Share News

సౌందర్యం... శీతలం

ABN , Publish Date - Nov 24 , 2024 | 06:55 AM

కాలాలతో సంబంధం లేకుండా... తారల చర్మం ఎప్పుడూ కాంతిమంతంగా ఎలా ఉంటుంది? ఈ డౌటనుమానం చాలామంది అమ్మాయిలకు సహజంగానే వస్తుంది. ముఖ్యంగా చలికాలంలో చర్మ సమస్యలకు, కేశ సంరక్షణకు వారు పాటించే చిట్కాలేమిటనేది తెలుసుకోవాల్సిందే. కొందరు అందాల భామలు ఇస్తున్న వింటర్‌ టిప్స్‌ ఇవి...

సౌందర్యం... శీతలం

కాలాలతో సంబంధం లేకుండా... తారల చర్మం ఎప్పుడూ కాంతిమంతంగా ఎలా ఉంటుంది? ఈ డౌటనుమానం చాలామంది అమ్మాయిలకు సహజంగానే వస్తుంది. ముఖ్యంగా చలికాలంలో చర్మ సమస్యలకు, కేశ సంరక్షణకు వారు పాటించే చిట్కాలేమిటనేది తెలుసుకోవాల్సిందే. కొందరు అందాల భామలు ఇస్తున్న వింటర్‌ టిప్స్‌ ఇవి...

అందంగా కనిపించేందుకు

శీతాకాలంలో నేను చెప్పే చిట్కా ఏమిటంటే... చర్మం తేమగా ఉండేందుకు మాయిశ్చరైజర్‌ ఉపయోగించాలి. అలాగే మస్కారా, ఐలైనర్‌ వంటివి వాడేటప్పుడు వాటర్‌ప్రూఫ్‌ రకం ఎంచుకుంటే మంచిది. దీంతో చల్లగాలుల వల్ల మేకప్‌ పాడవకుండా ఉంటుంది. దాంతోపాటు విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. పండ్ల రసాలు, కాయగూరల రసాలు, మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల చర్మం తేమ కోల్పోకుండా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

- అలియాభట్‌


షాంపూ బదులుగా...

sun1.2.jpg

ఫోమ్‌ (నురుగ) ఆధారిత ఫేస్‌వాష్‌లు, బాడీవాష్‌లు చలికాలంలో ఉపయోగించడం వల్ల చర్మం మరింత పొడిబారుతుంది. జెంటిల్‌, క్రీమ్‌ తరహా క్లెన్సర్లు వంటివి ఉపయోగిస్తే చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుకోవచ్చు. షాంపూ బదులుగా అప్పుడప్పుడు డ్రై షాంపూతో అంటే శీకాకాయ పొడితో గానీ, కుంకుడుకాయ పొడితో గానీ తలస్నానం చేస్తే శిరోజాలు సహజసిద్ధమైన నూనెలను కోల్పోకుండా ఉంటాయి. తద్వారా కురులు ఆరోగ్యంగా ఉంటాయి. చలికాలంలో జుట్టు ఫ్రీజీగా మారుతుంది. గోరువెచ్చని కొబ్బరినూనెను మాడుకి అప్లై చేసి బాగా మసాజ్‌ చేస్తే చాలు.. జుట్టు నిగనిగలాడుతుంది.

- సారా అలీఖాన్‌


చర్మం పొడిబారితే...

sun1.3.jpg

చలికాలంలో చాలామంది నీరు ఎక్కువగా తీసుకోరు. దీనివల్ల శరీరం డీ హైడ్రేట్‌ అయిపోతుంది. ఫలితంగా చర్మం పొడిబారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి దాహం వేయకున్నా ఎప్పటిలాగే ఈ కాలంలోనూ ప్రతీరోజూ నీరు తాగాల్సిందే. దీనివల్ల శరీరంలోని విషపదార్థాలు సులభంగా బయటికి వెళ్లిపోతాయి. వర్కవుట్స్‌ చేయడం వల్ల ఎండార్ఫిన్‌ అనే హార్మోన్‌ విడుదలవుతుంది. ఇది చర్మం మెరిసేందుకు తోడ్పడుతుంది.

- సోనమ్‌కపూర్‌


ఆ కర్రీమ్ కీలకం

sun1.4.jpg

శీతాకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం నిర్జీవంగా మారుతుంది. అందుకే స్కిన్‌కేర్‌ విషయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తుంటా. ముఖాన్ని శుభ్రం చేసుకున్న వెంటనే రోజ్‌వాటర్‌, గ్లిజరిన్‌ కలిపి తయారుచేసిన మిశ్రమాన్ని టోనర్‌గా ఉపయోగిస్తా. ఆపై యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే సీరమ్‌ని ముఖానికి అప్లై చేసుకుంటా. నా స్కిన్‌కేర్‌ రొటీన్‌లో బ్యారియర్‌ కేర్‌ క్రీమ్‌దే కీలక పాత్ర. ఇది చర్మానికి రక్షణ కవచంలా పనిచేసి, చర్మం పొడిబారకుండా చేస్తుంది. ఆపై ఫేస్‌ ఆయిల్‌ రాసుకుంటా. కనుబొమలు, కనురెప్పల అందానికి ఆముదం, ఆలివ్‌ నూనె ఉపయోగిస్తా. సన్‌స్ర్కీన్‌ లోషన్‌ను కాలంతో సంబంధం లేకుండా మూడు గంటలకోసారి అప్లై చేస్తుంటా.

- కృతీసనన్‌

Updated Date - Nov 24 , 2024 | 06:55 AM