Share News

Navya : సాధనతోనే నియంత్రణ సాధ్యం

ABN , Publish Date - Jul 12 , 2024 | 12:41 AM

మన గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును నిర్ణయించేది... మన ఆలోచనలే. ఈ ఆలోచనల్లోని వైరుధ్యాలే ప్రేమ, ద్వేషం, ఘర్షణ తదితర భావోద్వేగాలకు కారణం.

Navya : సాధనతోనే నియంత్రణ సాధ్యం

చింతన

మన గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును నిర్ణయించేది... మన ఆలోచనలే. ఈ ఆలోచనల్లోని వైరుధ్యాలే ప్రేమ, ద్వేషం, ఘర్షణ తదితర భావోద్వేగాలకు కారణం. మానవుడు తనను తాను తెలుసుకోవడానికి ఎంతో కృషి చేస్తాడు. చివరకు.... ‘నా ఆలోచనల సమగ్ర స్వరూపమే నేను’ అని తెలుసుకుంటాడు. ఆత్మజ్ఞానం పొందడం అంటే... మనిషి తన ఆలోచనల విస్తృత స్వరూపాన్ని అర్థం చేసుకోవడమే. ఆలోచనల పుట్టుక, వాటి స్వభావం, వాటి పరిణామక్రమమే మానవుడి సమగ్ర వ్యక్తిత్వం.

తమతమ ఆలోచనా సరళి కారణంగానే వ్యక్తిగతమైన భేదాలు ఏర్పడతాయి. విభిన్న అభిప్రాయాలకు, భావనా వైరుధ్యాలకు మూలకారణం... వారివారి ఆలోచనా విధానం వేరువేరుగా ఉండడమే. ఎవరైతే తమ ఆలోచనా విధానాన్ని సమగ్రంగా పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ ముందుకు సాగుతారో... వారు తమ జీవన ప్రయాణాన్ని స్ఫూర్తిమంతంగా కొనసాగిస్తారు.

మనస్సులో పుట్టిన ఒక భావన... ఒక ఆలోచనగా రూపొందుతుంది. దరిమిలా కుప్పలు తెప్పలుగా ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఇవన్నీ మూల భావన తాలూకు అస్థిత్వ ప్రతిరూపాలే. ఇలా అసంఖ్యాకంగా పుట్టుకొస్తున్న ఆలోచనల్లో కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి ఉంటాయి. ఇక్కడ మంచి, చెడు అనే విషయంలో ఏ ఇద్దరి ఆలోచనా విధానం ఒకలా ఉండదు.

కాబట్టి దేశకాలమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని... ఏ ఆలోచనైతే సామాజికంగా సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందో, ఎక్కువమంది ఆమోదాన్ని పొందుతుందో అదే మంచిదని భావించవచ్చు. అలాకాకుండా ఆ అభివృద్ధికి ఆటంకం కలిగించే ఆలోచనలను చెడ్డవిగా పరిగణించవచ్చు. ఇక... వ్యక్తిగత స్థాయిలో... ఏ ఆలోచన ఒక వ్యక్తి శారీరక, మానసిక, సామాజిక సమగ్ర వికాసానికి ఉపయోగపడుతుందో అది మంచి ఆలోచన అనీ, ఆ వికాసానికి హాని కలిగించేది చెడ్డ ఆలోచన అనీ విశ్లేషించవచ్చు.

ఈ మంచి చెడు ఆలోచనల పరంపర మన మనస్సును చుట్టుముట్టినప్పుడు... మనం ఎక్కువగా ఏ విధమైన ఆలోచనలు చేస్తామో... వాటికి మూలమైన భావన బలపడుతుంది. అలా బలపడిన భావన తాలూకు తదుపరి రూపం... కార్యాచరణ. మంచి ఆలోచనలతో మంచి పనులు, చెడు ఆలోచనలతో చెడ్డ పనులు చేస్తాం. మన మనస్సును ఎలా నియంత్రించుకోవాలనేదే అసలు సమస్య.నిజానికి మనస్సును నియంత్రించుకోలేం. మన మనస్సులో ఒక భావన మొలకెత్తగానే... దానికి సంబంధించిన ఆలోచనలు ప్రారంభమవుతాయి. ప్రారంభ దశలోనే ఆ భావన మంచిదా, చెడ్డదా, ప్రయోజనకరమైనదా, కాదా అనేది బుద్ధితో గ్రహించాలి. దానికి అనుగుణంగా ఆలోచనలను నియంత్రించుకోవాలి.


ఒకదాని వెనుక ఒకటిగా వస్తున్న ఆలోచనలను... మన బుద్ధిద్వారా క్రమబద్ధీకరించుకోవాలి. ఆ ఆలోచనలు మనకుగాని, సమాజానికి గాని ప్రయోజనకరమైనవి కానప్పుడు... బుద్ధి ద్వారా ఆ సంగతి గ్రహించి... అలాంటి ఆలోచలను ఆపెయ్యాలి. లేకపోతే అవి మనలో స్థిరపడతాయి. చెడ్డ పనులకు ప్రోత్సహిస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు వడబోసుకుంటూ ఉంటే... కొంతకాలానికి మనస్సులో చెడు భావనలు తగ్గుతాయి.

ఒకవేళ అలాంటి భావనలు కలిగినా... మన మనస్సు వాటితో నిండిపోకుండా బుద్ధి అడ్డుకుంటుంది. క్రమంగా మన మనస్సు మంచి భావనలతో... తద్వారా మంచి ఆలోచనలతో నిండి ఉంటుంది. నిండు పాత్రలో... కొత్త వాటికి చోటు ఉండదు కదా! అలాగే మనస్సు పూర్తిగా మంచి భావనలతో, మంచి ఆలోచనలతో నిండి మనల్ని ఉన్నత స్థితివైపు మరలిస్తుంది.

మనస్సును అదుపు చెయ్యడం కష్టం. కానీ, మనస్సులోని ఆలోచనను గమనిస్తూ... బుద్ధిద్వారా నియంత్రించుకోవడం కష్టం కాదు. సాధన ద్వారా ఇది సాధ్యమవుతుంది. మంచి ఆలోచనలతో నిండిన మనస్సు... వెంటనే కార్యాచరణకు ప్రేరేపిస్తుంది. మంచి పనులు చేయడం మొదలుపెడతాం. తద్వారా కలిగే సంతృప్తి... మనస్సులో మంచి భావనలు మొలకెత్తడానికి ఎరువులా ఉపయోగపడతాయి. మరిన్ని మంచి పనులు చేసే సమర్థతను మనలో కలిగిస్తాయి. సాధనతో దీన్ని సాధించవచ్చు.

- డాక్టర్‌ డి.వి.రఘునాథ్‌

Updated Date - Jul 12 , 2024 | 12:41 AM