Share News

T20 World Cup Afghan semis : అఫ్ఘాన్‌ అద్భుతః

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:33 AM

వాట్‌ ఏ మ్యాచ్‌! హైడ్రామా, సస్పెన్స్‌, సంబరాలు, భావోద్వేగాలతో పాటు వరుణుడి దోబూచులాట.. వెరసి అఫ్ఘాన్‌ సేన సగర్వంగా తలెత్తుకునేలా, అంతులేని ఆనందంతో ముగిసిన ఈ పోరు.. ఏ మసాలా సినిమాకూ తీసిపోని మలుపులతో సాగింది. సెమీస్‌ బెర్త్‌ కోసం బంగ్లాదేశ్‌తో గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో అఫ్ఘాన్‌ చేసింది

T20 World Cup Afghan semis : అఫ్ఘాన్‌  అద్భుతః

  • బంగ్లాదేశ్‌పై ఉత్కంఠ విజయం

  • రషీద్‌, నవీనుల్‌లకు నాలుగేసి వికెట్లు

  • ఆస్ట్రేలియా అవుట్‌

  • టీ20 వరల్డ్‌కప్‌

వాట్‌ ఏ మ్యాచ్‌! హైడ్రామా, సస్పెన్స్‌, సంబరాలు, భావోద్వేగాలతో పాటు వరుణుడి దోబూచులాట.. వెరసి

అఫ్ఘాన్‌ సేన సగర్వంగా తలెత్తుకునేలా, అంతులేని ఆనందంతో ముగిసిన ఈ పోరు.. ఏ మసాలా సినిమాకూ తీసిపోని మలుపులతో సాగింది. సెమీస్‌ బెర్త్‌ కోసం బంగ్లాదేశ్‌తో గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో అఫ్ఘాన్‌ చేసింది 115 పరుగులే. ఇంకేం.. వారి ఆశలు గల్లంతైనట్టేనని అనుకున్న స్థితిలో బౌలర్లు పట్టు వదల్లేదు. సులువుగా నెగ్గాల్సిన బంగ్లాను ముప్పుతిప్పలు పెడుతూ పేసర్‌ నవీనుల్‌ హక్‌, స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ముచ్చెమటలు పట్టించారు. ఆధిపత్యం అటూ.. ఇటూ మారుతూ వచ్చినా చివరకు తమ క్రికెట్‌ చరిత్రలోనే చిరస్మరణీయ విజయంతో అఫ్ఘాన్‌ సెమీస్‌ చేరింది. ఇక వీరి గెలుపుతో బంగ్లాతో పాటు ఆస్ట్రేలియా కూడా ఇంటిబాట పట్టక తప్పలేదు.

కింగ్స్‌టౌన్‌: తాజా టీ20 వరల్డ్‌క్‌పలో అఫ్ఘాన్‌ వీరులు మరోసారి తమ సత్తాను చాటుకున్నారు. మంగళవారం అత్యంత నాటకీయ పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్‌-8 ఆఖరి మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన 8 పరుగుల తేడాతో గెలిచిన ఈ జట్టు.. తొలిసారిగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం రషీద్‌ సేన దక్షిణాఫ్రికాతో తొలి సెమీ్‌సలో తలపడనుంది. 2022 మెగా టోర్నీలో ఒక్క విజయం కూడా అందుకోని అఫ్ఘాన్‌ ఈసారి మాత్రం న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలను మట్టికరిపిస్తూ టైటిల్‌ రేసులోనూ ఉన్నామంటూ చాటుకోవడం విశేషం. ఇక, మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్‌ గుర్బాజ్‌ (43) టాప్‌ స్కోరర్‌. స్పిన్నర్‌ రిషాద్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం మ్యాచ్‌ మధ్యలో వర్షం కారణంగా 19 ఓవర్లకు కుదించగా లక్ష్యాన్ని 114కు మార్చారు. అయితే బంగ్లా 17.5 ఓవర్లలో 105 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్‌ లిట్టన్‌ దాస్‌ (54 నాటౌట్‌) అజేయ పోరాటం ఫలితాన్నివ్వలేదు. రషీద్‌ (4/23), ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ నవీనుల్‌ (4/26) వణికించారు.

