Share News

చిరుమిళ్ళనే చిరుతిళ్ళు

ABN , Publish Date - Oct 27 , 2024 | 10:26 AM

‘‘... వడ లామువడ లొబ్బట్లు సారసత్తులు సేవలుఁ జిరిమిళ్లు సరడాలుఁ బరిడగవ్వలు. జాపట్లు...’’ అయ్యలరాజు నారాయణామాత్యుడు హంసవింశతి కావ్యంలో విష్ణుదాసు తన పరివారంతో అనేక వంటకాలను బళ్లకెత్తుకుని దూరప్రయాణానికి బయల్దేరినట్టు వివరిం చాడు. వాటిలో 100కి పైగా వంటకాలున్నాయి. ‘‘వడ లావడవడ లొబ్బట్లు చిరిమిళ్లు సరడాలు బండగవ్వలు జాపట్టు’’ లంటూ జైమిని భార తంలో పినవీరభద్రుడిని అనుసరించి హంస వింశతిలో ఈ పట్టిక రాసినట్టు కనిపిస్తోంది!

చిరుమిళ్ళనే చిరుతిళ్ళు

‘‘... వడ లామువడ లొబ్బట్లు సారసత్తులు సేవలుఁ జిరిమిళ్లు సరడాలుఁ బరిడగవ్వలు. జాపట్లు...’’

అయ్యలరాజు నారాయణామాత్యుడు హంసవింశతి కావ్యంలో విష్ణుదాసు తన పరివారంతో అనేక వంటకాలను బళ్లకెత్తుకుని దూరప్రయాణానికి బయల్దేరినట్టు వివరిం చాడు. వాటిలో 100కి పైగా వంటకాలున్నాయి. ‘‘వడ లావడవడ లొబ్బట్లు చిరిమిళ్లు సరడాలు బండగవ్వలు జాపట్టు’’ లంటూ జైమిని భార తంలో పినవీరభద్రుడిని అనుసరించి హంస వింశతిలో ఈ పట్టిక రాసినట్టు కనిపిస్తోంది!

వీటిలో సగానికి పైగా వంటకాల పేర్లు మనం మరిచిపోయినవే!


కొన్నింటిని పరిశీలిద్దాం ...

- వడలు: గారెలు. పితృకార్యాల్లో తప్పకుండా గారెలు వండటం పూర్వాచారం. కాబట్టి, శుభకార్యాల్లో వీటిని వడ్డించరు. అందుకని ఉల్లి, మిర్చి, శనగపప్పు మిరియాలు వగైరా కలిపి, చిల్లు లేకుండా వండి, ‘వడ’ అన్నారు.

- ఆమువడ: ‘ఆము’ అంటే మూయటం, నిండా కప్పి ఉంచటం అని. ఆవపిండి కలిపి తాలింపు పెట్టిన పెరుగుతో ‘ఆము’ చేసినవి (కప్పి ఉంచినవి) ఆమువడలు. దీన్నే ఆమవడలని తమిళులు, ఆవడలు అని మనమూ పిలుస్తున్నాం.

- ఒబ్బట్లు: బొబ్బట్లు, ‘‘ఒరగుజ్జు గోధుమ ఒబ్బట్లు’’ అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో హోలిగలని పిలుస్తారు.


- సారసత్తులు: జంతికలు, సారెపెట్టేప్పుడు ఆడపడుచుకు ఒడిలో పెట్టి పంపే పిండివంట కాశీఖండంలో రాశీభూతమైన అనేక వంటకాల్లో ‘‘....పోవెలు, సేవియలు, సారెసత్తులు. జొత్తరలు. జక్కిలాలు’’ కూడా ఉన్నాయి. వీటిలో సా(ర)రెసత్తులు జంతికలే!

