ICC Champions Trophy: కాంప్రమైజ్ కావాల్సిందే.. పాక్ బోర్డుకు ఐసీసీ స్ట్రాంగ్ మెసేజ్..
ABN , Publish Date - Nov 19 , 2024 | 03:14 PM
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీపై ఇంకా సందిగ్దత వీడటం లేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈ సమస్యకు ముగింపు పలికేందుకు ఐసీసీ మరో అడుగు ముందుకేసింది. ఈ సారి పీసీబీకి మరోసారి స్ట్రాంగ్ మెసేజ్ పంపింది. దీనిపై పాక్ బోర్డు ఏ విధంగా స్పందిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.
ముంబై: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మొత్తంగా తమ దేశంలోనే నిర్వహించాలని పట్టుబట్టిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు రోజుకో షాక్ తగులుతోంది. ఈ ట్రోఫీ కోసం పాక్ లో పర్యటించేందుకు భారత జట్టు ససేమిరా అంటోన్న విషయం తెలిసిందే. ఇటీవల పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో ట్రోఫీ కి ప్రచారం కల్పించేందుకు పాక్ సిద్ధమైంది. ఈ చర్యను భారత్ చాకచక్యంగా తిప్పికొట్టింది. ఐసీసీనే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పీసీబీకి వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజాగా ఐసీసీ పాక్ బోర్డుకు మరోసారి వార్నింగ్ ఇచ్చినంత పని చేసింది. తటస్థ వేదికపైనే ట్రోఫీని నిర్వహించేందుకు అంగీకరించాలని కోరింది. లేదంటే పాక్ బోర్డు ఒక్క నిర్ణయం వల్ల మొత్తం ఐసీసీ ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని తెలిపినట్టు సమాచారం. ఐసీసీకి చెందిన కీలక అధికారులు కొందరు పీసీబీని కాంప్రమైజ్ చేసేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. దుబాయ్ వంటి తటస్థ వేదికపై ట్రోఫీ నిర్వహించేందుకు అంగీకరించాలని కోరినట్టు సమాచారం అందుతోంది. పీసీబీ ఇందుకు ఒప్పుకోకపోతే.. ఈ ట్రోఫీ కారణంగా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ స్పెక్ట్రమ్‌లో టీమిండియాకు కాసులు కురిపించే జట్టుగా పేరుంది. ఒకవేళ పాక్ కారణంగా భారత జట్టు ఐసీసీ ట్రోఫీలో పాల్గొనకపోతే ఈ టోర్నమెంట్ లో కచ్చితంగా నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఐసీసీ కూడా త్వరలోనే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించే చాన్స్ ఉంది.
ట్రోఫీని నిర్వహించే జట్టు.. ఇందులో పాల్గొనబోయే జట్లతో మేము ఇంకా చర్చలు జరుపుతున్నాం. మరో రెండు రోజుల్లో షెడ్యూల్ వివరాలను వెల్లడిస్తాం అని ఐసీసీ వర్గాలు చెప్పినట్టు సమాచారం. గతంలో మ్యాచ్ వేదికపై పాక్ బోర్డు ఛైర్మన్ మోషిన్ నఖ్వీ కఠిన వైఖరిని కనబరిచాడు. ‘‘మాకు పాకిస్తాన్ గౌరవమే అన్నింటికన్నా ముఖ్యం. దాని తర్వాతే మాకు ఏదైనా. మేం చెప్పదలుచుకున్నది క్లియర్ గా చెప్పాం. ఇంక ఈ విషయంలో ఇదే మా నిర్ణయం అని తెలిపాడు. ఛాంపియన్ ట్రోఫీలో సెలక్ట్ అయిన మిగతా జట్లకు పాక్ లో పర్యటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ భారత్ కు ఏవైనా అభ్యంతరాలుంటే పాక్ బోర్డుతో చర్చించాలి. నాకు తెలిసి భారత్ నో చెప్పేందుకు ఎలాంటి కారణాలు మాకు కనిపించడం లేదు. అన్ని జట్లు పాక్ పర్యటనలో పాల్గొంటాయని భావిస్తున్నాం’’ అని నఖ్వీ తెలిపాడు.