Share News

Navya : పాలతో ఓ పానీయం ‘వాసాధిక’

ABN , Publish Date - Jul 27 , 2024 | 05:50 AM

పాలు ఆరోగ్యాన్నీ, పోషణనీ, శక్తినీ అందించే ముఖ్య ఆహార ద్రవ్యం. పాలే ప్రధాన ఆహారం కూడా. పసిపిల్లలు పాలు మాత్రమే తాగుతూ పెరుగుతారు. పాలు సంపూర్ణ ఆహారమే.

Navya : పాలతో ఓ పానీయం ‘వాసాధిక’

దకరస నివృత్తం గోమయాగ్రౌవిపక్వం నవదళ ఘన సరైర్వాసితంబష్కయిణ్యాః!

పటమిలిత సుఖండం స్థాపితం నవ్యపాత్రే విగతతర సుధాంశో గీయతే వసధిక్య!

పాలు ఆరోగ్యాన్నీ, పోషణనీ, శక్తినీ అందించే ముఖ్య ఆహార ద్రవ్యం. పాలే ప్రధాన ఆహారం కూడా. పసిపిల్లలు పాలు మాత్రమే తాగుతూ పెరుగుతారు. పాలు సంపూర్ణ ఆహారమే. కానీ, వయసు పెరిగే కొద్దీ కేవలం పాలు తాగి మనిషి జీవించలేడు. ఎందుకని? ఆరు రుచుల్లో తీపి మాత్రమే పాలలో ఉంటుంది. తక్కిన పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు పాలలో ఉండవు. కాబట్టి, పాలను అతిగా తీసుకోవటాన్ని ఆయుర్వేద శాస్త్రం ఒప్పుకోదు. చ్యవనప్రాశ, అశ్వగంధాది లేహ్యం, బ్రాహ్మీరసాయనం లాంటి ఆరు రుచులు కలిగిన ఔషధాలకు అనుపానంగా పాలను తీసుకోవటం మంచిది. కొన్ని తీక్షణమైన ఔషధాలకు అనుపానంగా మాత్రమే పాలు కలిపిన అన్నం తినాలంటారు. అది కూడా కొద్ది రోజులు మాత్రమే! జన్మంతా పాలు తాగి ఋషులు కూడా జీవించలేరు. ఉపవాసాల సమయంలో పాలు మాత్రమే తీసుకోవటాన్ని కూడా ఆయుర్వేద శాస్త్రం ఒప్పుకోదు.

పాలు ఆహారం మాత్రమే కాదు... ఔషధం కూడా! ఔషధాన్ని మోతాదు ప్రకారం విధి యుక్తంగా తీసుకోవాలి. ఆయుర్వేద శాస్త్రం ఆవు పాలు, గేదె పాలు, ఇంకా ఇతర జంతువుల పాలకు వేర్వేరుగా వేటి గుణాలను వాటికి వివరించింది. పాలన్నీ తెల్లగానే ఉంటాయి. అలాగని అన్నీ ఒకే గుణం కలిగిన పాలు కావు.

ఆవు పాలతో ‘వాసాధిక’...

ఆవు పాలతో ఆరోగ్యదాయకంగా ‘వాసాధిక’ పానీయం ఎలా తయారు చేసుకోవాలో ‘క్షేమ కుతూహలం’ గ్రంథంలో క్షేమశర్మ వివరించాడు...

అనేక దూడలను పెట్టిన ఆవు పాలు శ్రేష్ఠం. పాలకు సమానంగా నీళ్లు కలపాలి. ఆవు పిడకల మీద దాలిగుంటలో ఈ పాల కుండను ఉంచి, సగం వరకూ ఆవిరయ్యేదాకా మరిగించండి. చల్లారిన తరువాత ఆ పాలలో తగినంత పంచదార, చిటికెడంత పచ్చకర్పూరం కలిపి, మంచి వస్త్రం తీసుకుని, అందులో ఈ పాలను వేరే పాత్రలోకి వడగట్టండి. ఇదే ’గవ్య వాసాధిక‘ అనే పానీయం. ఇది అమృతాన్ని విగతతరం చేస్తుందన్నాడు. అంటే ఓడిస్తుందన్నమాట.


