David Warner: వార్నర్ యూటర్న్.. రిటైర్మెంట్ పై కీలక ప్రకటన
ABN , Publish Date - Oct 22 , 2024 | 05:44 PM
ఈ ఏడాది ఆరంభంలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన వార్నర్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఓపెనింగ్ కాంబినేషన్‌పై అనిశ్చితి పెరుగుతున్న సమయంలో వార్నర్ ప్రకటన కీలకంగా మారింది.
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలక అప్ డేట్ ఇచ్చాడు. భారత్ తో జరగబోయే టెస్టు సిరీస్ లో టాప్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఆడేందుకు పిలుపొస్తే కచ్చితంగా ఆడతానని తెలిపాడు. ఈ ఏడాది ఆరంభంలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన వార్నర్ కు ఇప్పటివరకు 112 టెస్టుల్లో ఆడిన ఘనత ఉంది. భారత్ టెస్ట్ సిరీస్ కు ముందు ఫేస్ షీల్డ్ టోర్నీలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపాడు. ఆస్ట్రేలియా ఓపెనింగ్ కాంబినేషన్‌పై అనిశ్చితి పెరుగుతున్న సమయంలో వార్నర్ ప్రకటన కీలకంగా మారింది.
ఫామ్ గురించి బెంగ లేదు
’ఆస్ట్రేలియా కోసం ఆడమని జట్టు నుంచి ఎప్పుడు ఫోన్ వచ్చినా వెళ్లేందుకు నేను రెడీగా ఉన్నాను. ఆస్ట్రేలియా తన చివరి టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరిలో ఆడింది. నేను జనవరిలో ఆడాను అంతే తేడా. నా ఫామ్ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు‘ అంటూ వార్నర్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
భారత్‌తో జరగబోయే సిరీస్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో టాప్‌లో ఉన్న ఖాళీని భర్తీ చేయడానికి ఆస్ట్రేలియాకు సరైన ప్లేయర్ దొరకడం లేదు. ఒకవేళ తనను పిలిస్తే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈ ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ వెల్లడించాడు. పాకిస్థాన్ టెస్టు సిరీస్ తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో వార్నర్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను ఇప్పటివరకు 112 మ్యాచ్‌లలో 26 సెంచరీలు, 37 అర్ధసెంచరీలతో సహా 8786 పరుగులతో టెస్టుల్లో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను అందించాడు.