Rohit-Virat: రోహిత్, కోహ్లీ రిటైర్‌మెంట్‌పై కొత్త ట్విస్టు.. ఇది నిజంగా షాకింగే!
ABN , Publish Date - Jul 23 , 2024 | 09:11 PM
టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు టైటిల్ గెలిచిన తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ తమ అభిమానులకు దిమ్మతిరిగే షాకిచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20లకు రిటైర్‌మెంట్..
టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు టైటిల్ గెలిచిన తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో (Virat Kohli) పాటు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తమ అభిమానులకు దిమ్మతిరిగే షాకిచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించి పెద్ద బాంబ్ పేల్చారు. అసలు వాళ్లిద్దరి నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. తొలుత ప్రెజెంటేషన్ ఈవెంట్‌లో కోహ్లీ టీ20లకు గుడ్‌బై చెప్పగా.. అనంతరం విలేకరుల సమావేశంలో రోహిత్ తన రిటైర్‌మెంట్‌ని అనౌన్స్ చేశాడు. ఇప్పుడు వీరి రిటైర్‌మెంట్ వ్యవహారంలో మరో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్టు వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా.. ఏ ఆటగాడైనా రిటైర్‌మెంట్ ప్రకటించడానికి ముందు, దాని గురించి తన తోటి ఆటగాళ్లతో చర్చిస్తాడు. కానీ.. రోహిత్, కోహ్లీ అలా చేయలేదట. అసలు వారి నిర్ణయం ప్రీ-ప్లాన్డ్ కాదని.. ఏ ఒక్కరితోనూ దాని గురించి ముందుగా చర్చించలేదని తెలిసింది. ఈ విషయాన్ని బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే (Paras Mhambrey) వెల్లడించాడు. వారి టీ20 రిటైర్‌మెంట్ కేవలం అభిమానులకే కాదు.. జట్టు సభ్యులకు, సహాయక సిబ్బందికి కూడా ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నాడు. వాళ్లు ముందుగానే దీని గురించి తమతో చర్చించి ఉంటే తమకు తెలిసేదని, కానీ వాళ్లు ఎవ్వరకీ చెప్పలేదని అన్నాడు. వ్యక్తిగతంగా రాహుల్ ద్రవిడ్‌కి చెప్పి ఉండొచ్చు గానీ.. జట్టు సభ్యులకు లేదా ఏ ఇతర స్టాఫ్‌కు తెలియజేయలేదని చెప్పాడు. వాళ్లిద్దరు రిటైర్‌మెంట్ ప్రకటించినప్పుడు తాను కూడా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యానని తెలిపాడు.
అయితే.. దశాబ్దకాలం నుంచి టీ20ల్లో కొనసాగుతున్న రోహిత్, కోహ్లీతో పాటు రవీంద్ర జడేజాకు ఇంతకంటే గొప్ప వీడ్కోలు ఉండదని మాంబ్రే అభిప్రాయపడ్డాడు. చాలా సంవత్సరాల నుంచి కోహ్లీ మరో వరల్డ్‌కప్ కొట్టాలని ఎంతో తాపత్రయపడ్డాడని, అందుకోసం తీవ్ర కసరత్తులు చేశాడని గుర్తు చేశాడు. ఎట్టకేలకే ఇన్నేళ్ల తర్వాత అతని కల నెరవేరడంతో.. ఒక ఆటగాడిగా అతను టీ20 ఫార్మాట్‌లో తన ప్రయాణం పూర్తి చేసుకున్నట్లు అయ్యిందని పేర్కొన్నాడు. వరల్డ్‌కప్ గెలవడం కన్నా మరో గొప్ప అనుభూతి ఉండదని.. వాళ్లు తీసుకున్న నిర్ణయం సరైనదేనని చెప్పుకొచ్చాడు.
Read Latest Sports News and Telugu News