గేదె పాలతో...

‘పాత్రే నవ్యతరె సుధూప విహితే భృజంతితే మానవా’... ఒక వేళ గేదే పాలే దొరికాయనుకోండి... ఈ పాలను కూడా ఇందాక చెప్పిన పద్ధతిలోనే సగం మరిగేంతసేపు కాచి, చల్లార్చండి. అందులో తీపితో పాటు, మీరు కోరుకున్న పరిమళ ద్రవ్యాలు కలిపి, ఓ కొత్త పాత్రలోకి వడగట్టండి. ఇది ‘మాహి ష వాసాధిక’ అనే పానీయం. శాస్త్ర గ్రంథాలెప్పుడూ సూచన ప్రాయంగా వివరిస్తాయి. వాటిని మన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా, మన అవసరాలకు తగ్గట్టుగా అన్వయించుకోవాలి. కాలానుగతంగా వ్యాఖ్యాతలు నవీన యుగాలకు అనుగుణంగా ప్రాచీన గ్రంథాలకు వ్యాఖ్యానాలు రాస్తారు.

ప్యాకెట్టు పాలతో

ఇవాళ ప్యాకెట్‌ పాలు కొనుక్కోవటమే తప్ప స్వచ్ఛమైన పాలు జనసామాన్యానికి దొరికే అవకాశం తక్కువైపోయింది. ఆ పాలు వాడుకునేవారు రెండో పద్ధతిలో వాసాధిక పానీయం తయారు చేసుకోండి. ఇందులో కలిపే పరిమళాలను మన ఇష్టానికి వదిలేశాడు క్షేమశర్మ. మన శరీర పరిస్థితులను బట్టి కావాల్సిన పరిమళ ద్రవ్యాల్ని ఎంచుకోవాలని తాత్పర్యం.

ఎవరికి ఏ పరిమళం..?

వాత శరీర తత్త్వం కలిగినవారు, వాత వ్యాధులతో బాధపడేవారు పాలకు అంతే మొత్తం నీళ్లు కలిపి, సగం మిగిలేలా మరిగించాలి. చక్కెర, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం (చిటికెడు) వేసి మిక్సీ పట్టాలి. పావు చెంచా పొడిని ఒక కప్పు పాలలో కలిపి, రాత్రి పడుకోబోయే ముందు తాగితే మంచి నిద్ర పడుతుంది. వాతం ఉపశమిస్తుంది. శరీరానికి మృదుత్వం కలుగుతుంది. మరాఠీ మొగ్గలను కూడా కలపవచ్చు.

పైత్య వ్యాధులతో బాధపడేవారు, వేడి ఎక్కువగా ఉన్నవారు ఈ పాలలో చక్కెరతోపాటు యాలకుల పొడి, పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి లాంటి చలవనిచ్చే పరిమళ ద్రవ్యాలను కలుపుకోవాలి. కఫ వ్యాధులతో బాధపడేవారు పసుపు, మిరియాలు లవంగాలు, యాలకుల్లాంటివి కలుపుకోవచ్చు. ఆ విధంగా శరీర తత్వాన్ని, ఆరోగ్య స్థితిని బట్టి పరిమళ ద్రవ్యాలను ఎంచుకోవాలి. ఐదు గ్రాముల జాజికాయ, ఐదు గ్రాముల జాపత్రి, రెండు గ్రాముల పచ్చకర్పూరం... ఈ కొలతలతో తయారు చేసిన మిశ్రమం అన్ని వ్యాధులకూ ఔషధంగా పని చేస్తుంది. పచ్చకర్పూరం అధికంగా వెయ్యకూడదు. జలుబు చేస్తుంది. పరిమితంగా వాడితే చాలు పరిమళ భరితంగా ఉంటుంది. పచ్చకర్పూరం కలవగానే దేవుడి ప్రసాదం, పవిత్ర ఆహారం అనే భావనలు కలుగుతాయి. అదొక్కటే వేయి ఓషధుల పెట్టు.

-గంగరాజు అరుణాదేవి

Updated Date - Jul 27 , 2024 | 05:51 AM