- సేవ: సేవె లనంగను సేవికల్‌ విలసిల్లు’’ అని అచ్చతెలుగు కోశం పేర్కొంది. సేవ/సేవె అంటే సేవిక అని! సేవిక అంటే ఏమిటీ? శ్రీనాథుడు శృంగార నైషధంలో ‘‘గోధుమ సేవికా గుచ్చంబు లల్లార్చి ఖండ శర్మరలలో గలపి కలపి-’’ అని ఒక వర్ణన చేశాడు. గోధుమలతో చేసిన సేమ్యా గుత్తుల్ని నేతితో వేయించి, పంచదార పాకంలో వేసి సేవికలను తయారుచేశారట! గోధుమపిండితోసేమ్యాలాగా సన్నగా పొడవైన వత్తుల్ని చేసి, వాటినిపాలలో వేసి ఉడికించిన సేమ్యాపాయసాన్ని ‘సేవికా’ అని భావప్రకాశ వైద్యగ్రంథం పేర్కొంది. శ్రీనాథుడిది తెలుగు వారి సేవిక. సేమ్వాని లేదా సన్నకారప్పూసను చిన్నవిగా నలిపి, నేతితో వేయించి పంచదార పాకం పట్టి లడ్డూ కడితే, వాటిని ‘సేవికామోదకాలు’ అన్నారు.


- చిరిమిడి: చిరుతిండి లాంటిదే చిరిమిడి. శ్నాక్స్‌ అనే ఆంగ్ల పదానికి చిరిమిడి సమానార్థకం. మధ్యాహ్న భోజనానికి, రాత్రి భోజనానికి మధ్యన తీసుకునే ఆహారాన్ని శ్నాక్స్‌ అంటారు. ఇడి అంటే పిండి. చిరిమిడి అంటే శ్నాక్స్‌ లాగా తీసుకునే పిండివంట. పకోడీలు, బజ్జీలు, పునుగుల్లాంటివి కావచ్చు.

- సరడాలు: ఒకరకం వంకీల గొలుసుకు సరడాలనే (శరణ్డః) పేరుంది. మరుగుతున్న పాలలో బియ్యపిండిని వంకీల నెక్లెస్‌ లాగావత్తి వండిన ‘పాలతాలికలు’ లాంటి వంటకాన్ని శ్రీనాథుడు సరడాల పాశెం అన్నాడు. అక్కుళ్లుతో వండిన పాయసాన్ని అన్నమయ్య అక్కాలపాశం అనీ, సేమియాతో చేసిన పాయసాన్ని శ్రీనాథుడు సేవెపాయసం అనీ అన్నారు. ఇది సరడాలపాసెం. శ్రీనాథుడికన్నా 300 యేళ్ల తరువాతి వాడయిన నారాయణామాత్యుడి హంసవింశతి కాలానికి దీన్నే సరడాలు అనే వాళ్లేమో!


- బరిడగవ్వలు: బరిడ/బరిడె అంటే, ముత్యపు చిప్ప ఆకారంలో చేసిన పెద్ద గవ్వలు. వెన్నతో గోధుమపిండిని పిసికి, చిన్న ఉండ తీసుకుని, బొటనవేలితో నొక్కుతూ చూపుడు వేలితో ఆ పిండిని గవ్వల ఆకారంలో చేసి, నూనెలో వేగించినవి బరిడగవ్వలు. పిల్లలమర్రి పినవీరభద్రుడి కాలంలో బండ గవ్వలుగా పిలవబడి నారాయణామాత్యుడి కాలానికి బరిడె గవ్వలుగా మారాయి.

- చాపట్లు: 5/4 అడుగులున్న పెద్ద రాతి పెనాన్ని చాపరాయి అంటారు. ఈ పెనం మీద కాల్చిన పెద్ద అట్టుని చాపట్టు అంటారు. మన హోటళ్లలో ఎమ్మెల్యే అట్టు పిలిచేది దీన్నే! అన్నింటికీ మనవైన పేర్లున్నాయి. మనం వాటిని మరిచిపోయాం అంతే! నిజానికి ఇవన్నీ చిరుతిళ్ళే. చిరిమిళ్ళని వేరుగా ప్రస్తావించాడంటే, ఇలాంటి ఇంకా అనేక పిండివంటలని అర్థం!

- డా. జి వి పూర్ణచందు, 94401 72642

Updated Date - Oct 27 , 2024 | 10:26 AM