Share News

KL Rahul: రాహుల్‌ను వదిలేసిన లక్నో.. దుమారం రేపుతున్న సంజీవ్ గొయెంకా వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 01 , 2024 | 12:58 PM

కేఎల్ రాహుల్‌ను వదిలేసిన తర్వాత జట్టు యజమాని సంజీవ్ గొయెంకా కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారి గొయెంకాను చిక్కుల్లో పడేశాయి.

KL Rahul: రాహుల్‌ను వదిలేసిన లక్నో.. దుమారం రేపుతున్న సంజీవ్ గొయెంకా వ్యాఖ్యలు
Sanjiv Goenka, KL Rahul

ముంబై: లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకాపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఐపీఎల్ మెగా వేలం సందర్భంగా జట్టు నుంచి ఆటగాళ్లను వదిలేయడంపై గొయెంకా నిన్న సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై నెట్టింట దుమారం రేగుతోంది. అతని వ్యాఖ్యలు రాహుల్ ను పరోక్షంగా కించపరిచేలా ఉన్నాయంటూ అతడి ఫ్యాన్స్ మండిపడుతున్నారు.


ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు, అన్ని జట్లు తమ మార్పులను వెల్లడించాయి. లక్నో సూపర్ జెయింట్స్ ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. అందులో కేఎల్ రాహుల్ పేరు లేదు. రాహుల్ గత మూడు సీజన్లలో జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే గతేడాది జట్టు యజమాని సంజీవ్ గోయెంకాతో రాహుల్ కి స్వల్ప విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. తరువాత ఇద్దరూ కలిసి కనిపించారు కానీ ఈసారి జట్టు మేనేజ్‌మెంట్ కెఎల్ రాహుల్‌ను చేర్చుకోవడానికి సుముఖంగా లేదు. అతని పేరు నిలుపుదలలో లేకపోవడానికి ఇదే కారణం అయ్యుండొచ్చని సమాచారం. ఇక రిటెన్షన్ సమయంలో కేఎల్ రాహుల్ పేరెత్తకుండా పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సంజీవ్ గోయెంకాను చిక్కుల్లో పడేశాయి.


’’ఆటగాళ్ల ఎంపికలో మేము ఒక్కటే విషయాన్ని పరిగణనలోకి తీసుకొన్నాం. జట్టును గెలిపించాలనే ఉద్దేశం కలిగిన ఆటగాళ్లతోనే ముందుకు వెళ్లేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అందుకే గెలవాలన్న లక్ష్యంతో ఉన్నవారినే ఎంపిక చేశాం. వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుకుని ఆడేవారిని వదులుకున్నాం. జట్టు విజయం కోసం శ్రమించేవారికే ప్రాధాన్యమిచ్చాం‘‘ అని గొయెంకా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లోనూ అగ్గిరాజేశాయి.

సంజీవ్ మాటల్లో వ్యక్తిగత అనే పదం రాహుల్ అభిమానులను తీవ్రంగా డిస్ట్రబ్ చేస్తున్నాయి. జట్టు కోసం పరితపించే వ్యక్తిని ఇంత మాట అనడం దారుణమంటూ మండిపడుతున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు సైతం లక్నో జట్టు యజమాని వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 01 , 2024 | 12:58 PM