Share News

MLA Peddireddy: ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై అనర్హత వేటు తప్పదా.. వైసీపీలో ఆందోళన!

ABN , Publish Date - Jul 29 , 2024 | 09:46 AM

వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పదవి పోతుందా..? ఇప్పుడిదే వైసీపీ శ్రేణుల్లో ఆందోళన.. ఎప్పుడేం జరుగుతుందో తెలియక..

MLA Peddireddy: ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై అనర్హత వేటు తప్పదా.. వైసీపీలో ఆందోళన!
Peddireddy Ramachandra Reddy

చిత్తూరు జిల్లా/పుంగనూరు: హైకోర్టులో బుధవారం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై (MLA Peddireddy Ramachandra Reddy) అనర్హత వేటుకు సంబంధించి సింగల్‌ బెంచిలో జస్టిస్‌ వి.శ్రీనివాస్‌ విచారణ చేపట్టడంతో వైసీపీ (YSRCP) శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన శాఖలకు మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా రాయలసీమ, రాష్ట్రంలో అధికారాన్ని శాసించారు. అడ్డు అదుపులేకుండా కనుసైగతో ప్రతిపక్షాలకు చుక్కలు చూపించారు. ఎన్నికలకు వారం రోజుల ముందే జూన్‌ 7వ తేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్‌ అఫిడవిట్‌లో ఆయనతో బాటు వారి సతీమణి పెద్దిరెడ్డి స్వర్ణలత పేర్లతో ఉన్న 142 ఆస్తులను పేర్కొనకుండా దాచారని ఆయనను పోటీకి అనర్హుడిని చేయాలని రామచంద్రయాదవ్‌ రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి, గవర్నర్‌, వివిధ ఉన్నతాధికారులకు ఆధారాలతో ఫిర్యాదులు చేశారు. అయినా, పెద్దిరెడ్డికి ఏ ఆటంకం లేకుండా పోటీ చేసి గెలిచారు.


Peddi-Reddy-Out.jpgఅప్పుడు.. ఇప్పుడు!

ఈ క్రమంలో తాను గెలవకపోయినా పర్వాలేదు.. పెద్దిరెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలని ఈనెల నాలుగోతేది హైకోర్టులో రామచంద్రయాదవ్‌ కేసు దాఖలు చేశారు. హైకోర్టు ఈపీ నెంబరు 3/2024 మేరకు విచారణకు స్వీకరించింది. బుధవారం జడ్జి శ్రీనివాస్‌ విచారించి తర్వాత ఈనెల 30వ తేదికి వాయిదా వేశారు. హైకోర్టు కేసుకు నెంబరు కేటాయించి, స్కూృటిని అధికారిని నియమించడం, విచారణలు వేగవంతం చేయడంతో పెద్దిరెడ్డి ఈకేసులో తప్పించుకోలేరని పలువురు చెబుతున్నారు. గతంలో అధికారం ఉండటంతో తప్పించుకునేవారని, నేడు టీడీపీ కూటమి అధికారంలో ఉండటంతో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, తదితర జిల్లాల్లోని 142 ఆస్తులు వివరాలకు సంబంధించిన రికార్డులు కోర్టుముందు ఉండటంతో పెద్దిరెడ్డి వీరభక్త అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.


supreme court.jpg

నాడు సుప్రీంకోర్టు వరకు..

2014లో ఎన్నికల్లో పుంగనూరు వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. టీడీపీ అభ్యర్థి ఎం.వెంకటరమణరాజుపై గెలుపొందారు. అప్పుడు కూడా ఇదే తరహాలో ఎన్నికల నామినేషన్‌ అఫిడవిట్‌లో పెద్దిరెడ్డి కొన్నిచోట్ల సంతకాలు చేయలేదని, కోట్ల రూపాయల ఆస్తులు వివరాలు చూపలేదని, సరైన పత్రాలు పొందుపరచలేదని, పీఎల్‌ఆర్‌ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న ఆయన భార్య స్వర్ణలతను గృహిణిగా చూపారంటూ టీడీపీ అభ్యర్థి రాజు హైకోర్టును ఆశ్రయించగా ఈపీ నెంబరు 8/2014 కేసు నమోదైంది. 2016 ఆగస్టులో హైకోర్టు జడ్జి దుర్గాప్రసాద్‌ ప్రిలిమనరి ఫీడింగ్‌ సరిగాలేదని కేసును డిస్మిస్‌ చేశారు. 2016 అక్టోబరులో వెంకటరమణరాజు మళ్లీ సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదులు సిద్దార్ధలూద్రా, ఆనంద్‌, కేఎస్‌ మదన్‌ ద్వారా పిటిషన్‌ వేయగా సివిల్‌ అప్పీల్‌ నెంబరు 9466, 9467, 9468 ప్రకారం సుప్రింకోర్టు కేసు విచారణకు స్వీకరించింది.


Peddi-Reddy.jpg

ఎప్పుడేం జరుగునో..?

సుప్రీంకోర్టులో ఈ కేసుపై 18 మార్లు వాదోపవాదాలు జరిగి తుదితీర్పు రిజర్వులో ఉంచింది. తర్వాత వెంకటరమణరాజును తొలగించి ఆస్థానంలో అనీషారెడ్డిని టీడీపీ ఇన్‌చార్జిగా నియమించడం, వివిధ కారణాలతో ఆయన కేసుపై ఆసక్తి చూపకపోవడంతో పెద్దిరెడ్డి అనర్హత వేటు కేసు మూతపడింది. తర్వాత ఈ ఎన్నికల్లో మళ్లీ రామచంద్రయాదవ్‌ హైకోర్టులో కేసు వేశారు. పెద్దిరెడ్డి తర్వాత అత్యధిక ఓట్లు వచ్చిన టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిని కూడా ఈ కేసులో భాగస్వామిని చేసేలా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఈ కేసులో పిటిషనరుకు అనుకూలంగా తీర్పు వస్తే.. తర్వాత అత్యధిక ఓట్లు సాధించిన టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా కోర్టు ప్రకటించే అవకాశాలున్నాయి.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 29 , 2024 | 08:41 PM