సమష్ఠిగా దెబ్బతీశారు..: వాస్తవానికి ఈ మ్యాచ్‌ గ్రూప్‌-1లోని అఫ్ఘాన్‌, బంగ్లా, ఆసీస్‌ జట్లకు కూడా సెమీస్‌ బెర్త్‌ను ఊరించింది. దీనికి తగ్గట్టుగానే బంగ్లా ముందు 116 పరుగుల లక్ష్యమే ఉండడంతో 12.1 ఓవర్లలో గెలిస్తే షంటో సేనకు సువర్ణావకాశం ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకునే వారి ఛేదన సాగింది. కానీ వారి వ్యూహం బెడిసికొట్టింది. ముఖ్యంగా ఆరంభ, చివర్లో పేసర్‌ నవీనుల్‌ హక్‌ చెలరేగగా.. మిడిలార్డర్‌ను స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ దెబ్బతీశాడు. దీంతో ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. తొలి ఓవర్‌లో లిట్టన్‌ 4,6తో 13 రన్స్‌ రాబట్టి ఆశలు రేపాడు. కానీ రెండో ఓవర్‌లో ఓపెనర్‌ తన్‌జీద్‌ను పేసర్‌ ఫరూఖి డకౌట్‌ చేయగా... తర్వాతి ఓవర్‌లో పేసర్‌ నవీనుల్‌ మరింత గట్టి షాక్‌ ఇస్తూ కెప్టెన్‌ షంటో (5), షకీబ్‌ (0)లను వరుస బంతుల్లో అవుట్‌ చేశాడు. ఈ దశలో పది నిమిషాలపాటు వర్షం అంతరాయం కలిగించింది. అటు బంగ్లా కూడా సెమీస్‌ కోసం కాకుండా ఓదార్పు విజయంపై దృష్టి పెట్టింది. కానీ రషీద్‌ రాకతో వీరి కష్టాలు మరింతగా పెరిగాయి. వరుస ఓవర్లలో కీలక నాలుగు వికెట్లు తీయడంతో బంగ్లా 80/7 స్కోరుతో ఒత్తిడిలో పడింది. అయినా అప్పటికీ 9 ఓవర్లలో కేవలం 34 పరుగులు చేస్తే చాలు. ఓవైపు లిట్టన్‌ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నా మరో ఎండ్‌లో అతడికి తోడ్పాటు అందలేదు. బౌలర్లు పకడ్బందీగా బంతులు వేయడంతో వికెట్‌ కాపాడుకునేందుకు లిట్టన్‌ కూడా భారీ షాట్లు ఆడలేదు. నెమ్మదిగా సమీకరణం 12 బంతుల్లో 12 పరుగులకు మారడంతో అఫ్ఘాన్‌ మరింత పట్టు బిగించింది. 18వ ఓవర్‌లో నవీనుల్‌ వరుస బంతుల్లో చివరి రెండు వికెట్లు తీయడంతో బంగ్లా షాక్‌లో మునిగిపోగా.. అఫ్ఘాన్‌ సంబరాలు ఆకాశాన్నంటాయి.

గుర్బాజ్‌ ఒక్కడే..: టాస్‌ గెలిచిన అఫ్ఘాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకోగా.. ఓపెనర్‌ గుర్బాజ్‌ మాత్రమే బంగ్లా బౌలర్లను ఎదుర్కోగలిగాడు. అయితే చివర్లో రషీద్‌ 3 సిక్సర్లతో కీలక పరుగులు అందజేశాడు. మరో ఓపెనర్‌ జద్రాన్‌ (18) కాస్త సహకారం అందించడంతో తొలి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యంతో మంచి స్థితిలోనే నిలిచింది. కానీ ఆ తర్వాత స్పిన్నర్‌ రిషాద్‌, పేసర్‌ ముస్తాఫిజుర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. దీంతో ఓవర్లు కరుగుతున్నా స్కోరు కదల్లేదు. 93/5 స్కోరుతో ఇబ్బందుల్లో పడిన దశలో రషీద్‌ 18వ ఓవర్‌లో సిక్స్‌, ఆఖరి ఓవర్‌లో రెండు సిక్సర్లతో జట్టు స్కోరు వంద దాటింది.

సంక్షిప్త స్కోర్లు

అఫ్ఘానిస్థాన్‌: 20 ఓవర్లలో 115/5 (గుర్బాజ్‌ 43, రషీద్‌ 19 నాటౌట్‌, జద్రాన్‌ 18; రిషద్‌ 3/26).

బంగ్లాదేశ్‌: 17.5 ఓవర్లలో 105 ఆలౌట్‌ (లిట్టన్‌ దాస్‌ 54 నాటౌట్‌, హ్రిదయ్‌ 14; రషీద్‌ 4/23, నవీనుల్‌ హక్‌ 4/26).


afghan-watching.jpg

మిన్నంటిన సంబరాలు

టీ20 ప్రపంచక్‌పలో అఫ్ఘానిస్థాన్‌ జట్టు సెమీస్‌ చేరడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. తమ క్రికెట్‌ జట్టు అద్భుత విజయాన్ని పురస్కరించుకొని అభిమానులు వేలసంఖ్యలో వీధుల్లో గుమిగూడారు. మిఠాయిలు పంచుకోవడంతో పాటు ర్యాలీలు తీస్తూ సంతోషాన్ని పంచుకున్నారు. ఇప్పుడీ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

Updated Date - Jun 26 , 2024 | 07:05 AM