Share News

India vs Zimbabwe: విధ్వంసం సృష్టించిన భారత బ్యాటర్లు.. జింబాబ్వేకి భారీ లక్ష్యం

ABN , Publish Date - Jul 07 , 2024 | 06:17 PM

జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. రెండో మ్యాచ్‌లో భారత జట్టు విధ్వంసం సృష్టించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు...

India vs Zimbabwe: విధ్వంసం సృష్టించిన భారత బ్యాటర్లు.. జింబాబ్వేకి భారీ లక్ష్యం
India vs Zimbabwe

జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. రెండో మ్యాచ్‌లో భారత జట్టు విధ్వంసం సృష్టించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఈ మైదానంలో ఇదే అత్యధిక స్కోరు. అభిషేక్ శర్మ (100) శతక్కొట్టడంతో పాటు రుతురాజ్ గైక్వాడ్ (77), రింకూ సింగ్‌ (48) మెరుపులు మెరిపించడం వల్లే.. టీమిండియా అంత భారీ స్కోరు చేసి, ప్రత్యర్థి జట్టుకి 235 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.


తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత జట్టుకి ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. రెండో ఓవర్‌లోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (2) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. అప్పుడు మరో ఓపెనర్ అభిషేక్, వన్ డౌన్‌లో వచ్చిన రుతురాజ్.. క్రీజులో కుదురుకోవడం కోసం కొంత సమయం తీసుకున్నారు. ఇక తాము మైదానంలో సెటిల్ అయ్యాక.. తన బ్యాట్‌కి పని చెప్పడం స్టార్ట్ చేశాడు. ముఖ్యంగా.. అభిషేక్ శర్మ తాండవం చేశాడు. ఓవైపు రుతురాజ్ నిదానంగా ఆడుతూ స్ట్రైక్ అందిస్తే.. మరోవైపు అభిషేక్ ఆకాశమే హద్దుగా చితక్కొట్టేశాడు. ఎడాపెడా షాట్లతో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. క్రీజులో ఉన్నంతసేపు మైదానంలో బౌండరీల సునామీ సృష్టించాడు. ఈ క్రమంలోనే అతను 47 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు.


అయితే.. ఆ వెంటనే అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత రింకూ సింగ్, రుతురాజ్‌లు కలిసి జింబాబ్వే బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. అప్పటివరకూ నిదానంగా ఆడిన రుతురాజ్ సైతం అర్థశతకం చేశాక సింహంలా జూలు విదిల్చాడు. అటు.. రింకూ సింగ్ కూడా తన తడాఖా చూపించాడు. మొదట్లో కాస్త తడబడినా.. ఆ తర్వాత పరిస్థితుల్ని అర్థం చేసుకొని, భారీ బౌండరీలు బాదేశాడు. ఇలా ఈ ఇద్దరూ చెలరేగి, భారత జట్టుకి భారీ స్కోరుని అందించడంలో కీలక పాత్ర పోషించారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, వెల్లింగ్టన్ చెరో వికెట్ తీశారు. మరి.. 235 పరుగుల భారీ లక్ష్యాన్ని జింబాబ్వే ఛేదిస్తుందా? లేదా? అనేది చూడాలి.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 07 , 2024 | 06:18 PM