Share News

Navya : ఎన్నెన్ని వర్ణాలో..

ABN , Publish Date - Jul 16 , 2024 | 01:03 AM

కూరగాయలను వాటి వాటి రంగులను బట్టి వర్గీకరించవచ్చు. ఒక్కో రంగు వర్గానికి చెందిన కూరగాయలు నిర్దిష్టమైన ఆరోగ్యప్రయోజనాలకు కలిగి ఉంటాయి.

Navya : ఎన్నెన్ని వర్ణాలో..

కూరగాయలను వాటి వాటి రంగులను బట్టి వర్గీకరించవచ్చు. ఒక్కో రంగు వర్గానికి చెందిన కూరగాయలు నిర్దిష్టమైన ఆరోగ్యప్రయోజనాలకు కలిగి ఉంటాయి. వాటి గురించి అవగాహన ఏర్పరుచుకుంటే ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలను అవసరాన్ని బట్టి ఎంచుకోవచ్చు. రంగుల ఆధారంగా కూరగాయలను ఎలా వర్గీకరించుకోవచ్చో చూద్దాం.

తెలుపు

ఈ రంగు కూరగాయలు శరీరానికి వ్యాధినిరోధకశక్తిని అందిస్తాయి. తెల్లచిక్కుళ్లు, బంగాళాదుంపలు, ముల్లంగి, కాలిఫ్లవర్‌, పుట్టగొడుగులు ఈ కోవలోకి వస్తాయి. తెల్ల చిక్కుళ్లు, బంగాళాదుంపలు రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రిస్తాయి. పుట్టగొడుగుల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎక్కువ. కాలిఫ్లవర్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గర్భిణిలు, ఇతర మహిళలకు వీటి అవసరం ఎక్కువ.

ఆకుపచ్చ

ఈ రంగుతో కూడిన కూరగాయలు శరీరం నుంచి విషాలను బయటకు వెళ్లగొట్టడానికి తోడ్పడతాయి. బఠాణీ, చిక్కుళ్లు, పాలకూర, క్యాప్సికం, కివి..ఇలా ఆకుపచ్చ రంగులో ఉన్న కూరగాయలన్నిటికీ ఈ గుణం ఉంటుంది. శరీర జీవక్రియలకు అవసరమైన పోషకాలతోపాటు, శక్తిని అందించే పోషకాలు, శరీరం నుంచి విషాలను హరించి, బయటకు వెళ్లగొట్టే తత్వం ఆకుపచ్చ రంగు కూరగాయలకు ఉంటుంది.

పసుపుపచ్చ

ఇవి సౌందర్యపోషణకు అవసరం. అరటి, పసుపుపచ్చని క్యాప్సికం, మొక్కజొన్నల్లో ఉండే కెరోటినాయిడ్లు, బైఫ్లేవనాయిడ్లు- చర్మం,ఎముకలు, దంతాలకు మేలు చేస్తాయి.

నారింజ

ఈ రంగులో పండే నారింజ, క్యారెట్లలో కేన్సర్‌ నుంచి రక్షణ కల్గించే పోషకాలు ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేయడంతోపాటు కళ్లకు ఆరోగ్యాన్ని అందించి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

ఎరుపు

టమాటో, ఎరుపు క్యాప్సికం, పండుమిరప, చెర్రీ, యాపిల్స్‌, దానిమ్మ మొదలైనవన్నీ ఈ కోవకు చెందినవి. ఈ పళ్లు, కూరగాయలన్నీ గుండెకు మేలు చేసేవే!

వంకాయ రంగు

ఈ రంగులో మనకు వంకాయలు పండుతాయి. ద్రాక్ష, బ్లాక్‌ బెర్రీ పళ్లు దొరుకుతాయి. ఇవన్నీ పొట్టలో అల్సరను తగ్గిస్తాయి. కేన్సర్‌ వృద్ధికి అడ్డుకట్టవేసి, మూత్రనాళ ఇన్ఫెక్షన్లనుంచి రక్షణ కల్గిస్తాయి.


