమైన హింసలా ఉంటుంది. పత్రాలు వచ్చాక కూడా...

చదువుకోవాలనుకొనేవారుశరణార్థులను అనుమతించే యూనివర్సిటీలో చోటు సంపాదించడం, బతుకుతెరువుకోసం ఉపాధి వెతుక్కోవడం చాలా కష్టం. అదే సమయంలో... స్వదేశంలో ఉన్న కుటుంబాల గురించి ఆలోచనలు వెన్నాడుతూ ఉంటాయి. కొత్త దేశంలో మాకు సాయం చేసేవారెవరూ ఉండరు. ఆ దశలో స్థైర్యంగా కొనసాగడానికి శరణార్థులకు ఉండే ఏకైక అవకాశం... క్రీడలు. చాలామంది శరణార్థులు ఏదో సమయం గడపడానికీ, ఆరోగ్యానికీ, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికీ క్రీడలను ఆశ్రయిస్తారు.

నాకు అంతకుముందే క్రీడలపై ఉన్న ఆసక్తి... నాలాంటి వారిని మరింత దగ్గర చేసింది. శరణార్థులకు సహాయం చేసే ఒక ఫ్రెంచ్‌ కమ్యూనిటీ మాకు పరిచయం కావడం, పత్రాలు చేతికి అందడంతో... కష్టాలు కొంతవరకూ తీరాయి. నా క్రీడా నేపథ్యం వల్ల ‘ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ’ (ఐఓసీ) నుంచి ‘రెఫ్యూజీ అథ్లెట్‌ స్కాలర్‌షిప్‌’ దొరికింది. కఠోర సాధన చేశాను. 2020లో టోక్యోలో జరిగిన ఒలింపింక్స్‌లో... ఐఓసీ రెఫ్యూజీ ఒలింపిక్‌ జట్టు తరఫున.. సైక్లింగ్‌ ఈవెంట్‌లో పోటీ పడ్డాను. 2022లో ఐఓసీ అథ్లెట్స్‌ కమిషన్‌ సభ్యురాలినయ్యాను.

ఆ పదవిని అందుకున్న మొదటి రెఫ్యూజీని నేనే. ఈ ఏడాది ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో... పోటీ పడుతున్న శరణార్థుల ఒలింపిక్‌ బృందానికి ‘ఛెఫ్‌ డి మిషన్‌’గా నన్ను నియమించారు. ఇది నేను ఏమాత్రం ఊహించని విషయం. గొప్ప గౌరవం. మాకు ప్రతిభ, సామర్థ్యం ఉన్నాయని లోకానికి చాటిచెప్పే అవకాశం మాకు దొరికింది. తద్వారా ప్రపంచం మమ్మల్ని చూసే దృక్పథాన్ని మార్చగలమని భావిస్తున్నాను. నేను ప్రాతినిధ్యం వహిస్తున్నది... మా టీమ్‌లోని అథ్లెట్లకు మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా దాదాపు నిర్వాసితులైన పన్నెండు కోట్ల మందికి పైగా శరణార్థులకు. మా విజయాలతో వారిలో స్ఫూర్తి నింపడం, గతం చేసిన గాయాల నుంచి ఊరటనివ్వడం మా లక్ష్యం.


వివక్ష, హింస పోవాలి...

నిర్వాసితులైన కోట్లాది కాందిశీకుల సంక్షోభిత జీవితాలపై ఆందోళన చెందిన ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 2015లో... ‘రెఫ్యూజీ ఒలింపిక్‌ టీమ్‌’ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో పదిమంది అథ్లెట్లు ఈ టీమ్‌ తరఫున పాల్గొన్నారు. 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో... నాతో సహా ఇరవై తొమ్మిది మంది పాల్గొన్నారు. తాజాగా ప్యారిస్‌లో పోటీ పడబోయే మా బృందంలో 36 మంది క్రీడాకారులున్నారు. వీరు దేశాలు... ఆఫ్ఘనిస్తాన్‌, కామెరూన్‌, డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, ఎరిత్రియా, ఇరాన్‌, ఇరాక్‌, దక్షిణ సూడాన్‌, సూడాన్‌, సిరియా, రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, వెనిజులాలకు చెందినవారు. పన్నెండు క్రీడలలో... అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, కానోయింగ్‌, సైక్లింగ్‌, జూడో,కరాటే, తైక్వాండో, షూటింగ్‌, స్విమ్మింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌లలో పోటీ పడుతున్నారు. వీరు పదిహేను దేశాల్లో ఆశ్రయం పొందుతున్న కాందిశీకులు. వాళ్ళందరూ వివిధ మతాలకు, జాతులకు చెందినవారు. ఏ దేశానికీ ప్రాతినిధ్యం వహించడం లేదు. ఎందుకంటే నాలాంటి వాళ్ళకు ఇప్పుడు స్వదేశమనేది లేనే లేదు. అందరూ హింసకు గురైనవాళ్ళు. ప్రాణాలను అరచేత పెట్టుకొని... వేరే చోటికి వచ్చి తలదాచుకుంటున్నవారు. పుట్టిన చోటు నుంచి వేరుపడి, తమ గుర్తింపును, బంధాలను వదిలేసుకొని... పరాయి సీమల్లో బతుకులు ఈడుస్తున్నవాళ్ళు. అయినప్పటికీ.... వారందరికీ ఒక కల ఉంది...ఒలింపిక్స్‌లో పోటీ చేయడం. అది ఇప్పుడు నెరవేరుతోంది.

ప్రస్తుతం దాదాపు డెబ్భై మంది అథ్లెట్లు... ‘రెఫ్యూజీ అథ్లెట్‌ స్కాలర్‌షిప్‌’ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. భవిష్యత్తులో మరెందరో మంచి శిక్షణ పొంది, పోటీల్లో రాణిస్తారనడంలో సందేహం లేదు. మేమందరం ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాం. ఇప్పుడు కొత్త తరంలో ప్రేరణ కలిగించే అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటామనే నమ్మకం ఉంది. నా వ్యక్తిగత విషయాలకు వస్తే... నా వయసు ఇరవయ్యెనిమిదేళ్ళు. ఇంజనీరింగ్‌ చదువుతున్నాను. మళ్ళీ మా దేశానికి వెళ్ళాలని మా కుటుంబం కోరిక. కానీ మహిళలకు ఇప్పటికీ అది అనుకూలం కాదు. మా దేశంలో మార్పు రావాలనీ, వివక్ష, హింస పోయి అందరికీ సమాన అవకాశాలు రావాలనీ కోరుకుంటున్నాను.’’

Updated Date - Jun 27 , 2024 | 04:52 AM