Share News

Navya : సిద్ధి పొందాలంటే...

ABN , Publish Date - Aug 23 , 2024 | 05:20 AM

సిద్ధ సంప్రదాయం గురించి తెలుసుకోవాలంటే ‘సిద్ధి’ అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. అందుకోసం సాధన చేయాలి. గురువు నుంచి ఉపదేశ దీక్ష, మార్గదర్శకత్వం పొంది, యోగ మార్గంలో తీవ్ర సాధన చేసి...

Navya : సిద్ధి పొందాలంటే...

చింతన

సిద్ధ సంప్రదాయం గురించి తెలుసుకోవాలంటే ‘సిద్ధి’ అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. అందుకోసం సాధన చేయాలి. గురువు నుంచి ఉపదేశ దీక్ష, మార్గదర్శకత్వం పొంది, యోగ మార్గంలో తీవ్ర సాధన చేసి... సాధకుడు తనలోని అరిషడ్వర్గాలను జయించాలి. ఆత్మ సాక్షాత్కారం పొందాలి. అదే ‘సిద్ధ స్థితి’ లేదా ‘సిద్ధ అవస్థ’,

యోగికి ఆత్మసాక్షాత్కారం కలిగినప్పుడు... పూర్వకర్మలు, వాటి ప్రతిఫలాలు, అహం, ఆత్మ, జ్ఞానం, మాయ, సర్వేంద్రియాలు, ఇంద్రియ శక్తులు, మనస్సు తదితరాలన్నీ అతనిలోనే అంతర్గతంగా ఉన్న బ్రహ్మతత్త్వంలో లీనమవుతాయి. ఆ విధంగా సిద్ధావస్థకు చేరుకున్న యోగి బాహ్య స్పృహ కోల్పోతాడు. పరమాత్మలో లీనమవుతాడు.

నిర్మల, నిర్గుణ, నిరామయ, నిత్య వర్తమాన స్థితిలో ప్రకాశిస్తూ ఉంటాడు. సృష్టిలోని జీవ పరిణామ క్రమంలో 84 లక్షల జీవరాశుల మీదుగా (తరు, శిల జన్మలు మొదలుకొని గోవు, మానవ జన్మల వరకూ) సాగే ప్రయాణంలో సర్వోన్నతమైన మానవ జన్మ నుంచి ఆత్మ సాక్షాత్కారం ద్వారా పరమేశ్వరునిలో లీనం కావడం అనేది సృష్టి తాలూకు నియమిత గమ్యం. సిద్ధపరంపరకు ఆది పురుషుడు పరమశివుడు.

ఆ తరువాత కార్తికేయుడు, అగస్త్యముని మొదలుగా సిద్ధ సంప్రదాయంలో లోక కల్యాణార్థం ఎందరో మహాత్ములు తేజోమయ స్థితిలో విరాజిల్లుతున్నారు. దత్త తత్త్వంలో శివతత్త్వం అంతర్భాగం కాబట్టి ఆదిగురువైన పరంజ్యోతి దత్తప్రభువు... సిద్ధ సంప్రదాయానికి పరమావధి.


సిద్ధ స్థితిలో ఉన్న వ్యక్తిలో స్వతఃసంకల్పం, వ్యక్తిత్వం అనేవి శూన్యమవుతాయి. అతడు జీవన్ముక్తావస్థలో నిలిచి ఉంటాడు. పరమేశ్వరుడి సంకల్పం, దివ్య లీల లోక కల్యాణార్ధం ఆ సిద్ధుని ద్వారా ప్రకటితమవుతాయి. యోగమార్గంలో తపిస్తున్న యోగ్యులైన సాధకులకు పరమేశ్వర సంకల్పానుసారం సిద్ధ యోగులు భావతరంగాల మాధ్యమంలో సంకేత, సంబోధనలద్వారా... కొన్ని సమయాల్లో స్వప్న సాక్షాత్కారం, సూక్ష్మ శరీర మాధ్యమం ద్వారా ప్రత్యక్ష, పరోక్ష మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. దత్త ప్రభువుల లీలా విలాసంలో భాగంగా... 60 వేలమంది సిద్ధ యోగులు నిరంతరం ఈ విశాల విశ్వంలో కొలువై ఉంటారు.

వారిద్వారా దత్తప్రభువు ఈ సృష్టిని పరిపాలిస్తూ ఉంటాడు. సమున్నత హిమాలయ ప్రాంతాల్లో... మామూలు కళ్ళకు కనిపించని నిగూఢమైన, అవాగ్మానస గోచరమైన దివ్య సిద్ధ ఆశ్రమాలలో వందలాది, వేలాది సంవత్సరాలకు పైబడిన సిద్ధులు ఎందరో నివసిస్తున్నారు. వారి సంకల్పం, అనుగ్రహం ఉన్న సాధకులకు, జిజ్ఞాసులకు, అన్వేషకులకు సిద్ధాశ్రమ దర్శనానికి, ప్రవేశానికి అవకాశం కలుగుతుంది. తద్వారా ఆధ్యాత్మిక పరిణతి, పురోగతి సాధ్యమవుతుంది.

వివిధ కాలమాన పరిస్థితులలో మానవాళికి సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు... దత్త సంకల్పం ద్వారా కొంతమంది సిద్ధ పురుషులు మానవ జన్మ (కారణ జన్మ) ద్వారా... మానవాళికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేస్తారు. యోగమార్గాన్ని సరళం చేసి... కొన్ని తరాలవారికి జీవన అభ్యున్నతిని, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తారు. అనంతరం తమ కారణ జన్మలను చాలించి సిద్ధాశ్రమానికి మరలి వెళ్తారు. రామకృష్ణ పరమహంస, వివేకానంద, యోగానంద లాంటి సిద్ధ పురుషులు ఇందుకు ఉదాహరణలు.

- దేవరకొండ శ్రీకాంత్‌

Updated Date - Aug 23 , 2024 | 05:20 AM