Share News

IPL 2025: ఐపీఎల్ మెగా వేలం.. ఆ అంశంపై షారుఖ్, వాడియా మధ్య వాగ్వాదం

ABN , Publish Date - Aug 01 , 2024 | 03:33 PM

ఐపీఎల్ మెగా వేలం రాబోతున్న తరుణంలో.. ఫ్రాంచైజీ యజమానులు, ఐపీఎల్ పాలక మండలి మధ్య సమావేశం జరిగింది. ముంబై వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ భేటీలో..

IPL 2025: ఐపీఎల్ మెగా వేలం.. ఆ అంశంపై షారుఖ్, వాడియా మధ్య వాగ్వాదం
IPL Mega Auction

ఐపీఎల్ (IPL) మెగా వేలం రాబోతున్న తరుణంలో.. ఫ్రాంచైజీ యజమానులు, ఐపీఎల్ పాలక మండలి మధ్య సమావేశం జరిగింది. ముంబై వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ భేటీలో.. మెగా వేలం నిర్వహణ, రిటెన్షన్, ఇంపాక్ట్ రూల్‌పై ప్రధానంగా చర్చించారు. అయితే.. ఇది అసంపూర్తిగానే ముగిసిందని, ముఖ్యంగా మెగా వేలం నిర్వహణకు ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరచలేదని తెలుస్తోంది. ఈ సందర్భంగానే.. కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ (Shahrukh Khan), పంజాబ్ కింగ్స్ యజమాని నెస్ వాడియా (Ness Wadia) మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం.


షారుఖ్, వాడియా మధ్య వాగ్వాదం

ఐపీఎల్-2025కు నిర్వహించబోయే మెగా వేలాన్ని షారుఖ్ ఖాన్ వ్యతిరేకిస్తూ.. రిటెన్షన్ ఆటగాళ్ల పరిమితిని పెంచాల్సిందిగా షారుఖ్ ఈ భేటీలో గొంతెత్తినట్టు తెలిసింది. కేవలం నలుగురిని మాత్రమే కాదు.. ఎక్కువ మందిని రిటైన్ చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఫలితంగా.. భవిష్యత్తులో సూపర్‌స్టార్లు ఎదిగే ఆటగాళ్లకు మద్దతు ఇచ్చినట్లు అవుతుందన్న విషయాన్ని హైలైట్ చేశారట. అయితే.. నెస్ వాడియా మాత్రం రిటెన్షన్ సంఖ్యను పెంచాల్సిన అవసరం లేదని, నలుగురు మాత్రమే చాలని వాదించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. షారుఖ్, వాడియా మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుందని వార్తలొస్తున్నాయి. ఇదే సమయంలో షారుఖ్‌కు సన్‌రైజర్స్ యాజమాన్యం మద్దతు తెలిపిందని, కనీసం 8 మందిని రిటైన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు.


నెక్ట్స్ ఏంటి?

బుధవారం రాత్రి జరిగిన ఈ సమావేశం అసంపూర్తిగా ముగిసింది కాబట్టి.. మరోసారి భేటీ జరగొచ్చని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మేగా వేలంపై ఇంకా ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని, అదే రిటెన్షన్ సంఖ్యను నిర్దేశించనుందని చెప్తున్నాయి. ఒకవేళ బీసీసీఐ మెగా వేలం నిర్వహించకూడదని భావిస్తే.. అప్పుడు రిటెన్షన్ అవసరమే ఉండకపోవచ్చని అంటున్నాయి. ఇంపాక్ట్ రూల్‌పై విమర్శలు వస్తున్నా.. దాని వల్ల కొత్త వారికి అవకాశం లభిస్తుందని కొన్ని ఫ్రాంచైజీలు అభిప్రాయపడినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అలాగే.. మెగా వేలం అంశంపై షారుఖ్, వాడియా మధ్య వాగ్వాదం జరిగిందని.. వేలం నిర్వహించొద్దని షారుఖ్ పేర్కొంటే, అందుకు వ్యతిరేకంగా వాడియా వాదించారని స్పష్టం చేశాయి. మరి.. మెగా వేలం నిర్వహిస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.


కావ్య మారన్ వాదన ఏంటి?

ఒక జట్టును నిర్మించడానికి చాలా సమయం పడుతుందని, అలాగే యువ ఆటగాళ్లు పరిణతి చెందడానికి కూడా కొంత టైం పడుతుందని కావ్య మారన్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఇందుకు అభిషేక్ శర్మ ప్రస్థానాన్ని ఉదహరించారు. అభిషేక్‌కు ఇప్పుడున్న స్థానానికి చేరుకోవడానికి మూడేళ్ల సమయం పట్టిందని, ఇతర జట్లలోనే ఇలాంటి ఆటగాళ్లు ఎందరో ఉన్నారన్న విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందేనని అన్నారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Aug 01 , 2024 | 04:25 PM