Viral News: దీపావళికి చికెన్ బిర్యానీ.. మనిషివేనా నువ్వసలు.. కస్టమర్ పై డెలివరీ బాయ్ చిందులు
ABN , Publish Date - Nov 01 , 2024 | 03:10 PM
చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టిన ఓ వ్యక్తిపై డెలివరీ బాయ్ మండిపడ్డాడు. పండగ పూట చికెన్ తినడం ఏంటని గొడవకు దిగాడు.
ఢిల్లీ: దీపావళి రోజు ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ఓటీపీ చెప్పి పార్సిల్ తీసుకున్న వెంటనే డెలివరీ బాయ్ ప్రవర్తన అతడిని అవాక్కయ్యేలా చేసింది. మీరు చేస్తున్నది తప్పు భయ్యా అంటూ డెలివరీ బాయ్ అనడంతో అతడి ముఖానికేసి షాక్ తో చూశాడు. ఏంటి తప్పు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడమా?.. అనడిగితే.. కాదు కాదు దీపావళి రోజు ఎవరైనా చికెన్ తింటారా? అంటూ ఎదురు ప్రశ్నించాడు. అతడు వేసిన ప్రశ్నకు ఏం చెప్పాలో తెలీక నిర్ఘాంతపోయానని ఢిల్లీకి చెందిన సదరు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ కస్టమర్ వాపోయాడు. ఈ పండగ రోజులు ఎంతో పవిత్రమైనవని తాము నమ్ముతామని.. తమ మత సంప్రదాయం ప్రకారం అలాంటి రోజుల్లో నాన్ వెజ్ తినడం చాలా తప్పని లెక్చర్ ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా ఇలా చేయడం ఎంత పెద్ద పాపమో వివరించి వెళ్లాడు. తనకు ఎదురైన అనుభవాన్ని అతడు సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ గా మారింది.
ఇలాంటి ప్రవర్తన మితిమీరితే చాలా నష్టం. అతడిపై కంప్లైంట్ చేయండి. ఇంకోసారి మీ పరిసరాల్లోకి డెలివరీ చేయకుండా జాగ్రత్త పడండి అంటూ నెటిజన్లు అతడి పోస్ట్ పై స్పందిస్తున్నారు. అతడి నమ్మకాన్ని మీపై రుద్దాల్సిన అవసరం లేదు. దానికి బదులు పండగ పూట చికెన్ డెలివరీ చేయకుండా ఉండమని అతణ్నే అడగండి అని మరో వ్యక్తి స్పందించాడు.
స్వామి వివేకానంద కూడా మాంసం తినకుండా బ్రాహ్మణుడు కాలేడని చెప్పారు. అలాంటిది ఈ సోషల్ మీడియా మూర్ఖుల వల్ల ప్రతి ఒక్కరికీ ప్రాబ్లం అవుతోంది అని ఓ నెటిజన్ మండిపడ్డాడు. ఈ విషయంలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి చాలా మంది తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.