  • రంగుల్లో పోషకాలు

ఎరుపు

ఈ రంగు కూరగాయలు, పళ్లలో లైకోపీన్‌, ఎల్లాజిక్‌ ఆమ్లం, క్వెర్సిటిన్‌, హెస్గరిడిన్‌ మొదలైన పోషకాలు ఉంటాయి. ఇవి ప్రోస్టేట్‌ కేన్సర్‌ నుంచి రక్షణ కలిఁంచడంతోపాటు, కణితి పెరుగుదలను నియంత్రించి, చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తాయి. కీళ్ల మధ్య ఉండే మృదులాస్థిని ఆరోగ్యంగా ఉంచుతాయి.

నారింజ, పసుపుపచ్చ

ఈ రంగు కూరగాయలు, పళ్లలో - జీగ్జాంథిన్‌, బీటాకెరోటిన్‌, పొటాషియం, లైకోపీన్‌, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు వయసు పైబడే క్రమంలో వేధించే ప్రొస్టేట్‌ కేన్సర్‌, అధిక రక్తపోటు, కీళ్ల అరుగుదలను నియంత్రిస్తాయి. శరీరంలో ఆమ్ల స్థాయిని సరిచేసి, ఎముకల దారుఢ్యానికి అవసరమైన క్యాల్షియం, పొటాషియంలను శరీరం సక్రమంగా శోషించుకునేందుకు తోడ్పడతాయి.

ఆకుపచ్చ

ఈ రంగు కూరగాయలు పళ్లలో పత్రహరితం, పీచు, ల్యూటిన్‌, క్యాల్షియం, ఫోలేట్‌, విటమిన్‌ సి, బీటా కెరోటిన్‌ ఎక్కువగా ఉంటాయి. జీర్ణప్రక్రియ మెరుగుపరిచి, దృష్టిలోపాలు తలెత్తకుండా, ఫ్రీర్యాడికల్స్‌ శరీరం మీద దాడి చేయకుండా చేస్తాయి.

నీలం, వంకాయ

ఈ రంగుల్లోని కూరగాయలు, పళ్లలో ల్యూటిన్‌, క్సియాంథిన్‌, రెస్వెరెట్రాల్‌, విటమిన్‌ సి, పీచు, ఫ్లేవనాయిడ్లు, ఎల్లార్జిక్‌ యాసిడ్‌, క్వెర్సెటిన్‌ అనే పోషకాలు ఎక్కువ. ఇవి కంటి చూపు మెరుగుకు ఉపయోగపడతాయి. వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. జీర్ణప్రక్రియ మెరుగు పరచడంతోపాటు కేన్సర్‌ కణాల పుట్టుకను అడ్డుకుంటాయి.

తెలుపు

వీటిలో బీటాగ్లూకాన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. పెద్దపేగు, రొమ్ము, ప్రొస్టేట్‌ కేన్సర్లు తలెత్తకుండా చేస్తాయి. హార్మోన్‌ వ్యవస్థను బలోపేతం చేసి, సంబంధిత రుగ్మతలు దరి చేరకుండా అడ్డుపడతాయి.

ఇవే అవి...

అత్యధిక ఆరోగ్యపరమైన పోషకాలు కలిగి ఉండే వివిధ రంగుల్లోని పళ్లు, కూరగాయలు ఇవే...

ఆకుపచ్చ: అవకాడొ, బ్రకొలి, చైనీస్‌ క్యాబేజి, ఆకుపచ్చ యాపిల్స్‌ పియర్స్‌, కివి.

తెలుపు: తెల్ల మొక్కజొన్న, టర్నిప్‌, తెల్ల పీచ్‌ పళ్లు.

ఎరుపు: బీట్రూట్‌, ఎర్రని జామ, పంపరపనస, ఎర్రని ద్రాక్ష, స్ట్రాబెర్రీ.

పసుపు: గోల్డెన్‌ కివి, నిమ్మ, మామిడి, పైనాపిల్‌, చిలకడదుంప, అత్తిపళ్లు

నీలం, వంకాయ: బ్లాక్‌ కరెంట్‌, వంకాయలు, ద్రాక్ష, వంకాయ రంగు క్యాబేజీ, ఎండుద్రాక్ష.

Updated Date - Jul 16 , 2024 | 01:04 AM