Share News

Jasprit Bumrah: రోహిత్ శర్మ-పాండ్యా కెప్టెన్సీ వివాదంపై తొలిసారి స్పందించిన జస్ప్రీత్ బుమ్రా

ABN , Publish Date - Jul 26 , 2024 | 08:56 AM

టీ20 వరల్డ్ కప్ 2024 గెలుపులో వైస్ కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించడంతో హార్దిక్ పాండ్యాను విమర్శించిన వారు సైతం మెచ్చుకున్నారు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించిన తర్వాత ఏర్పడిన వివాదంపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారి స్పందించాడు.

Jasprit Bumrah: రోహిత్ శర్మ-పాండ్యా కెప్టెన్సీ వివాదంపై తొలిసారి స్పందించిన జస్ప్రీత్ బుమ్రా

ఐపీఎల్ 2024 సీజన్‌లో (IPL 2024) ముంబై ఇండియన్స్ టీమ్ అంతగా ఆకట్టుకోలేకపోయిన విషయం సర్వత్రా తెలిసిందే. ఇక ఆ జట్టులో కెప్టెన్సీ వివాదంపై ఏడాదంతా వార్తలు వచ్చాయి. సీజన్ ఆరంభానికి ముందే రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించడంతో వివాదం మొదలైంది. ఈ నిర్ణయం రోహిత్ శర్మ అభిమానులకు రుచించలేదు. దీనికి ముంబై ఇండియన్స్ మైదానంలో రాణించలేకపోవడం, వ్యక్తిగతంగా హార్దిక్ పాండ్యా కూడా ఆకట్టుకోలేకపోవడంతో అతడిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వాంఖడే స్టేడియంలో అయితే కొంతమంది అభిమానులు పాండ్యాను ఎగతాళి చేశారు. అయితే టీ20 వరల్డ్ కప్ 2024 గెలుపులో వైస్ కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించడంతో హార్దిక్ పాండ్యాను విమర్శించిన వారు సైతం మెచ్చుకున్నారు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించిన తర్వాత ఏర్పడిన వివాదంపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారి స్పందించాడు.


హార్దిక్ పాండ్యా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు జట్టు అతడికి అండగా నిలిచిందని బుమ్రా చెప్పాడు. ‘‘ భావోద్వేగాలు చర్చనీయాంశంగా ఉన్న దేశంలో మనం జీవిస్తున్నామనే విషయాన్ని కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవాలి. అభిమానులు భావోద్వేగానికి గురవుతారని మనం అర్థం చేసుకోవాలి. ప్లేయర్లు కూడా ఎమోషన్‌కు గురవుతారు. అయితే ఒక భారత ప్లేయర్ అనే విషయంపై ఇలాంటి భావోద్వేగాలు ఎలాంటి ప్రభావం చూపించవు. కానీ సదరు ఆటగాడి అభిమానులకు రుచించకపోవచ్చు. అయితే ప్రతికూల పరిస్థితులనైనా సానుకూలంగా స్వీకరించాలి. అభిమానులు మాట్లాడుతూనే ఉంటారు. వాటిని ఆటగాళ్లు వింటూనే ఉండాలి’’ అని బుమ్రా పేర్కొన్నాడు.


‘‘ ఆటగాళ్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు అతడి సన్నిహితులు అండగా నిలుస్తుంటారు. ఒక జట్టుగా ఇలాంటి పరిస్థితులను ప్రోత్సహించము. పాండ్యాతో మాట్లాడే వాళ్లం. కొన్ని కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. అయితే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పరిస్థితులు అన్ని మారిపోయాయి’’ అని బుమ్రా అన్నాడు. ఈ మేరకు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అడ్డా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుమ్రా చెప్పాడు.


‘‘కెప్టెన్సీ వివాదాన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆటగాళ్లంతా అభిమప్రజల ప్రశంసలు పొందుతున్నారు. అయితే ఈ పరిస్థితి ఎప్పటికీ ఉంటుందని చెప్పలేం. ఒక మ్యాచ్ ఓడిపోతే ఇప్పుడున్న కథ మళ్లీ మారిపోవచ్చు. జనాల్లో అమితమైన ఆదరణ పొందిన ఆట ఆడుతున్నాం కాబట్టి ప్రతి క్రీడాకారుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాడు. ఫుట్‌బాల్‌లో కూడా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లను గేలి చేస్తుంటారు. వాళ్లు ఎగతాళిని ఎదుర్కొంటుంటారు. ఇదేమీ మంచి విషయం కాదు. అయితే ఆటలో చాలా గొప్ప విషయాలు ఉంటాయి. ఒక జట్టుగా ఒక వ్యక్తిని వదులుకోలేం. మేము ఒకరికొకరం సాయం చేసుకుంటాం. హార్దిక్‌ పాండ్యా యువకుడే కావొచ్చు. కానీ అతడితో నేను చాలా కాలం క్రికెట్ ఆడాను. ఈ విషయాన్ని పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మేమిద్దరం కలిసే ఉన్నాం. పాండ్యాకు అవసరమైతే అండగా నిలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అని జస్ప్రీత్ బుమ్రా పేర్కొన్నాడు.

Updated Date - Jul 26 , 2024 | 09:02 AM