YSRCP: విజయసాయిని నెల్లూరు నుంచి పోటీ చేయించడం వెనుక ఇంత జరిగిందా..!?
ABN , Publish Date - Mar 02 , 2024 | 09:20 PM
AP Elections 2024: విజయసాయిరెడ్డి.. వైసీపీలో (YSR Congress) కీలక నేతగా.. పార్టీలో నంబర్-02గా వ్యవహరిస్తూ వస్తున్నారు.! రెండోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు.! ఇలా సాయిరెడ్డి (Vijayasai Reddy).. జగన్ (YS Jagan Reddy) బాగు కోరుతుంటే.. జగన్ మాత్రం విజయసాయిని బలి పశువున చేశారనే ఆరోపణలు సొంత పార్టీ నుంచి వెల్లువెత్తుతున్న పరిస్థితి...
విజయసాయిరెడ్డి.. వైసీపీలో (YSR Congress) కీలక నేతగా.. పార్టీలో నంబర్-02గా వ్యవహరిస్తూ వస్తున్నారు.! రెండోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు.! ఇలా సాయిరెడ్డి (Vijayasai Reddy).. జగన్ (YS Jagan Reddy) బాగు కోరుతుంటే.. జగన్ మాత్రం విజయసాయిని బలి పశువున చేశారనే ఆరోపణలు సొంత పార్టీ నుంచి వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఇందుకు ఒకే ఒక్క కారణం నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ప్రకటించడమే. పార్టీ శ్రేణులు, పార్టీ పెద్దలు.. కనీసం విజయసాయిరెడ్డి కూడా బహుశా ఇలాంటి ప్రకటన వస్తుందని ఊహించి ఉండకపోవచ్చు. ఒక్కసారిగా పేరు రావడంతో సాయిరెడ్డి కంగుతిన్నారట. ఇంతకీ ఎందుకీ పరిస్థితి వచ్చింది..? సాయిరెడ్డి తన అనుచరులు, ముఖ్య నేతలతో ఏమని చెప్పుకున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
ఇలా జరిగిందేంటో..?
‘పార్టీ కోసం ఏమైనా చేస్తాను కానీ.. ఇస్తే రాజ్యసభ సీటివ్వండి చాలు.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి నన్ను మాత్రం లాగొద్దు మహాప్రభో..’ అని జగన్ వద్ద సాయిరెడ్డి మొరపెట్టుకున్నారట. అయినా సరే.. ఎంపీగా పోటీ చేయాల్సిందే.. అభ్యర్థుల్లేరు అని జగన్ నచ్చజెప్పారట. ఒకానొక సందర్భంలో విజయసాయి అస్సలు ఒప్పుకోనేలేదట. పోటీ చేయాల్సిందేనని పదే పదే చెప్పడంతో ఇక చేసేదేమీ లేక సరేనన్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే అంతా అయిష్టంగానే ఇదంతా జరిగిందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చన్న మాట. అంతటితో ఆగలేదు.. సాయిరెడ్డికి జగన్ పెద్ద బాధ్యతలే కట్టబెట్టడమే కాకుండా ఒకింత వార్నింగ్ కూడా ఇచ్చారట. ఎట్టి పరిస్థితుల్లోనూ నెల్లూరులో క్లీన్ చేయాల్సిందేనని.. ఒక్క సీటు తగ్గినా ఒప్పుకునే ప్రసక్తే లేదని జగన్ చెప్పినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ముఖ్యమంత్రి మాటలకు ఒక్కటంటే ఒక్కసారి కూడా నోరు మెదపకుండానే సాయిరెడ్డి తిన్నగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికొచ్చేశారట. దీంతో అయ్యో.. పాపం.. జగన్నాటకంలో విజయసాయి బలిపశువు కాబోతున్నారనే చర్చ సొంత పార్టీలో నడుస్తోంది.
అయ్యే పనేనా..?
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పేరు తెలియని వారుండరు. ఒక్క రాజకీయాల్లోనే కాదు.. సేవా కార్యక్రమాలు చేయడంలో ఈయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ట్రస్టుల ద్వారా ఎవరు ఎలాంటి సాయం అడిగినా సరే.. కాదనకుండా చేసే మనస్తత్వం. ఇక వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె నిత్యం ప్రజాసేవలోనే మునిగి ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చి మరింత ప్రజాసేవ చేయాలనే తపనతో నాడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీన్ కట్ చేస్తే.. సరిగ్గా ఐదేళ్లు కూడా పార్టీలో ఇమడలేకపోయారు. వైసీపీ పెద్దలు.. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలి నచ్చక.. పార్టీకి రాజీనామా చేసేసిన వేమిరెడ్డి దంపతులు.. శనివారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో వేమిరెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలియవచ్చింది. అంతేకాదు.. ప్రశాంతి రెడ్డి కూడా నెల్లూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే వేమిరెడ్డి వర్సెస్ సాయిరెడ్డిగా పరిస్థితులు నెలకొంటాయి. వేమిరెడ్డికి ఆర్థిక బలం.. అంగ బలం.. వీటన్నింటికీ మించి ప్రజల్లో మంచి గుర్తింపు కూడా ఉంది. ఇక సాయిరెడ్డికి ఏమేం ఉన్నాయో ఆయనకే తెలియాలి మరి.
అబ్బే.. అదేం లేదే..?
అయితే.. వైసీపీ శ్రేణులు మాత్రం సాయిరెడ్డిపై వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని కొట్టి పారేస్తున్నాయి. నెల్లూరులో నలుగురు ఎమ్మెల్యేలు, ఎంపీ వేమిరెడ్డి.. పలువురు ముఖ్యులు పార్టీని వీడిన తర్వాత కాస్త బలహీన పడిందని.. అందుకే ఇక్కడ్నుంచి పార్టీలో పెద్ద తలకాయగా ఉన్న విజయసాయిని బరిలోకి దింపితే అన్ని విధాలుగా కలిసొస్తుందన్నది హైకమాండ్ భావన అని కార్యకర్తలు కొందరు నెట్టింట్లో చర్చించుకుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి.. ఎంపీగా పోటీచేయడంలో సాయిరెడ్డికి ఎలాంటి ఇబ్బందులు లేవని.. ఏరికోరి మరీ జగన్‌ను అడిగి ఆయనే సీటు తెచ్చుకున్నారనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది. ఇందులో నిజమెంతో.. అబద్ధమెంతో మరి. మొత్తానికి చూస్తే.. మునుపటిలా నెల్లూరులో రాజకీయాలు మాత్రం ఉండవన్నది మాత్రం క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. ఫైనల్‌గా ఏం జరుగుతోందో వేచి చూడాల్సిందే మరి.
BJP First List: ఏపీ నుంచి ఒక్క ఎంపీ అభ్యర్థినీ ప్రకటించని బీజేపీ.. ఎందుకో..!?
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి